Tuesday, March 4, 2025
Homeపంజాబ్‌లో రైతు నేతల నిర్బంధం

పంజాబ్‌లో రైతు నేతల నిర్బంధం

. అర్ధరాత్రి 200మందికి పైగా అరెస్టు
. ఆప్‌ ప్రభుత్వ తీరుపై ఎస్కేఎం, బీకేయూ నిరసన
. నేడు ‘చండీగఢ్‌ చలో’ కార్యక్రమం

చండీగఢ్‌ : అన్నదాతలు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేపట్టిన ‘చండీగఢ్‌ చలో’ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనకు ముందు పంజాబ్‌ పోలీసులు 200 మందికి పైగా రైతులను, రైతు సంఘాల నాయకులను అరెస్ట్‌ చేశారు. ముఖ్యంగా పంజాబ్‌ అంతటా అనేక మంది రైతు నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఇది వివిధ ప్రాంతాలలో పోలీసుల చర్యకు వ్యతిరేకంగా నిరసనలకు దారితీసింది. వ్యవసాయ మార్కెటింగ్‌ విధాన ముసాయిదాకు వ్యతిరేకంగా పంజాబ్‌`హర్యానా ఉమ్మడి రాజధానిలో వారం రోజుల పాటు ‘ధర్నా’కు ఎస్‌కేఎం పిలుపునిచ్చిన కార్యక్రమంలో భాగంగా చండీగఢ్‌ వైపు వెళ్లాలని రైతు నాయకులు నిరసనకారులకు పిలుపునిచ్చారు. రైతు నాయకులపై పోలీసు చర్యకు అనేక మంది రాజకీయ నాయకులు ఆప్‌ ప్రభుత్వాన్ని ఖండిరచారు.
సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పంజాబ్‌ విభాగం బుధవారం ‘చండీగఢ్‌ చలో’ మార్చ్‌తో సహా వారం రోజుల పాటు నిర్వహించనున్న నిరసనలకు ముందు, సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు అనేక మంది రైతు సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌కేఎం నాయకులు, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మధ్య జరిగిన సమావేశం ఆకస్మికంగా ముగిసిన కొన్ని గంటల తర్వాత ప్రభుత్వం అర్ధరాత్రి దాడులు జరిపిందని ఎస్‌కేఎం పేర్కొంది. ‘సోమవారం సాయంత్రం మొదట ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌… ఎస్‌కేం నాయకులతో సమావేశం నుంచి బయటకు వెళ్లారు. తరువాత పోలీసులు నాయకుల ఇళ్లపై దాడి చేయడం ప్రారంభించారు. పోలీసులు తెల్లవారుజామున 3 గంటలకు ఫిరోజ్‌పూర్‌లోని నా ఇంటికి వచ్చి నన్ను అరెస్టు చేశారు’ అని క్రాంతికారి కిసాన్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్మీత్‌ సింగ్‌ మెహ్మా ఒక వీడియో సందేశంలో ఆరోపించారు. మెహ్మాతో పాటు, క్రాంతికారి కిసాన్‌ యూనియన్‌ నాయకులు జంగ్వీర్‌ సింగ్‌ చౌహాన్‌, మంజీత్‌ రాజ్‌, సుర్జీత్‌ సింగ్‌ను కూడా వరుసగా తాండా, బర్నాలా, మోగాలలో అదుపులోకి తీసుకున్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) ఉగ్రహన్‌ అధ్యక్షుడు జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌ ఇంటికి పోలీసులు చేరుకున్నారని, కానీ అతని ఆచూకీ తెలియలేదని తెలుస్తోంది. బీకేయూ రాజేవాల్‌ ప్రధాన కార్యదర్శి మహేష్‌ చందర్‌ శర్మ, బీకేయూ లఖోవాల్‌ అధ్యక్షుడు హరీందర్‌ సింగ్‌ లఖోవాల్‌ను కూడా లూథియానా, మొహాలిలోని వారి ఇళ్ల నుంచి అదుపులోకి తీసుకున్నారు. ‘పోలీసులు ఎస్‌కేఎం నాయకుల ఇళ్లపై దాడి చేస్తున్నారు. మా డిమాండ్లను పరిగణనలోకి తీసుకునే బదులు, మమ్మల్ని అరెస్టు చేయడానికి పోలీసులను మా ఇళ్లకు పోలీసులను పంపుతున్నారని లఖోవాల్‌ వీడియో సందేశంలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు బతిండాలోని తన ఇంటికి పోలీసులు వచ్చారని… పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకోవడంతో తిరిగి వెళ్లారని బీకేయూ ఉగ్రహన్‌ నాయకుడు గులాబ్‌ సింగ్‌ తెలిపారు. ‘ఎక్స్‌’ లో చేసిన పోస్ట్‌లో శిరోమణి అకాలీదళ్‌ మాజీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ఈ పరిణామాలను ఖండిరచారు. ‘పంజాబ్‌లో రైతు నాయకుల ఇళ్లపై దాడి చేసినందుకు దురహంకార ముఖ్యమంత్రిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆప్‌ ప్రభుత్వం ఇటువంటి అవమానకరమైన చర్యలను అమలు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది’ అని పంజాబీలో పేర్కొన్నారు. నాయకుల ఇళ్లపై పోలీసులు దాడి చేస్తున్న వీడియోలను పోస్ట్‌ చేశారు. కేంద్ర రైల్వే సహాయ మంత్రి ఎంపీ రవ్నీత్‌ సింగ్‌ బిట్టు ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేస్తూ… ‘భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం పంజాబ్‌లో అత్యవసర పరిస్థితిని సృష్టించింది. పంజాబ్‌ రైతులకు సంబంధించిన సమస్యలపై ఇది బయటపడిన తర్వాత ఇప్పుడు అది వ్యవసాయ నాయకులపై పోలీసు వ్యూహాలను ఆశ్రయిస్తోంది. మేము తరచూ చెప్పినట్లుగా ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పోలీసు రాష్ట్రంగా మార్చారు. రైతులపై పంజాబ్‌ పోలీసుల చర్యలు తీవ్రంగా ఖండిరచదగినవి. ఇది పంజాబ్‌లోని ఆప్‌ ప్రభుత్వ రైతు వ్యతిరేక మనస్తత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది’ అని పేర్కొన్నారు. పోలీసు చర్యకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ప్రతాప్‌ సింగ్‌ బజ్వా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘రైతులు తమ న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని నిరసన తెలుపుతున్నారు. రైతులను అరెస్టు చేయడానికి బదులుగా అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపై చర్యలు తీసుకోండి. రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్‌ చేస్తున్నాను’ అని అన్నారు. రైతులు 18 డిమాండ్లపై పట్టుబడుతున్నారు. వీటిలో దాదాపు 12 అంశాలు రాష్ట్రానికి సంబంధించినవని ఆ వర్గాలు తెలిపాయి. కాగా, చండీగఢ్‌లో నిరసన తెలిపేందుకు రైతులకు ఇంకా స్థలం కేటాయించలేదు. గత ఏడాది సెప్టెంబరులో రైతులు చివరిసారిగా చండీగఢ్‌లో వారం రోజుల ధర్నా చేశారు.
రైతుల డిమాండ్లను కేంద్రమే పరిష్కరించాలి: సీఎం మాన్‌
సోమవారం రైతులతో సమావేశం తర్వాత ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మాట్లాడుతూ రైతులతో చర్చలకు ఎల్లప్పుడూ తలుపులు తెరిచి ఉన్నప్పటికీ, నిరసనల పేరుతో ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని నివారించాలని అన్నారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, రోడ్లు, రైల్వే రవాణాకు అంతరాయం కలిగించడం వల్ల సామాన్యులకు ఇబ్బందులు తప్పవని ఆయన ఒక ప్రకటనలో నొక్కి చెప్పారు. ఇటువంటి అంతరాయాలు నిరసనకారులకు వ్యతిరేకంగా ప్రజల మనోభావాలను మార్చగలవని, దీనివల్ల సమాజంలో మరింత విభజనలు ఏర్పడతాయని, ఈ పద్ధతులను మానుకోవాలని ముఖ్యమంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి మద్దతు ఇస్తున్నప్పటికీ, వారి కీలక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు