ఆపరేషన్ సిందూర్ విజయవంతం
పాక్ భూభాగంలో నష్టానికి బాధ్యత వారి ఆర్మీదే
రక్షణశాఖ అధికారుల స్పష్టీకరణ
న్యూదిల్లీ : పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పాక్ సైన్యం, అక్కడి ప్రజలను కాకుండా ఉగ్రవాదులు, వారి స్థావరాలనే మనం లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం చేశారు. పాకిస్థాన్ సేనలు ఉగ్రవాదులకు అండగా నిలిచాయని, ఈ పోరాటాన్ని తమ పోరాటంగా మలచుకున్నాయని తెలిపారు. పాక్ భూభాగంలో నష్టానికి బాధ్యత వారి ఆర్మీదేని పేర్కొన్నారు. ఈ మేరకు ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌లో ధ్వంసమైన ఎయిర్ బేస్‌లు వీడియోలను ప్రదర్శించారు. సోమవారం న్యూదిల్లీలో జరిగి మీడియా సమావేశంలో త్రివిధ దళాల డీజీఎంఓలు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భార్తీ, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, వైస్ అడ్మిరల్ ప్రమోద్ ఆపరేషన్ సిందూర్ విశేషాల్ని వెల్లడిరచారు. భార్తీ మాట్లాడుతూ.. తమ పోరాటం ఉగ్రవాదంపైన మాత్రమేనని స్పష్టం చేశారు. అంతేకానీ పాక్ పౌరులు, ఆర్మీపై కాదని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతం ఇస్తోందని విమర్శించారు. రావల్పిండిలోని నూర్‌ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా ధ్వంసమైన వీడియోను విడుదల చేశారు. పాక్ మిలటరీ హెడ్ క్వార్టర్ ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఎయిర్ బేస్ ఉండడం గమనార్హం. అలాగే పాకిస్థాన్ పంజాబ్‌లోని రహిమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ రన్ వే సైతం ధ్వంసమైన మరో వీడియోను సైతం ప్రదర్శించారు. భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడిరచారు. అయితే ఉగ్రవాదులకు మద్దతునిచ్చేందుకు పాక్ రంగంలోకి దిగి భారీ నష్టాన్ని మూటగట్టుకున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ వైపు నుంచి జరిగిన దాడులను సమర్థంగా తిప్పికొట్టామని, మన సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం జరగకుండా చూశామని తెలిపారు. గగనతల రక్షణ వ్యవస్థలో స్వదేశీ తయారీ ఆకాశ్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. చైనా తయారీ పీఎల్`15 వంటి క్షిపణులను పాకిస్థాన్ ప్రయోగిస్తే వాటిని కూల్చివేసినట్లు తెలిపారు. భారత సైనిక స్థావరాలు, వ్యవస్థలు పూర్తిగా పని చేస్తున్నాయని, అవసరమైతే భవిష్యత్తులో ఏవైనా మిషన్లను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడిరచారు. పీవోకే, పాక్‌లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు నిర్వహించినట్లు ఎయిర్ మార్షల్ తెలిపారు. పౌర నివాసాలకు దూరంగానే దాడులు చేశామని, భారత్ దాడులపై పాకిస్థాన్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భారత సైన్యం పాక్ కిరానా హిల్స్‌ను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని అణుస్థావరాన్ని భారత్ లక్ష్యంగా చేసుకున్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. ‘‘పాకిస్థాన్ తన అణ్వాయుధాలను కిరానా హిల్స్ వద్ద నిల్వ చేస్తుందని చెప్పినందుకు థ్యాంక్స్. అక్కడ ఏమైనా ఉండనీ… మేం మాత్రం ఆ హిల్స్‌ను టార్గెట్ చేయ లేదు. మేం లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన జాబి తాలో అది లేదు’’ అని ఎయిర్ చీఫ్ మార్షల్ వెల్లడిరచారు.
రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యం
గత కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల తీరు మారినట్లు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. అమాయక పౌరులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు. భారత్ ఎయిర్‌ఫీల్డ్‌లను, లాజిస్టిక్స్‌ను లక్ష్యంగా చేసుకోవడం చాలా కష్టమని అన్నారు. గ్రిడ్ సిస్టమ్‌లో అన్ని లేయర్లు దాటగలిగినా ఏదో లేయర్ వాటిని అడ్డుకుంటుందని వెల్లడిరచారు.
హైస్పీడ్ క్షిపణులను వినియోగించాం
పాకిస్థాన్ జరిపిన గగనతల దాడులను తక్షణమే పసిగట్టి నిలువరించామని వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్లు, రాడార్లు ఉపయోగించామని చెప్పారు. ఫ్లీట్, ఎయిర్ డిఫెన్స్‌ను సమర్థంగా వినియోగించామని పేర్కొన్నారు. డ్రోన్లు, హైస్పీడ్ మిసైళ్లను వినియోగించినట్లు వెల్లడిరచారు. నౌకాదళ అడ్వాన్స్ రాడార్ల ద్వారా పాక్ డ్రోన్లను గుర్తించగలిగినట్లు తెలిపారు. ‘‘వందల కి.మీ దూరంలో ఉన్న శత్రుసేనల విమానాలను దగ్గరకు రాకుండా అడ్డుకున్నాం. త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేశాయి. మన స్వదేశీ ప్రతిస్పందన దాడి వ్యవస్థ చాలా బలమైంది. సైన్యానికి అండగా నిలిచిన 140 కోట్ల మంది ప్రజలకు ధన్యవాదాలు. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది’’ అని వైస్ అడ్మిరల్ ప్రమోద్ స్పష్టం చేశారు.