విశాలాంధ్ర – హైదరాబాద్ : నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. మే 4న పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లపై కలెక్టర్లకు సూచనలు చేశారు. పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ట్రాక్ రికార్డు దృష్ట్యా తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు శాంతి కుమారి సూచించారు. నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో డా॥ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కేంద్రీయ విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల వంటి ప్రభుత్వ భవనాలను గుర్తించి పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. భూ క్రమబద్ధీకరణ పథకం పురోగతినీ సీఎస్ సమీక్షించారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 31 వరకు క్రమబద్ధీకరణ రుసుము చెల్లించిన దరఖాస్తులకు రిబేట్ (రాయితీ)పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గతంలో నామమాత్రపు ఫీజులు చెల్లించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి ఆ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ మహేశ్ భగవత్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేందం పాల్గొన్నారు.