Wednesday, May 14, 2025
Homeతెలంగాణనీళ్లు… మన నాగరికత

నీళ్లు… మన నాగరికత

. ఇది ఉద్యోగం కాదు ఓ భావోద్వేగం
. కట్టిన మూడేళ్లలోనే కాళేశ్వరం కూలింది
. ప్రాజెక్టులు తొలిప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేస్తాం: సీఎం రేవంత్‌

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : నీళ్లు మన నాగరికత… నీళ్ల కోసమే తెలంగాణ పుట్టింది… నీళ్ల కోసం మొదలైన మన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జలసౌధలో బుధవారం ఏర్పాటు చేసిన ఏఈఈ, జేటీఓల నియామక కార్యక్రమంలో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న అందరికీ సీఎం అభినందనలు తెలిపారు. ఇది ఉద్యోగం కాదు… ఒక భావోద్వేగం… ఆ భావోద్వేగానికి మీరే ప్రతినిధులు అని… భావోద్వేగంతో కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి పొందాయని వ్యాఖ్యానించారు. రూ.రెండు లక్షల కోట్లు ఖర్చుపెట్టినా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా ప్రాజెక్టులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని, ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయంటూ ప్రశ్నించారు. మేధావులు, ఉద్యోగులు ఈ విషయంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. అందుకే నీటిపారుదల శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని, పదిహేను నెలల్లో ఒక నీటిపారుదల శాఖలోనే 1,161 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వివరించారు. అత్యంత ప్రాధాన్యమైన శాఖ నీటిపారుదల శాఖ అని, అందుకే ఆనాడు ఇరిగేషన్‌ ప్రాధాన్యతగా తీసుకుని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు కట్టారని గుర్తు చేశారు.
గతంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా చెక్కు చెదరలేదని, కానీ కాళేశ్వరం మూడేళ్లలోనే కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయని ఎద్దేవా చేశారు. 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని, కట్టిన మూడేళ్లలో కుప్పకూలిన ప్రాజెక్టు భూ ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమే ఉందన్నారు. ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం అంటూ ధ్వజమెత్తారు. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్‌ టెస్ట్‌ చేయలే దని విమర్శించారు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజి నీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇదంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇంజినీర్ల పని ఇంజినీర్లే చేయాలి… రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి… ఇంజినీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలని సూచించారు. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లోపభూయిష్ట నిర్మాణాలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎప్పడు ఏది కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎవరి నిర్లక్ష్యంతో ఎస్‌ఎల్బీసీ పూర్తి కాలేదో అందరికీ తెలుసన్నారు. ఎస్‌ఎల్బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామ న్నారు. గ్రూప్‌ వన్‌ నియామకాలను అడ్డుకోవడం వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసని, త్వరలోనే గ్రూప్స్‌ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఇరిగేషన్‌ విభాగంలో కొత్తగా ఎంపికైన 244 ఏఈఈ, 199 జేటీఓలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు