Friday, February 21, 2025
Homeఅంతర్జాతీయంపన్నులపై వెనక్కి తగ్గం

పన్నులపై వెనక్కి తగ్గం

. భారత్‌ సహా ఏ దేశానికి మినహాయింపు ఇవ్వబోం
. పరస్పరం సుంకాలు విధించే విధానానికి కట్టుబడ్డాం
. ఫాక్స్‌ న్యూస్‌తో ఇంటర్వ్యూలో ట్రంప్‌

వాషింగ్టన్‌: పన్నుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నొక్కిచెప్పారు. భారత్‌తో సహా ఏ దేశానికి మినహాయింపు ఇవ్వబోమన్నారు. పరస్పరం పన్నులు విధించే విధానానికి అమెరికా కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఈ విధానంపై తనతో ఎవరూ వాదించలేరన్నారు. స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌తో కలిసి ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు పరస్పరం పన్నులు విధానాన్ని ట్రంప్‌ ప్రకటించిన విషయం విదితమే. ఇంటర్య్యూలో అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ‘మీరు ఎంత పన్ను విధిస్తే… మేము కూడా అంతే విధిస్తాం అని మోదీతో చెప్పాను. మోదీ ఏదో చెప్పబోతే… లేదు అది నాకు నచ్చదన్నాను. మీరు ఎంత సుంకం వేస్తే మేము కూడా అంతే వేస్తాం అని తేల్చిచెప్పేశా’ అని ట్రంప్‌ అన్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే వాటిలో కొన్నింటిపై భారత్‌ అధిక సుంకాలు విధిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఆటో మొబైల్‌ రంగంలో 100శాతం సుంకాలను విధిస్తుందన్నారు. ఈ విషయంలో మస్క్‌ కూడా ట్రంప్‌తో ఏకీభవించారు. ‘నేను 25శాతం పన్ను అంటే… వారు చాలా ఎక్కువ అని అంటారు. అందుకే ఇకపై మాట్లాడటాలు ఉండవు… వాళ్లు ఎంత విధిస్తే… సమాంతర పన్ను అమెరికా విధిస్తుంది… దీంతో వాళ్లే పన్నులు ఆపేస్తారు’ అని ట్రంప్‌ అన్నారు. ప్రపంచం లోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటన్నారు. అయితే ఇందుకోసం భారత్‌ను నిందించడం లేదు కానీ ఇదొక భిన్నమైన వాణిజ్య విధానమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అత్యధిక పన్నులు, కఠినమైన వాణిజ్య ఆంక్షలు ఉండటం వల్ల భారత్‌కు ఏదైనా విక్రయించడం చాలా కష్టమని చెప్పారు. పన్నులు, సుంకాల విషయంలో ఏ దేశానికి మినహాయింపులు ఉండబోవని, ఇది చాలా న్యాయమైన పద్ధతి అన్నది తన నమ్మకమని ట్రంప్‌ అన్నారు. ట్రంప్‌ 2019లో తొలిసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పుడు భారత్‌ ఆయనను టారిఫ్‌ కింగ్‌గా పేరు పెట్టిన విషయం తెలిసిందే.
డబ్బున్న దేశం భారత్‌… మా నిధుల అవసరం లేదు
భారత్‌ దగ్గర చాలా డబ్బు ఉందని ట్రంప్‌ అన్నారు. ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెంచేందుకు అమెరికా డబ్బులు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. ‘వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్‌ డాలర్లు అమెరికా ఎందుకు ఇవ్వాలి… ఆ నిధి అవసరం భారత్‌కు ఏమున్నది. ఆ దేశం వద్ద డబ్బు చాలానే ఉంది. మన దేశంపై దృష్టి పెట్టడం అవసరం. అమెరికన్‌ ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి. సుంకాలు విషయంలో అమెరికా భారత్‌ను చేరుకోలేదు. నాకు భారతీయులపై ఆ దేశ ప్రధానిపై గౌరవం ఉంది కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలా? మన పన్ను చెల్లింపుదారుల డబ్బు ఆ దేశానికి ఎందుకు ఇవ్వాలి?’ అని అధ్యక్షుడు ప్రశ్నించారు. ఇదిలావుంటే, ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ఎలన్‌ మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ విభాగం జాబితా ప్రకటించిన క్రమంలో ట్రంప్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడిరది. భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఇచ్చే నిధులను రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది. బంగ్లాదేశ్‌, నేపాల్‌కూ నిధులు ఆపేసింది.
అంతరిక్ష వ్యవహారాల్లో మస్క్‌కు నిర్ణయాధికారం ఉండదు
అంతరిక్ష వ్యవహారాల్లో ఎలన్‌ మస్క్‌ జోక్యం కానీ, సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండబోదని ట్రంప్‌ స్పష్టంచేశారు. మస్క్‌ నిర్వహిస్తున్న వ్యాపారాలతో సంబంధమున్న శాఖలకు ఆయన దూరంగా ఉంటారని చెప్పారు. డోజ్‌ నిర్వహణకు మస్క్‌ కంటే తెలివైన వ్యక్తి కావాలని అనుకున్నా కానీ అది సాధ్యపడగా ఆయనకే బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందని అన్నారు. వివిధ శాఖల్లోని వృథా ఖర్చును మస్క్‌ తగ్గిస్తారన్న నమ్మకం తనకు ఉందని ట్రంప్‌ అన్నారు. అయితే మస్క్‌ కేవలం ఉద్యోగి అని, శ్వేతసౌధంలో సీనియర్‌ సలహాదారుల మాదిరిగా ప్రభుత్వపరమైన నిర్ణయాలను తీసుకలేరి శ్వేతసౌధం వ్యవహారాల డైరెక్టర్‌ జోషువా ఫిషర్‌ తెలిపారు. మస్క్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ న్యూమెక్సికో పెట్టిన కేసుపై ఈ మేరకు వివరణ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు