. ఆన్లైన్ విధానంలో పరీక్షలు…
. 154 కేంద్రాల ఏర్పాటు
. పరీక్షా సమయానికి గంటన్నర ముందే వెళ్లాలి…
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకిగాను శుక్రవారం నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సర్వం సిద్ధమైంది. ఈనెల 6 నుంచి జూన్ 30 వరకు జరగనున్న పరీక్షలకు మొత్తం 154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు రెండు విడతలుగా పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీకి 3,35,401 మంది నుంచి 5,77,417 దరఖాస్తులు పోటెత్తాయి. ఇంతవరకు 3.04 లక్షల మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ప్రాథమిక ‘కీ’ విడుదల చేయనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఇచ్చి, అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందిస్తారు. అటు పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, పరీక్షా కేంద్రానికి 90 నిముషాల ముందు చేరుకోవాలని డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ప్రకటించడంతో అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. దూర ప్రాంత విద్యార్థులంతా ఒక రోజు ముందే ఆయా పరీక్షా కేంద్రాల ఉన్న నగరాలకు వస్తున్నారు. అభ్యర్థుల హాల్టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, ఓటరు ఐడీ, పాన్ తదితర గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రాల వద్ద సమర్పిస్తే… అక్కడి అధికారులు వాటిని సరి చేసేలా ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లో ఫొటో లేకపోతే… అటువంటి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు ఫొటోలు తీసుకురావాలి. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అంటే.. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలను నిషేధించారు. ఇ-అడ్మిట్ కార్డు ప్రింటవుట్, గుర్తింపు కార్డు, అడ్మిట్ కార్డులో ఫొటో లేకుంటే 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకువెళితే సరిపోతుంది. దృష్టి లోపం, రెండు చేతులూ లేని దివ్యాంగులకు పరీక్ష రాసేందుకు పదో తరగతి విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేస్తారు. ఆన్ లైన్లో ప్రతి పరీక్ష 2.30 గంటలపాటు ఉంటుంది. పరీక్ష సమయంలో కంప్యూటర్లో ఏమైన ఇబ్బందులు వస్తే వారు సరి చేస్తారు. రెండు చేతులూ లేని దివ్యాంగులు, దృష్టిలోపం ఉన్న వారికి పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తారు. వారికి అదనంగా మరో 50 నిమిషాలు కేటాయించనున్నారు. పరీక్షా కేంద్రాలలో 20 మంది అభ్యర్థులకు ఒకరు చొప్పున సాంకేతిక సహాయకులను నియమించారు.