కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కూటమి అభ్యర్థుల గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవనిగా పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయం సాధించిన సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత 9 నెలల కాలంలోనే రికార్డుస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, వీటిని పట్టభద్రులు గమనించే కూటమికి పట్టం కట్టారని అన్నారు. అసాధ్యమనుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేత సుసాధ్యం చేశాం. దానిని నిలబెట్టేందుకు అవసరమైన ఆర్థిక సహాయం సాధించాం. విశాఖ రైల్వేజోన్ పూర్తి చేసుకుంటున్నాం. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించి పనులు ప్రారంభించాం. ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 5లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేశామని సీఎం వివరించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే అందరం కలిశాం. ఎవరికీ స్వప్రయోజనాలు లేవు. మూడు పార్టీల ఐకమత్యం శాశ్వతంగా ఉండాలి. ఒకరికొకరు గౌరవించుకొనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలి. మూడు పార్టీలు ప్రజల్లో ఉంటే భవిష్యత్తులో ఏ పార్టీకీ అవకాశం ఉండదని సీఎం స్పష్టం చేశారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టండి నీరు తీసుకోండి, గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామ రక్ష అని తేల్చి చెప్పారు. తెలంగాణ కూడా కరవు ప్రాంతాలకు నీటిని తరలించుకోవచ్చని సూచించారు. కాళేశ్వరం అభివృద్ధి చేసి చాలా మంచి పనిచేశారన్నారు. ఇంకా నీరు కావాలని తెలంగాణ తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు వెల్లడిరచారు. ఏపీ ప్రాంతానికి తరలించే నీటి విషయంలో తెలంగాణ బాధపడవద్దని కోరారు. చివరి ప్రాంతంలో ఉన్న రాజమండ్రిని దాటితే గోదావరి నీరు పోయేది సముద్రంలోకేనని గుర్తుచేశారు. చివరి ప్రాంతాలకు మిగులు జలాలు తీసుకునే అధికారం ఉందని స్పష్టంచేశారు. ఏపీలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా మరే రాష్ట్రంలో, దేశంలో ఉన్నా తెలుగుజాతి తెలుగు జాతేనని ఉద్ఘాటించారు. తెలుగుజాతి ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పనిచేస్తుందని వెల్లడిరచారు. తనకు రెండు ప్రాంతాలు సమానమని, రెండు కళ్లు లాంటివని ఆనాడు చెప్పా, ఇప్పుడూ చెబుతున్నాని చంద్రబాబు తెలిపారు.
అభ్యర్థిని నిలిపే దమ్ము, ధైర్యం కూడా వైసీపీకి లేవు : లోకేష్
ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇంతటి విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకు, గెలుపు కోసం పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, జోనల్ కోఆర్డినేటర్లు, ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదు. ఆయనకు కొత్త పేరు పెట్టా. ఆయన ఒక రోజు ఎమ్మెల్యే. అసెంబ్లీ సమావేశాలు పెడితే ఒక్క రోజు మాత్రమే వస్తారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా అసెంబ్లీకి ఒక రోజు వచ్చి ప్రతిపక్ష హోదా కావాలని అడిగి బెంగుళూరు పారిపోతారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి పెడితే డిపాజిట్ రాదని, అందుకే అభ్యర్థిని నిలిపే దమ్ము, ధైర్యం లేక వెనక్కి వెళ్లారని విమర్శించారు. ఈకార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.