Wednesday, April 23, 2025
Homeవిశ్లేషణనిబద్ధత గల కమ్యూనిస్టు పుప్పాలదొడ్డి వెంకటేశ్వర్లు

నిబద్ధత గల కమ్యూనిస్టు పుప్పాలదొడ్డి వెంకటేశ్వర్లు


బి.సురేంద్ర కుమార్‌

నిబద్ధత గల కమ్యూనిస్టు నాయకులు పుప్పాలదొడ్డి బండమీద వెంకటేశ్వర్లు. కమ్యూ నిస్టు విలువలకూ, త్యాగానికి, ఆదర్శాలకూ, నిలువెత్తు నిదర్శనం ఆయన విప్లవ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. తన జీవన గమనంలో జనమే తప్ప వ్యక్తిగతంలేని అలుపెరగని కమ్యూనిస్టు ఎర్ర సూరీడాయన. భూస్వాములు, పెత్తందార్లుకు సింహస్వప్నం. పేద ప్రజల గుండెల్లో ఓ నమ్మకం, తమకు కష్టం వస్తే వెంకటేశ్వర్లు ఉన్నాడనే ఓ ధైర్యం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పూర్వపు పత్తికొండ తాలూకా కారుమంచి ఫిర్కా (ప్రస్తుతం ఆస్పరి మండలం, ఆలూరు నియోజకవర్గం) పుప్పాలదొడ్డి గ్రామంలో పక్కిరప్ప, నాగమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 5 వ తరగతి వరకు వారి తల్లిగారి గ్రామమైన అలారుదీన్నేలో 6, 7 తరగతులు మండల కేంద్రమైన దేవనకొండలో చదువుకున్నారు. పుప్పాలదొడ్డి ఓ చిన్న గ్రామం. కైరుప్పల, పుప్పాల దొడ్డి, చెన్నంపల్లి గ్రామాలు కలసి కైరుప్పల గ్రామ పంచాయతీ. కైరుప్పల చాల పెద్ద గ్రామం. ఆ గ్రామంలో రెడ్డి, కరణములు ఆధిపత్యం ఉండేది. ఆ గ్రామంలో భూస్వాములు, పెత్తందార్లుకు వేలాది ఎకరాల భూమి ఉండేది. వర్షం వస్తే ఆ మూడు గ్రామాల్లోని రైతులు, కూలీలు భూస్వాములు,పెత్తందార్ల పొలాలలో మొదట విత్తనం వేయాలి. మా పొలాల్లో విత్తనం వేసుకోవాలి పదును పోతుంది అని రైతులు, కూలీలు తమగోడు వెళ్లబోసుకున్నా అలా కుదరదని తమ పొలాల్లో విత్తనం పూర్తి కావలసిందేనని హుకుం జారీ చేసేవారు. ఇది సహించలేని వెంకటేశ్వర్లు రైతులతో, కూలీలతో దండుకట్టి భూస్వాములు, పెత్తందార్లు పొలాల్లో వెట్టిచాకిరి చేయబోరని రైతులకు ఎర్రజెండా అండగా ఉంటుందని భూస్వాములు, పెత్తందార్లుతో తెగేసి చెప్పారు. అందుకు ఆగ్రహించిన భూస్వాములు, పెత్తందార్ల కుటుంబాలు వెంకటేశ్వర్లు అడ్డు తొలగించుకోవాలని పోలీసుల సహకారంతో అక్రమకేసులు బనాయించడం మొదలు పెట్టారు.
42 సంవత్సరాల వయసులోనే భూస్వాములు, పెత్తందార్లు చేతుల్లో హత్యకు గురైన కమ్యూనిస్టు యోధుడు పుప్పాల దొడ్డి బండమీద వెంకటేశ్వర్లు. ఆయనను 23.04.1984 న కైరుప్పల గ్రామములో భూస్వాములు, పెత్తందార్లు (వర్గ శత్రువులు) హత్య చేశారు. వెంకటేశ్వర్లు హత్య జరిగినప్పుడు ఒక్కసారిగా పత్తికొండ తాలూకా ఉలిక్కిపడిరది. కారుమంచి ఫిర్కాలోని గ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. 1960-80 వ దశకంలో కారుమంచి ఫిర్కా ప్రాంతంలో భూస్వాములు, పెత్తందార్లు పేద ప్రజల పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవారు. అది సయించలేని వెంకటేశ్వర్లు ఎర్రజెండా చేతబట్టి అ ప్రాంతంలో పేద ప్రజలను ఐక్యం చేశారు. కైరుప్పల గ్రామంలో చిక్క ఈరన్న, బంట్రోతు నరసమ్మ, టీచర్‌ సుల్లన్న, గొల్ల కేసవయ్య, బిల్లేకల్లు గ్రామంలో తెలుగు బాలన్న, హరిజన బీమన్న, వలగొండ గ్రామంలో కొండమీద సంజన్న, డి.కోటకొండ గ్రామంలో దుబ్బు రాముడు, ములుగుందం గ్రామంలో దస్తగిరి, దొడగొండ గ్రామంలో నల్లన్న, బైలుపత్తికొండ గ్రామంలో తిక్కయ్య లతో కలసి కమ్యూనిస్టు పార్టీని కారుమంచి ఫిర్కాలో రూపకల్పన చేశారు. వెంకటేశ్వర్లు కమ్యూనిస్టు పార్టీలో సభ్యులు కాక ముందు ఆ ప్రాంతంలో భూస్వాములు, పెత్తందార్లు పేదలపై చేసే అన్యాయాలను, అక్రమాలను ఎదిరించాడు, ఇది తప్పు అని భూస్వాములును,పెత్తందార్లును ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని భూస్వాములు దేవనకొండ పోలీసు స్టేషన్‌లో వెంకటేశ్వర్లుపై అక్రమ కేసు బనాయించారు. వెంకటేశ్వర్లును అరెస్టు చేయడానికి దేవనకొండ ఎస్‌ఐ రోషన్‌ పుప్పాలదొడ్డి గ్రామానికి వెళ్లి బలవంతంగా వెంకటేశ్వర్లును అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఎస్‌ఐపైన వెంకటేశ్వర్లు తిరగబడి యస్‌.ఐ.ని కింద పడవేసి బాగా కొట్టి వెళ్ళిపోయారు. ఎస్‌ఐపైన చేయిచేసుకుంటావా అని పోలీస్‌ డిపార్టుమెంటు చాలా సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలని భావించింది. ఈ తరుణంలో వెంకటేశ్వర్లును వెతకసాగింది.
ఆ సమయంలో వెంకటేశ్వర్లు చెల్లెలు గ్రామమైన హోసూరు గ్రామంలో తలదాచుకొని పత్తికొండలోకి వస్తు ఉంటే పత్తికొండ పట్టణంలోని కమ్యూనిస్టు పార్టీ నాయకులు డాక్టరు నాగప్ప ఇంటి దగ్గర అప్పటి కమ్యూనిస్టు పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి వై. స్వామిరెడ్డి, పత్తికొండ తాలూకా కార్యదర్శి చదువుల రామయ్య, నలక దొడ్డి బత్తిన అంజినేయులు, డాక్టరు నాగప్పలు వున్నారు. వారిలో యస్‌.ఐ అరెస్టు చేయడానికి వస్తే యస్‌ఐని కొట్టినట్టు చెప్పగా వై.స్వామి రెడ్డి, చదువుల రామయ్యలు పత్తికొండ సి.ఐ. కి మా పార్టీ కార్యకర్త పైన దేవనకొండ యస్‌.ఐ.రోషన్‌ అక్రమ కేసు బనాయించారు అని యస్‌.ఐ. పైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దాంతో పత్తికొండ సి. ఐ. దేవనకొండ యస్‌.ఐ.ని స్వామి రెడ్డి, చదువుల రామయ్య, వెంకటేశ్వర్లు సమక్షంలో తప్పుడు కేసు ఎందుకు పెట్టారు అని మందలించి రాజీ చేశారు. యవ్వనంలోనే కమ్యూనిస్టుగా మారాడు. పత్తికొండ తాలూకా కేంద్రంగా చేసుకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటు పనిచేసేవారు. ఆ రోజుల్లో పత్తికొండ తాలూకాలోని తుగ్గలి, మద్దికెర, పత్తికొండ, దేవనకొండ, గోనెగండ్ల ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం పత్తికొండ తాలూకా కార్యదర్శిగా, సీపీఐ జిల్లా సమితి సభ్యులుగా పనిచేశారు. నిజాయితీ, నిబద్ధత ఆత్మవిశ్వాసంతో ప్రజల కొరకు పని చేసిన నిఖార్సైన విప్లవకారుడు వెంకటేశ్వర్లు. ఆయన జీవితం భవిష్యత్‌ తరాలకు ఆదర్శనీయం. భౌతికంగా మన మధ్య లేకపోయినా చరిత్ర పుటలలో సజీవంగా నిలిచిపోయే వ్యక్తులు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో వెంకటేశ్వర్లు ఒకరు. ఆయన ఆశయ సాధన కోసం అంకిత భావంతో పనిచేస్తూ ముందుకు సాగడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఆయన హత్యకుగురై 41 సంవత్సరాలైనా నేటికీ ప్రజల హృదయాలలో బతికే వున్నారు.

(నేడు 41వ వర్ధంతి సభó సందర్భంగా)

సీనియర్‌ న్యాయవాది
సెల్‌. నెం:9395361735

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు