Wednesday, May 14, 2025
Homeతెలంగాణపులకించిన వరంగల్‌

పులకించిన వరంగల్‌

. అందాలభామల రాకతో ఖిల్లాకు శోభ
. బతుకమ్మ పాటలకు నృత్యాలతో సందడి

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : ప్రపంచ అందాల భామలతో వరంగల్‌ ఖిల్లా కళకళళాడిరది. మిస్‌ వరల్డ్‌ `2025 కంటెస్టెంట్లు బుధవారం వరంగల్‌లో పర్యటించారు. అధికారులు వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముందుగా హరిత హోటల్‌కు చేరుకున్న వారు అక్కడి నుంచి రామప్ప ఆలయం, వెయ్యి స్తంబాల గుడికి చేరుకున్నారు. వారికి ఘన స్వాగతం లభించింది. అందాల రాణులు రెండు బృందాలు విడిపోయారు. మొదటి బృందంలో 22 మంది రెండవ బృందంలో 35 మంది ఉన్నారు. 22 మంది ముందుగా చారిత్రాత్మక వెయ్యి స్తంబాల గుడిని సందర్శించారు. అనంతరం వరంగల్‌ కోట వైభవాన్ని తిలకించారు. జిల్లా కలెక్టర్‌ దివాకర, ఎస్పీ శబరిష, టూరిజం అధికారులు ప్రపంచ సుందరీమణులకు ఘన స్వాగతం పలికారు. గుస్సాడీ నృత్య ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు ఆత్మీయంగా ఆహ్వానించారు. సంప్రదాయాన్ని గౌరవిస్తూ దేవాలయంలో పూజలు చేశారు. అర్చకులు వారిచేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత… చరిత్ర సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అతి పురాతన రామప్ప ఆలయాన్ని తిలకించి మంత్రముగ్ధుల య్యారు. ఆలయాన్ని తనివితీర తిలకించి ఫిదా అయ్యారు. తెలుగింటి సంప్రదాయ రీతిన చీరకట్టులో మెరిసిన మిస్‌ వరల్డ్‌ పోటీదారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయంత్రం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ స్థానిక మహిళలతో కలిసి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇది చూపరులను కట్టిపడేసింది. స్థానిక సంస్కృతిని విశ్వ వేదికపై చాటే అవకాశం లభించినందుకు నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ సుందరీమణులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం రాష్ట్రానికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా మరింత మందికి పరిచయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రామప్ప ఆలయానికి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) చేరుకుని అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రపంచ సుందరిమణుల పూజలను ఎల్‌ఈడి స్క్రీన్‌ ద్వారా వీక్షించారు. మంత్రి వెంట ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య అధికారులు ఉన్నారు. వరంగల్‌ వేయి స్తంభాల గుడి విశిష్టతను టూరిజం గైడ్లు వివరించారు. అక్కడే ఉన్న భారీ నందీశ్వరుడిని చూసి సుందరీమణులు అబ్బురపడ్డారు. విగ్రహాన్ని తాకి వివరాలు తెలుసుకున్నారు. నందీశ్వరుడి చెవిలో కోరికలు చెబుతూ ఈశ్వరుడికి విన్నవించుకునే సంప్రదాయాన్ని పాటించారు. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్‌ సత్య శారద, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు