Homeపుర పోరుకు ఈసీ ప్రక్రియ వేగవంతం

పుర పోరుకు ఈసీ ప్రక్రియ వేగవంతం

- Advertisement -
  • వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితా, ప్రచురణపై నోటిఫికేషన్లు జారీ
  • ఫారం`1 నోటీస్‌తో పాటు 22లోగా జాబితా ప్రకటించాలని ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం తన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా మరో 12 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. ఫారం-1 నోటీసుతో పాటు వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాలను ఈనెల 22న ప్రకటించాలని పేర్కొన్నారు. 2026 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించి, తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రూపకల్పన చేయాలని సూచించారు. మొత్తం 17 నగర పాలక సంస్థలకుగాను విజయనగరం కార్పొరేషన్‌లో వార్డుల పునర్విభజన ప్రక్రియ ముందుగా పూర్తి కావడంతో అక్కడ సెప్టెంబరు 3 నాటికే ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. అలాగే రాష్ట్రంలోని 106 పురపాలక, నగర పంచాయతీల్లో పునర్విభజన పూర్తయిన 58 చోట్ల కూడా సెప్టెంబరు 3నే జాబితాలు వెల్లడించారు. మిగిలిన 12 నగర పాలక సంస్థలు, 29 పురపాలక, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ సెప్టెంబరు 14 నుంచి 17 మధ్య పూర్తి కాన్నుందున, ఆయా చోట్ల ఓటర్ల జాబితా ప్రచురణకు కొత్త తేదీని ఖరారు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సెప్టెంబరు 13న ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన ఎస్ఈసీ… సెప్టెంబరు 22ని ప్రచురణ తేదీగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఓటర్ల జాబితాల ప్రచురణతో ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. మేయర్లు, పురపాలక చైర్మ న్లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ప్రభుత్వానికి మరింత మార్గం సుగమం కానుంది. సంబంధిత కార్పొరేషన్ కమిషనర్‌లు, మున్సిపల్ కమిషనర్‌లు ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు