బండారు రాధాకృష్ణ
పార్టీలు ప్రజల కోసమా లేక పార్టీ పెద్దల కోసమా! ప్రజల కోసమైతే ప్రజా సమస్యల కోసం ఎందుకు కలవరు. నా బుర్ర పగిలిపోతోంది. ఏంటి బావ ఉదయాన్నే పార్టీల మీద పడ్డావు. ఏమయింది యిప్పుడు. ఏమయిందని తాపీగా అడుగుతావేంటి. అసలు ప్రజా సమస్యలు పట్టవా నాయకులకు. ప్రజలంతా సమస్యల తోరణాలు కట్టుకుని అరుస్తుంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్ష నాయకులకు ఆ అరుపులు వినపడవా. అదేంటి అంత మాటన్నావు. నీవన్నట్లు రాజకీయ పార్టీలు, అనేక రకాల సంస్థలు, సంఘాలు అన్ని ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటయినవే. కాని పార్టీ నాయకులలో కొందరి మెతకతనంతోనో, స్వార్థంతోనోఅనుకున్నట్లు పని చేయని మాట నిజం. నిన్నగాక మొన్న వామపక్షాలు మిర్చి రైతుల గురించి విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ వెంట వచ్చిన ప్రజల్ని చూసిన తరువాత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇది ప్రభుత్వానికి తగని పని. ఎవరూ ఊహించని మెజార్టీతో గెలిపించినా ప్రజల గురించి అందునా సమాజానికి వెన్నుముకగా పిలుచుకునే రైతుల సమస్యలపై పట్టించుకోక పోవడం విచారకరం. అది సరేనయ్యా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలెన్నుకున్న పార్టీలు ప్రజల కోసం పని చేయని దుస్థితి ప్రస్తుతం నెలకొంది. దాంతో పార్టీలు ప్రజల కోసమా లేక పార్టీ పెద్దల కోసమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా ప్రజల కోసమైతే ప్రజాహితం కోరే పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలి. అందల మెక్కేదాక ఒక మాట, ఎక్కిన తరువాత ఒక మాట మాట్లాడుతున్న రాజకీయ పార్టీల తీరు నిరసించి నిలదీయడానికి ప్రజాహిత పార్టీలన్ని ఒకే గొంతుతో నిలబడాలి. ప్రజలు అడగక పోయినా శుష్క వాగ్దానాలతో అమాయక ప్రజల్ని నమ్మించి ఓట్లు పొంది గద్దె నెక్కి మా వల్ల కాదనడం గర్హనీయం. నలభై ఏళ్ల రాజకీయ అనుభవంతో పాటు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్ర ఖజానా గురించి ఎన్నికల ముందు తెలయకనె వరాల జల్లు కురిపిం చారనుకోవాలా. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? అసలు ప్రజల సమస్యలపై పోరాటం చేయవలసిన పార్టీలు మౌనం వహించడం న్యాయం కాదు. ఇప్పటికైనా ప్రజల కోసం ప్రజలెన్నుకున్న పార్టీలు బాధ్యతతో సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష హోదా లేనప్పుడు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడడానికి ఒక శాసన సభ్యుని కిచ్చే సమయం చాలదని అంటున్నారు. గతంలో ఇద్దరున్న బీజేపీ పార్టీ వారు పార్లమెంటులో హాజరయి మాట్లాడారని అలాగే కొన్ని ఉదాహరణలతో ఒక పత్రిక రాసింది. కాని ఆనాడున్న క్రమశిక్షణ చట్ట సభలలో యిప్పుడు లేదన్న సంగతి ఆయనకు తెలియదనుకోవాలా? నెహ్రూ కాలంలో ప్రతిపక్ష నాయకుల ప్రసంగం పూర్తిగా విని కొన్ని సవరణలు చేసుకున్న ఉదంతాలున్నవి. ఇప్పుడటువంటి పరిస్థితి ఉందని సదరు వ్యక్తి భావిస్తున్నారా. జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడడానికి సమయం ఉంటుందని కనుక హోదా ఇవ్వమని అడగడం చట్టానికి వ్యతిరేకమే కాని చట్టంలోని నిబంధనలు పక్కన పెట్టి తమకు అనుకూలంగా ప్రభుత్వాలు ఎన్నో సవరణలు చేసుకుని వ్యవహరించిన ఘటనలు గతంలో జరిగాయి. నిజంగా ప్రజల కోసం, ప్రజా హితం కోరి వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తే జగన్ హోదా ద్వారా అడిగే ప్రశ్నలకు ప్రభుత్వంతో సంబంధం లేకుండా పరిష్కారం పొందిన ప్రజలే సమాధానం చెబుతారు. నిజంగా ప్రజా హితం కోరే ప్రభుత్వమైతే చట్టాన్ని పక్కన పెట్టి హోదా ఇవ్వడానికి వెనకడుగు వేయనవసరం లేదు. హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్ష నాయకునికి ఇచ్చే సమయం ఇస్తానని వాగ్దానం చేయవచ్చు. ప్రజా సమస్యలపై మాట్లాడే వారికి సమయం ఇవ్వడం ప్రజా ప్రభుత్వాల బాధ్యతగా భావించాలి. అంతేగాని చట్టాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల గురించి మాట్లాడే సభ్యుల ఫోను కట్ చేయడం ప్రజా ప్రభుత్వాలకు తగని పని.
ప్రజాస్వామ్య దేశాలలో ప్రజల కోసం చట్టం చేయడం వరకే ప్రభుత్వాల పని. వాటిని సక్రమంగా అమలు పరచవలసిన బాధ్యత అధికారులది. కాని రానురాను చట్టం చేసిన తరువాత ప్రతి విషయంలోను మంత్రుల జోక్యం కనబడుతోంది. ఎన్నికల వరకే పార్టీలు ఆ తరువాత ప్రజలందరి కోసం పని చేయవలసిన మంత్రులు తమ పార్టీలో ఉన్నవారే ప్రజలని ఇతర పార్టీలకు చెందిన ప్రజల గురించి పట్టించుకోనవసరం లేనట్లుగా వ్యవహరించడం గమనార్హం. ఈ జబ్బు అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పార్టీలలోను కనబడుతోంది. ప్రతి చిన్న విషయానికే కాక అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తి సొంత విషయానికి కూడా మంత్రుల జోక్యం ఉంటోందని, కష్టపడి సాధించిన ఐఏఎస్, ఐపీఎస్‌లను పక్కన పెట్టి మంత్రి చెప్పింది చేయడానికి అలవాటుపడాల్సిన పరిస్థితి కలెక్టర్లకు దాపురించిన రాజకీయం నేడు నడుస్తోంది. ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రభుత్వానికి సమస్యలపై మాట్లాడే ప్రతిపక్షానికి సమయం ఇవ్వడానికి భయపడవలసిన పని లేదు. ఏది ఏమైనా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష, వామపక్ష పార్టీలన్నీ ఒకే గొంతుకతో పనిచేస్తే ప్రజలు సంతోషిస్తారు.
సెల్: 9885569394