ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటి పత్రికా స్వేచ్ఛపై ప్రపంచ వ్యాప్తంగా నియంత్రణల నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తాజా పరిణామాల్లో భాగంగా, వైట్‌హౌస్‌లోకి సీఎన్ఎన్, ఎంఎస్ఎన్బీసీ, పొలిటికో వంటి ప్రముఖ అంత ర్జాతీయ మీడియా సంస్థల ప్రవేశాన్ని నిషేధిస్తూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తమ విధానాలను విమర్శించే కథనాలను ‘ఫేక్ న్యూస్’గా ముద్రవేసి, పాత్రికేయులను అధికారిక సమావేశాల నుంచి బహిష్కరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలకే ప్రమాదకరమైన సంకేతం. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఇది అరుదుగా కన్పిస్తోంది. ఇప్పుడు అమెరికాలోనూ ఇదే పరిస్థితి దాపురించింది. అంటే అక్కడా…ఇక్కడా… నియంతృత్వ తరహా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయనడానికి ఇది నిదర్శనం. అమెరికాలో రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాసేలా సాగిన ఈ చర్యపై బాధిత సంస్థలు న్యాయపోరాటానికి సిద్ధమవడం పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో కీలక పరిణామం. నిజానికి ప్రపంచంలోనే అతి పురాతన లిఖిత రాజ్యాంగం కలిగిన అమెరికాలో పత్రికా స్వేచ్ఛకు తిరుగులేని రక్షణ ఉంది. అమెరికా రాజ్యాంగంలోని ‘మొదటి సవరణ’ ప్రకారం.. వాక్ స్వాతంత్రాయూన్ని, పత్రికా స్వేచ్ఛను హరించేలా ఎలాంటి చట్టాలు చేసే అధికారం కాంగ్రెస్‌కు లేదు. ప్రభుత్వ విమర్శలను అడ్డుకోవడం, మీడియాకు సమాచార హక్కును నిరాకరించ డం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసింది. చారి త్రకంగా చూస్తే, జాన్ ఆడమ్స్ కాలం నాటి ‘సెడిషన్ యాక్ట్1798’, రిచర్డ్ నికస్న్ హయాంలో పెంటగాన్ పేపర్స్ లీక్ వ్యవహారం, బరాక్ ఒబామా పాలనలో నిఘా లీకులపై జర్నలిస్టుల ఫోన్ రికార్డులను పరిశీలించిన సంఘటన లు మీడియా స్వేచ్ఛపై ఒత్తిడి తెచ్చాయి. అయితే, బహిరంగంగా ప్రధాన స్రవంతి మీడియా సంస్థలను ‘ప్రజా శత్రువులు’గా సంబోధిస్తూ వైట్‌హౌస్ ప్రవే శాన్ని నిరాకరించిన తీరు ట్రంప్ హయాంలోనే పరాకాష్టకు చేరింది. గతంలో సీఎన్ఎన్ విలేకరి జిమ్ అకోస్టా పాస్‌ను అడ్డుకున్నప్పుడు కూడా న్యాయస్థానం జోక్యం చేసుకుని మీడియా హక్కులను పునరుద్ధరించిన ఉదంతాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను అంతర్జాతీయ స్వతంత్ర సంస్థ ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డ్ర్స్’ (ఆర్ఎస్ఎఫ్) ఏటా ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్’ ద్వారా విశ్లేషిస్తుంది. అత్యధిక స్వేచ్ఛ గల దేశాలూ లేకపోలేదు. నార్డిక్ దేశాలు పత్రికా స్వేచ్ఛలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. నార్వే వరుసగా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, డెన్మార్క్, స్వీడన్, ఐర్లాండ్, ఫిన్లాండ్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బలమైన చట్టపరమైన రక్షణలు, ప్రభుత్వాల పారదర్శకత, జర్నలిస్టుల భద్రత ఇక్కడ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. అతి తక్కువ స్వేచ్ఛ గల దేశాలే ఈ ప్రపంచంలో ఎక్కువ. తీవ్రమైన నియంతృత్వ పాలన ఉన్న ఉత్తర కొరియా, సిరియా, తుర్క్కమెనిస్తాన్ దేశాలు పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఈ దేశాల్లో స్వతంత్ర మీడియా ఉనికి దాదాపు శూన్యమని చెపుతుంటారు. విచిత్రమైన ఇంకొక లక్షణం కూడా ఉంది. పెట్టుబడిదారీ దేశాల్లో స్వేచ్ఛ ఎక్కువని, సామ్యవాద దేశాలు తక్కువని చూపించడానికి కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రయత్నిస్తూ వుంటాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ నియంత్రణ లోని మాధ్యమాలు మాత్రమే ప్రచార సాధనాలుగా పనిచేస్తాయి. భారతదేశం దీనికి భిన్నమేమీ కాదు. విశ్వంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం లో ప్రత్యేకంగా పత్రికా స్వేచ్ఛకు రాజ్యాంగంలో ప్రత్యేక అధికరణం లేనప్పటికీ, ఆర్టికల్ 19(1)(ఎ) కల్పించిన ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ పరిధిలోనే పత్రికా స్వేచ్ఛ అంతర్భాగమని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఆర్టికల్ 19(2) కింద దేశ భద్రత, సార్వభౌమాధికారం, శాంతిభద్రతల పేరిట విధించే ‘సహేతుకమైన పరిమితులు’ తరచూ ప్రభుత్వాల చేతిలో ఆయుధాలుగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. తాజా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ నివేదికల ప్రకారం, మొత్తం 180 దేశాల జాబితాలో భారతదేశం 150160 మధ్య స్థానాల్లో కొనసాగుతూ దిగువ శ్రేణిలోనే ఉంటోంది. జర్నలిస్టులపై దేశద్రోహం లేదా యూఏపీఏ వంటి కఠిన చట్టాల ప్రయోగం, చిన్న పత్రికలు, స్వతంత్ర విలేకరులపై దాడులు, ప్రధాన మీడియా సంస్థల కార్పొరేటీకరణ, ప్రభుత్వ ప్రకటనలపై ఆధారపడటం వల్ల పెరుగుతున్న ‘స్వీయ నియంత్రణ’ భారత ప్రజాస్వామ్యానికి ప్రధాన సవాళ్లుగా పరిణమించాయి. అమెరికా వంటి అగ్రరాజ్యమైనా, భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనా పాలకులకు విమర్శలు మింగుడుపడని పరిస్థితులు ప్రస్ఫుటమవుతున్నాయి. పాలకులు సహనం కోల్పోతున్న ఉదంతాలు విపరీతంగా కన్పిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల కంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని నిలదీసేది, లోపాలను ఎత్తిచూపేది పత్రికారంగమే. పత్రికలను అణచివేయడం అంటే ప్రజల గొంతును నొక్కడమే. తప్పుడు వార్తలను అరికట్టేందుకు న్యాయపరమైన, వ్యవస్థాగతమైన మార్గాలు ఉన్నప్పటికీ, తమ విధానాలను ప్రశ్నించే మీడియా సంస్థలను ఏకపక్షంగా బహిష్కరించడం అధికార దుర్వినియోగమే అవుతుంది. ప్రభుత్వాలు చేసే మంచి పనులను ప్రచారం చేయడమే కాకుండా, తప్పులను సరిదిద్దే అద్దంలా వ్యవహరించడమే మీడియా కర్తవ్యం. ఆ అద్దాన్ని పగులగొట్టాలని చూడటం సమస్యకు పరిష్కారం కాదు. పత్రికా స్వేచ్ఛ సంకుచితమైనప్పుడు పౌరహక్కులు కుప్పకూలిపోతాయి. వైట్‌హౌస్ నిర్ణయమైనా, ఇతర దేశాల ఆంక్షలైనా.. పత్రికా స్వేచ్ఛపై జరిగే ప్రతి దాడి ప్రజాస్వామ్య మనుగడపై జరిగే దాడిగా గుర్తించి సమాజం, న్యాయవ్యవస్థలు గట్టిగా ప్రతిఘటించాల్సిన సమయమిది. నాలుగో స్తంభంగా పరిగణించే మీడియాకు సంకెళ్లు పడితే, మిగిలిన మూడు స్తంభాలు బలహీనపడటం ఖాయం.
నాలుగో స్తంభానికి సంకెళ్లు!
- Advertisement -


