సీపీఐ ప్రధాన కార్యదర్శులు – 3
ఆర్వీ రామారావ్
పి.సి.జోషిగా ప్రసిద్ధుడైన పూనం చంద్ జోషి తొలితరం కమ్యూనిస్టు నాయకులలో ఒకరు. ఆయన 1935 నుంచి 1947 దాకా పన్నెండేళ్ల పాటు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలా కాలం సీపీఐపై నిషేధం ఉండేది. తెలంగాణా సాయుధ పోరాటం, కయ్యూరు పోరాటం, ఆర్.ఐ.ఎన్. తిరుగుబాటు, తేభాగ ఉద్యమం లాంటివన్నీ ఈ సమయంలోనే కొనసాగాయి.
1907 ఏప్రిల్ 14న అల్మోరాలో బడిపంతులు హరినందన్ జోషి కడుపున జన్మించారు. అది ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో ఉంది. 1928లో అలహాబాద్ విశ్వవిశ్వవిద్యాలయం నుంచి ఎమ్మే పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష పూర్తి చేయగానే ఆయనను అరెస్టు చేశారు. 1928-29లో పండిత్ నెహ్రూ, యూసుఫ్ మెహెరల్లీ మరికొందరితో కలిసి జోషీ యువజన సంఘాల్లో (యూత్ లీగ్)చురుకుగా పని చేశారు. ఆ తరవాత కొద్ది కాలానికే ఉత్తరప్రదేశ్ వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1929లో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను మీరట్ కుట్రకేసులో నిందితుణ్ని చేసి అరెస్టు చేసింది. అప్పటికి ఆయనకు 22 ఏళ్లు మాత్రమే. ఆయనను ఆరేళ్ల పాటు అండమాన్ దీవుల్లో నిర్బంధించాలనుకున్నారు. కానీ ఆయన పిన్న వయస్కుడైనందువల్ల ఆ శిక్ష మూడేళ్లకు తగ్గించారు. 1933లో జైలు నుంచి విడుదలైన తరవాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న కమ్యూనిస్టు బృందాలను ఐక్యం చేయడానికి ప్రయత్నించారు.
కమ్యూనిస్టు సిద్ధాంతం, ఆచరణలో పి.సి.జోషి చేసిన కృషి అద్వితీయమైంది. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో ఆయన పాత్ర ప్రత్యేకమైంది. ఒక రకంగా గ్రాంసీ నిర్వహించిన పాత్రను భారత్‌లో జోషీ నిర్వహించారు. ఆయన కార్యకలాపాలు జన చేతనపై గాఢమైన ప్రభావాన్ని చూపాయి. జోషీ తన సమకాలీన రాజకీయ ఉద్యమాన్ని విప్లవీకరించినట్టుగా మరెవరూ చేయలేదనేది వాస్తవం. సామ్రాజ్యవాదానికి, వలసవాదానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా ‘‘నేషనల్ ఫ్రంట్’’ ఉండాలని ఆయన సూత్రీకరించారు. ఇది విద్యావంతులైన వారిని బాగా ఆకర్షించింది. కమ్యూనిస్టు పార్టీలో చేరకపోయినా యువత, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు, చైతన్యవంతమైన బూర్జువా వర్గాల వారు వామపక్ష రాజకీయాల వేపు ఆకర్షితులయ్యారు. మార్క్సిజం ను ఆమోదించారు. ఆయన సీపీఐ నాయకుడిగా ఉన్న కాలంలో కాంగ్రెస్ మీద వామపక్ష ప్రభావం విపరీతంగా ఉండేది. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ, పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, అనేకానేక ప్రజా సంఘాలు ఏర్పడడానికి ప్రధానంగా జోషి కృషే కారణం. కమ్యూనిస్టు పార్టీకి ఆవల కమ్యూనిస్టు ప్రభావం విపరీతంగా ఆ రోజుల్లో పెరిగింది.
కాంగ్రెస్‌లో విధాన నిర్ణయాలు తీసుకునే పరిశ్రమలు, వ్యవసాయ రంగం లాంటి వాటి మీద కమ్యూనిస్టుల ప్రభావం విపరీతంగా ఉండేది. అనేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు కమ్యూనిస్టులే నాయకత్వం వహించే వారు. ఎ.ఐ.సి.సి.లో కనీసం 20 మంది కమ్యూనిస్టులు ఉండేవారు. మహాత్మా గాంధీ, సుభాశ్ చంద్ర బోస్, పండిత్ నెహ్రూతో కలిసి కమ్యూనిస్టు నాయకులు పని చేసే వారు. మార్క్సిజం ప్రభావం కమ్యూనిస్టు ఉద్యమ పరిధిని దాటి విస్తరించింది. 1930లు, 1940లలో అనేక మంది మార్క్సిజం గొడుగు కింద చేరారు. సైద్ధాంతికంగా మార్క్సిజం గణనీయమైన విజయాలు సాధించింది.
కళలు, సాహిత్యం మొదలైనవి ప్రజాస్వామ్య లక్షణాలే కాక ప్రజోద్యమాలుగా రూపు దిద్దుకున్నాయి. అవి విప్లవ రాగం ఆలపించడం మొదలైంది. పాటలు, నాటకం, కవిత్వం, సాహిత్యం, నాటక రంగం, సినిమా…ఇలా సకల రంగాలపై మార్క్సిజం ప్రభావం కనిపించింది. దీనికి కావలసిన నేపథ్యం సమకూర్చింది పి.సి.జోషీనే. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని వేగవంతం చేసింది. సకల కళా రూపాలను కమ్యూనిస్టులు స్వాతంత్య్రోద్యమంలో భాగం చేయడానికి జోషీ విధానాలు ఉపకరించాయి. పి.సి.జోషి కృషి వల్లే 1936లో అభ్యుదయ రచయితల సంఘం, అఖిల భారత రైతు సంఘం, అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎ.ఐ.ఎస్.ఎఫ్.) అవతరించాయి. అనాడు లబ్ధ ప్రతిష్టితులైన వివిధ కళా రంగాలకు చెందిన వారు వామపక్షం వేపు మొగ్గారు. కొద్ది కాలానికి 1943లో ప్రజానాట్య మండలి (ఇప్టా) కూడా అవతరించింది. జోషీ రాజకీయ సంస్కృతిని, ప్రజా సంస్కృతిని, జనం ఆకాంక్షలను కలగలిపి ముందుకు నడిపించారు.
జోషీ ప్రజల మనిషి. ఎప్పుడు ఎటు అడుగు వేయాలో, ఏ సమయంలో ఏ నినాదం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. బెంగాల్ కరువు పంజా విసిరినప్పుడు జోషీ అద్వితీయమైన కృషి చేశారు. నిజానికి ఆ కృషి కారణంగానే ప్రజానాట్య మండలి ఏర్పడిరది. బి.టి.రణదివే ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో అంటే స్వాతంత్య్రం తరవాత పి.సి.జోషి మీద మితవాది, రెనెగేడ్ లాంటి ముద్రలు వేశారు. 1948లో కలకత్తాలో జరిగిన పార్టీ మహాసభలో ఆయన మీద దండయాత్ర చేసి ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించారు. 1949 జనవరి 27న జోషీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 1949 డిసెంబర్ లో పార్టీ నుంచి బహిష్కరించారు. 1951 జూన్ ఒకటిన ఆయనకు మళ్లీ సీపీఐలో ప్రవేశం దక్కినా పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ ఆయనను పార్టీ అధికార పత్రిక ‘‘న్యూ ఏజ్’’ కు సంపాదకుడిని చేశారు. పార్టీలో ఆయనకు ఎప్పుడూ పూర్వ వైభవం దక్కనే లేదు. జీవిత చరమాంకంలో ఆయన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిశోధన, ప్రచురణ కార్యకలాపాల్లో నిమగ్నమై పోయారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని సమకూర్చడానికి ప్రయత్నించారు.
చిట్టగాంగ్ ఆయుధాగారం మీద జరిగిన దాడిలో పాల్గొన్న కల్పనా దత్తాను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయన కుమారుల్లో ఒకరైన చంద్ హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో పని చేసిన పత్రికా రచయిత. చంద్ భార్య మానిని కూడా పత్రికా రచయితే. జోషి హయాంలో సాయుధ పోరాటాలు జరిగాయి. శాంతియుతంగా ఉద్యమించిన రోజులూ ఉన్నాయి. ఏ ఎత్తుగడ ఎప్పుడు అనుసరించాలో ఆయనకు బాగా తెలుసు. ప్రజా పోరాటాలు స్వాతంత్రోద్యమంతో ముడివడేట్టు చేయడంలో జోషి దిట్ట.
పి.సి.జోషీని సంస్కరణవాది అని ఈ నాటికీ నిందించే వారికి కొదవలేదు. కానీ అనేక చోట్ల సాయుధ పోరాటాలు ఆయన సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలోనే జరిగాయి. అందులో కొన్ని పోరాటాలు ఆయన నాయకత్వంలోనే జరిగాయి. ఆయన మార్గదర్శకత్వంలో ఏర్పడిన ప్రజా సంఘాలు ఇప్పటికీ పని చేస్తున్నాయి. పి.సి.జోషి నాయకత్వంలో పోరాటం, ప్రజోద్యమాలు, సమ్మెలు, ఊరేగింపు, భూ ఆక్రమణలు, భూ పంపీణీలు…ఇలా అనేక రూపాల్లో సాగింది. 1945 నుంచి 1947 దాకా సాగిన వివిధ ఉద్యమాలే దీనికి తార్కాణం.