Friday, February 21, 2025
Homeవిశ్లేషణధరలు పతనం… రైతు బలి

ధరలు పతనం… రైతు బలి

వ్యవసాయం చేస్తున్న రైతు తీవ్ర మనస్థాపంతో ఉన్నాడు. ఏ పంట కూడా గిట్టుబాటు గాని పరిస్థితిలో వ్యవసాయం ఉన్నది. అడవులను ఆక్రమించడం వలన పులులు, వైరస్‌ లు జనం మధ్యకు వస్తున్నాయి. అన్ని పంటలకు వైరస్‌ జబ్బులు, తెగుళ్లు ఎక్కువైపోయాయి. పురుగు మందులు పనిచేయటం లేదు. ఇంకా ఇంకా ఖరీదైన పురుగు మందుల ప్రయోగించటం తప్పడం లేదు. మందుల కంపెనీల కోసం, కార్పొరేట్‌ కంపెనీల కోసం, దళారీల లాభాల కోసం, ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా పన్నులు కట్టడం కోసం భారీగా పెట్టుబడులు పెట్టి రైతు వ్యవసాయం చేయవలసి వస్తుంది.
మిర్చి, పొగాకు ధరలు, ధాన్యం ధర, శనగల రేట్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఎకరానికి లక్షన్నర నుండి రెండు లక్షల వరకు పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎకరానికి 50 వేల నుండి లక్ష రూపాయల వరకు రైతు నష్టాలను చవిచూస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాలలో మిర్చి సాగు చేశారు. గత ఏడాది పండిన మిర్చి పంట అమ్ముడు పోగా మిగిలిన 15 లక్షల బస్తాలు కోల్డ్‌ స్టోరేజీలలో నిలవ ఉన్నాయి. ఈ సంవత్సర పంట చేతికి రాగానే, కొత్త పంటల ధరల పతనం ప్రారంభమైంది. గత సంవత్సరం క్వింటాల్‌ మిర్చి 20,000 రూపాయల వరకు పలికిన ధర ఈ ఏడాది 8 నుండి 13 వేల రూపాయల లోపలనే ఉన్నది. ధరలు సగానికి పైగా పడిపోయాయి. పంటను అమ్ముకోలేక కోల్డ్‌ స్టోరేజీ గిడ్డంగులలో దాచుకునే స్థోమత లేక, పెట్టుబడికి వడ్డీలు కట్టలేక రైతులు మనోవ్యధకు గురవుతున్నారు. ప్రభుత్వం మేలుకొని మార్కెట్‌ జోక్యం పథకం ద్వారా మార్కెట్లో మిర్చి పంటను కొని రైతులకు ఆసరా ఇవ్వాలి.
శనగ ధరలు దారుణంగా పడిపోయాయి. గత సంవత్సరం తెల్ల శనగ పదివేల రూపాయల కు పైగానే వున్నది. పదివేల పై మార్కెట్‌ ఎక్కువ కాలం నిలబడకపోవడం వలన ఎక్కువ మంది రైతులు ఆ ధరకు అమ్ముకోలేక పోయారు. పదివేల రూపాయల ఆశను రైతులకు చూపించారు. ఈరోజున తెల్లశనగ ధర 6500 కి మించలేదు. 7200 రూపాయలకు కొన్న ఎర్రశనగ ఈరోజున 5600 కి కొంటున్నారు. ఈ మార్కెట్‌ మాయాజాలం వలన ఎందరో రైతులు బలవుతున్నారు. శనగ విత్తనాలను 9వేల రూపాయలకు ఆర్‌ బీ కే ల ద్వారా రైతులకు ఇచ్చారు. కనీసం 9 వేల రేటుకు కొనుగోలు చేయాలికదా?
గత సంవత్సరం పొగాకు పంట ధరలు బాగా ఉండటంతో రైతులు విస్తారంగా బర్లీ పొగాకును సాగు చేశారు. సాగు ఖర్చులు పెరిగినా కూడా కొంచెం మిగులుతుందనే ఆశతో పొగాకు పంటను ఎక్కువమంది రైతులు సాగు చేశారు. పొలం లేని రైతులు కూడా 30-40,000 రూపాయలు పైగా కౌలు చెల్లించి పొగాకును సాగు చేశారు. ప్రస్తుతం బర్లీ పొగాకును చురుకుగా కొనటం లేదు. గత సంవత్సరం మొదటి విరుపు అడుగు ఆకు కొట్టిన తర్వాత అమ్మితే ఎనిమిది – పదివేల రూపాయలకు కొన్నారు. ఎనిమిది, పదివేలకి కొన్నటువంటి పొగాకును ఇప్పుడు ఈ సంవత్సరం 4-5 వేల రూపాయలకు కొంటున్నారు. రెండో వలుపు, మూడో వలుపు పొగాకును గత సంవత్సరం 15000- 18000 కి కొన్నారు. ఈ సంవత్సరం పదివేల రూపాయలకైనా కొంటారా లేదా అనే సందిగ్ధంలో రైతు ఉన్నాడు. పొగాకు థరలు ఇంకా పడిపోతాయంటున్నారు. సిగరెట్‌, బీడీ ధరలు తగ్గలేదు. కంపెనీల లాభాలు తగ్గలేదు. కంపెనీల షేర్ల ధరలు పెరుగుతూనే వున్నాయి. రైతులు పండిరచిన పంటలకు ధరలు తగ్గిపోవడంతో పెట్టిన ఖర్చులు కూడా రానప్పుడు రైతు మాయమయ్యే పరిస్థ్ధితులు ఏర్పడ్డాయి. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి పొగాకు ధర పడిపోకుండా చూడాలి.
ఎఫ్‌ సి వి వర్జీనియా పొగాకు ధరలను, విస్తీర్ణాన్ని పొగాకు బోర్డు నియంత్రిస్తున్నది. అదేవిధంగా పొగాకు బోర్డు జోక్యం చేసుకొని బర్లీ పొగాకు పంట ధర పడిపోకుండా పొగాకు బోర్డు చూడాలి. కంపెనీల చేత సరి అయిన ధరకు కొనిపించాలి. రైతులకు సరైన ధర వచ్చేటట్లు చేయాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి ఆ ధరకు కొంటే రైతులకు మేలు జరుగుతుంది కదా. రైతులు ఉద్యమించాలి. సరైన ధరలను సాధించాలి.

సెల్‌: 9000657799

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు