Friday, February 21, 2025
Homeవిశ్లేషణనిత్య చైతన్యశీలి ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌.

నిత్య చైతన్యశీలి ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌.

ఆర్వీ రామారావ్‌

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌.) లక్నోలో 1936లో జరిగిన కాంగ్రెస్‌ మహాసభ సందర్భంగానే 1936 ఆగస్టు 12న ఏర్పడిరది. వ్యవస్థాపక మహాసభ లక్నోలోని గంగా ప్రసాద్‌ స్మారక హాలులో జరిగింది. ఈ మహాసభకు 936 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ప్రతినిధుల్లో దేశమంతటికి చెందిన విద్యార్థులు ఉన్నారు. వ్యవస్థాపక మహాసభను పండిత్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రారంభించారు. ఆ మహాసభకు మహమ్మద్‌ అలీ జిన్నా అధ్యక్షత వహించారు. ప్రేం నారాయణ్‌ భార్గవ మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తొలినాళ్లలో అఖిల భారత విద్యార్థి సమాఖ్యకు అధ్యక్షులు ఉండేవారు కాదు. రెండో మహాసభ 1936 నవంబర్‌ 22న మొదటి వ్యవస్థాపక మహాసభ తరవాత మూడు నెలలకే లాహోర్‌లో జరిగింది. ఆ మహాసభలోనే నిబంధనావళిని ఆమోదించారు. శరత్‌ చంద్ర బోస్‌ ఆ మహాసభకు అధ్యక్షత వహించారు. ఈ మహాసభలో గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ ప్రసంగించారు. స్పెయిన్‌ వ్యవహారాల్లో నాజీ జర్మనీ జోక్యం చేసుకోవడాన్ని నిరసిస్తూ తీర్మానం ఆమోదించారు. అఖిలభారత విద్యార్థి సమాఖ్యను ప్రపంచ విద్యార్థి సంఘం అనుబంధ సంఘంగా ఉండాలని కూడా ఈ మహాసభలోనే నిర్ణయించారు.
1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు హేము కలానీని బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్బంధించింది. కలానీని 1943లో బహిరంగంగా ఉరి తీశారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 19 ఏళ్లు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మరో అఖిల భారత విద్యార్థి సమాఖ్య నేత కనక లత బరువా కూడా మృతి చెందారు. 1843లో బెంగాల్‌లో కరవు తాండవించినప్పుడు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1946 ఫిబ్రవరిలో రాయల్‌ ఇండియన్‌ నేవీ తిరుగుబాటు జరిగినప్పుడు ఈ విద్యార్థి సమాఖ్య విద్యార్థులను సమీకరించడానికి సహకరించింది.
స్వాతంత్య్రం తరవాత ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. విద్యా సంబంధ అంశాల మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. దానితో పాటు ఫ్యూడల్‌ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిరది. ఉమ్మడి ప్రమాదాలను ఎదుర్కోవడానికి విద్యార్థులను సమైక్య పరచడంలో కృషి చేసింది. హైదరాబాద్‌ సంస్థానాధిపతి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా చురుకుగా సహకరించింది. గోవా విమోచనోద్య మంలోనూ ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. కీలక పాత్ర పోషించింది. 1955 ఆగస్ట్‌ 15న దేశవ్యాప్తంగా విద్యార్థులు గోవాలో ప్రవేశించినప్పుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 23 ఏళ్ల కర్నేల్‌ సింగ్‌ బేణీపాల్‌ వి.డి.చిటాలేను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు సి.కె.చంద్రప్పన్‌ తో పాటు ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. నాయకుడు సుఖేందు మజుందార్‌ కూడా ఉన్నారు. దేశంలో విద్యా సంస్కరణలను సూచించడానికి ఏర్పాటు చేసిన కొఠారీ కమిషన్‌ లో కూడా ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. కీలక పాత్ర పోషించింది. విద్యా సంస్కరణల కోసం కొఠారీ కమిషన్‌ అనేక మంచి సూచనలు చేసింది. కానీ ఆయన సూచించిన సిఫార్సుల్లో ఇప్పటికీ అమలు కాకుండా ఉండిపోయిన అంశాలు అనేకం ఉన్నాయి. 1980లలో ఖాలిస్థానీ ఉద్యమం చెలరేగినప్పుడు సత్యపాల్‌ డాంగ్‌ నేతృత్వంలో ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. విద్యార్థులు ఖలిస్థానీలను ఎదుర్కోవడానికి సాయుధ శిక్షణ కూడా తీసుకున్నారు. ఖలీస్థానీ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి సత్యపాల్‌ డాంగ్‌ నేతృత్వంలో సీపీఐ వీరోచిత పోరాటం కొనసాగించింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. నాయకుడు హర్పాల్‌ మొహాలీని ఖలిస్థానీ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో వికలాంగుడిగా మిగిలిపోయారు. ఖలిస్థానీ వ్యతిరేక పోరాటంలో ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. కార్యకర్తలు అనేకమంది ప్రాణాలు అర్పించవలసి వచ్చింది.
అనేక రాష్ట్రాలలో ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. ఇప్పటికీ బలమైన విద్యార్థి సంఘంగా ఉంది. అందులో కేరళ, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, రాజస్థాన్‌, ఒరిస్సా, అసోం, పంజాబ్‌తో పాటు అనేక విశ్వవిద్యాల యాలలో ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. క్రీయాశీలంగానే పని చేస్తోంది. 2019లో బీజేపీ ప్రతిపాదించిన నూతన విద్యా విధానాన్ని ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. గట్టిగా వ్యతిరేకించింది. కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలో ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. విద్యార్థులు చురుకుగా ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నించారు. మాస్కులు, శానిటైజర్లు పంచి పెట్టారు. వివిధ రాష్ట్రాలలో విద్యా రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. ప్రతిఘటించింది. నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. చెన్నైలో జాతీయ సదస్సు ఏర్పాటు చేసింది. అన్ని విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకించేలా చేయడానికి పోరాటం చేసింది. నీట్‌, అన్ని విశ్వ విద్యాలయాలకు ఒకే పరీక్ష నిర్వహించే విధానాన్ని కూడా ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. తీవ్రంగా వ్యతిరేకించింది.
ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. కొన్ని చోట్ల శ్రమజీవి క్యాంటీన్లను నిర్వహిస్తోంది. శాంతి, అభివృద్ధి, స్వేచ్ఛ, సోషలిజం కోసం పోరాడడం ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. ప్రధాన లక్ష్యంగా పని చేస్తోంది. చదువు-పోరాటం అన్నది ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. ప్రధాన నినాదం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు