Sunday, February 23, 2025
Homeవిశ్లేషణనిత్య విప్లవకారుడు బక్నా

నిత్య విప్లవకారుడు బక్నా

ఆర్వీ రామారావ్‌

సోహాన్‌ సింగ్‌ బక్నా పేరెత్తితేనే ఆ రోజుల్లో బ్రిటిష్‌ వారికి గుండెలో దడ. బ్రిటిష్‌ వలసవాద పాలన రోజుల్లో ఆయన అద్వితీయమైన విప్లవకారుడు. గదర్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన దేశంలో విప్లవాగ్ని రగిలించడానికి అమేయమైన కృషి చేశారు. ఆయనకు బ్రిటిష్‌ హయాంలో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అయితే పదహారేళ్లు జైలులో ఉన్న తరవాత 1930లో విడుదలయ్యారు. విడుదల కాగానే ఆయన కార్మికులను సంఘటితం చేయడంలోనూ, అఖిలభారత కిసాన్‌ సభ కార్యకలాపాల్లోనూ మునిగిపోయారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. కార్మికుల సమస్యల సాధన, రైతుల సమస్యలు ఆయనకు అత్యంత ఇష్టమైన కార్యకలాపాలు. 20వ శతాబ్దారంభంలో దేశంలో విప్లవ కార్యకలాపాల్లో సోహాన్‌ సింగ్‌ బక్నాది చెరగని ముద్ర. ఆయనంటే బ్రిటిష్‌ వారికి హడల్‌. ఆయనను అత్యంత ప్రమాదకర వ్యక్తిగా భావించేవారు. ఆయన జైలులో ఉన్నప్పుడు కూడా సంకెళ్లు వేశారు. ఏకాంత వాసంలో ఉంచారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం భారత్‌ను కూడా యుద్ధంలో భాగస్వామిని చేసింది. సైన్యంలో చేరాలని పంజాబీ యువకులను ప్రోత్సహించేవారు. ఇలా ప్రోత్సహించిన వారిలో మహాత్మాగాంధీ కూడా ఉన్నారు. బ్రిటిష్‌ అధికారులు, దేశంలోని కులీనులు, అధికారవర్గం కూడా యువకులను సైన్యంలో చేరాలని ప్రోత్సహించేవారు. సోహాన్‌ సింగ్‌ బక్నా ఈ ధోరణిని తూర్పారబట్టే వారు.
గదర్‌ పార్టీని ఏర్పాటు చేసింది ఉత్తర అమెరికాలోని భారతీయులే. కానీ వారి లక్ష్యం మన దేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడం. దానికి వారు ఎన్నుకున్న మార్గం సాయుధ పోరాటం. కాంగ్రెస్‌ నాయకత్వంలో జరిగే స్వాతంత్య్రోద్యమం చాలా మెతకవైఖరితో కూడుకున్నదని, ఉత్సాహ రహితమైందని గదర్‌ పార్టీ భావించేది. కామగాట మరు అనే జపాన్‌ నౌకలో 1914లో భారతీయులను కెనడా తీసుకెళ్లారు. ఇది బ్రిటిష్‌ వ్యతిరేక ప్రతిఘటనకు చిహ్నం. ఆ నౌకలోని వారికి ఆయుధాలు అందించడంలో కూడా బక్నా పాత్ర ఉంది. అందుకే 1914లో ఆయన భారత్‌లోకి ప్రవేశించగానే బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. కుట్ర కేసు నడిపింది. ఈ కేసులో బక్నాకు మరణ శిక్ష విధించారు. తరవాత యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. కానీ పదహారేళ్లు శిక్ష అనుభవించిన తరవాత బక్నా విడుదలయ్యారు. ఆ దశలోనే ఆయన రైతులను సమీకరించడంలో భాగంగా అఖిల భారత కిసాన్‌ సభ వ్యవస్థాపకుల్లో ఒకరయ్యారు. జైలులో ఉండగా సిక్కుల మత విధులు అనుసరించనివ్వనందుకు నిరసనగా, తోటి ఖైదీల హక్కులకోసం బక్నా నిరాహార దీక్షలు చేశారు. భగత్‌సింగ్‌ కోసం కూడా ఆయన నిరాహార దీక్ష చేశారు. బక్నా కొంతకాలం అండమాన్‌ జైలులో కూడా గడిపారు. ఆ తరవాత స్వదేశంలో మరికొంత కాలం శిక్ష అనుభవించారు.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలోనూ బక్నాను అరెస్టు చేశారు. స్వాతంత్య్రం తరవాత బక్నా కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1948 మార్చి 31న మరోసారి బక్నాను అరెస్టు చేశారు కానీ అదే సంవత్సరం మే 8న విడుదల చేశారు. ఆ తరవాత మరోసారి అరెస్టు చేశారు. చివరకు పండిత్‌ నెహ్రూ జోక్యంతో ఆయన విడుదలయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు