రాజ్యాల కోసం, భూభాగాల కోసం దాడులకు దిగడం, యుద్ధాలు చేయడం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఫాసిస్టులు ప్రధానంగా సంస్కృతి మీద దాడి చేస్తుంటారు. ఇలా దాడులకు దిగే వారికి ఫాసిజం అంటే ఏమిటో అవగాహన లేకపోవచ్చు. కానీ వారు ఫాసిస్టు విధానాలను అమలుచేసే పార్టీలకు, పాలకవర్గాలకు పదాతి దళాలుగా ఉపయోగపడతారు. తాజాగా తిరుపతిలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో విశాలాంధ్ర స్టాలు మీద దాడి ఫాసిస్టుల విషవమనంలో భాగమే. పెరియార్ పుస్తకాలు అమ్మినందుకు విశాలాంధ్ర పుస్తక కేంద్రంపై దాడి చేశారు. పెరియార్ ఎ.వి.రామస్వామి నాయకర్ పుస్తకాలు అమ్ముతున్నందుకు విశాలాంధ్ర మీద దాడి జరిగింది. కానీ ఫాసిస్టు భావజాలం గూడుకట్టుకున్న వారికి ఒక్క పెరియార్ మాత్రమే శత్రువు కాదు. వారి జాబితాలో హేతుబద్ధంగా ఆలోచించే చాలా మంది మేధావులు, సామాజిక కార్యకర్తలు, రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు, వివిధ కళారంగాలలో పనిచేసే వారూ ఉంటారు. తిరుపతి పుస్తక ప్రదర్శనలో మరికొన్ని పుస్తకాల దుకాణాల మీద దాడులు జరిగాయి. అంతకు ముందు ఇటీవల హైదరాబాద్ లో పుస్తక ప్రదర్శన జరిగినప్పుడు వీక్షణం సంపాదకుడు ఏర్పాటు చేసిన పుస్తక కేంద్రం మీద ఇలాగే దాడి చేశారు. జనవరిలో జరిగిన హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఆఖరి రోజు వీక్షణం పుస్తక కేంద్రంపై దాడి జరిగింది. తిరుపతి వెంకటేశ్వర దేవాలయం ఇంతకు ముందు బౌద్ధ క్షేత్రం అని చెప్పే ఓ పుస్తకం అమ్ముతున్నందుకు దుండగులు దాడికి దిగారు. హిందూ వ్యతిరేక పుస్తకాలు అమ్ముతున్నారని నానా యాగీ చేశారు. ఇలాంటి పుస్తకాలు ఏ పుస్తకాల దుకాణంలోనైనా దొరకొచ్చు. పుస్తక విక్రేతలలో చాలా మందికి అమ్మకాల మీద ఉన్న దృష్టి ఆ పుస్తకాలలో ఉండే అంశాల మీద ఉండకపోవచ్చు. నిర్దిష్ట భావజాలం గల పుస్తకాలు మాత్రమే అమ్మేవారు ఉంటారు. పైగా పుస్తక ప్రదర్శనలు జరిగేటప్పుడు అక్కడ వందలాది పుస్తక కేంద్రాలు ఉంటాయి. ఇందులో వివిధ మతాలకు చెందిన గ్రంథాలూ ఉండొచ్చు. వివిధ భాషలకు చెందిన పుస్తకాలూ ఉండొచ్చు. కానీ హైదరాబాద్ లో వీక్షణం పత్రికవారు ఏర్పాటు చేసిన పుస్తక కేంద్రం మీద పనిగట్టుకుని దాడి చేయడానికి మరో కారణమూ కనిపిస్తోంది. ఆ పత్రిక సంపాదకుడు వీక్షణం మాస పత్రిక ప్రచురించడంతో పాటు యూట్యూబ్ చానల్ కూడా నిర్వహిస్తారు. ఇటీవల ఆ చానల్‌లో మనుస్మృతి మీద కొన్ని వీడియోలు చేశారు. దాడికి ఇది ప్రధాన కారణం అయి ఉండొచ్చు. పుస్తకాలు అమ్మే దుకాణాల్లో హిందూ భావజాలం ఉన్నవీ ఉండొచ్చు. ఆర్.ఎస్.ఎస్. వారూ పుస్తకాలు ఏర్పాటు చేస్తారు. అందులో హిందూయేతర మతాలను విమర్శించే గ్రంథాలు ఉండొచ్చు. మరి అప్పుడు ఎవరైనా దాడి చేస్తే సహిస్తారా? నిజానికి ఏ భావజాలానికి చెందిన పుస్తక విక్రేతల మీద దాడి చేయడం సహించకూడదు. అక్రమంగా ప్రచురించిన పుస్తకాలు అమ్ముతూ ఉన్నప్పుడు కూడా చట్టబద్ధంగా వ్యవహరించాలి తప్ప దాడులకు దిగకూడదు. ఎవరు ఏ పుస్తకాలు అమ్మాలో నిర్ణయించే అధికారం ఎవరికీ ఉండకూడదు. కానీ గత పదేళ్ల కాలంగా ఎవరు ఏం తినాలో, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో కూడా నిర్దేశించే వారు ఎక్కువై పోయారు. గొడ్డు మాంసం తింటున్నారనో, అమ్ముతున్నారనో ముస్లింల మీద దాడిచేసే మూకలకు, మూక హత్యలకు పాల్పడే వారికి పుస్తకాల దుకాణాల మీద దాడి చేసేవారికి పెద్ద తేడా లేదు. ఈ రెండు రకాల వారి భావజాలం మధ్య సంపూర్ణ సామ్యం ఉంది.
పుస్తక ప్రదర్శన జరుగుతున్నప్పుడు దాడులు చేయడం బహుశ: ఇదే మొదటి సారి కావొచ్చు. సైద్ధాంతిక విభేదాలు ఏ సమాజంలోనైనా ఉంటాయి. భావ సంఘర్షణ సహజం. ఇది కేవలం మతాల మధ్యనే ఉండదు. పురాణేతిహాసాల మీద కూడా విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయిన నేల మనది. ఆ భిన్నాభిప్రాయాలు సంవాదాలకు, వాద ప్రతివాదాలకే పరిమితం అయ్యేది. నారదుడు, చిత్రగుప్తుడు, వినాయకుడి పాత్రలను కూడా అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లోనూ తస్లీమా నస్రీన్ పుస్తకాలు అమ్ముతున్న పుస్తక కేంద్రంపై సోమవారం దాడి జరిగింది. అసలు తస్ల్లిమా మీదే బంగ్లా దేశ్‌లోనే కాక మన దేశంలోనూ దాడులు జరిగాయి. ప్రసిద్ధ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుసేన్ దేశం వదిలి వెళ్లాల్సి వచ్చింది. తమిళ రచయిత మురుగన్ ఇలాంటి దాడులే ఎదుర్కున్నప్పుడు అసలు రాయడమే మానేస్తానన్నారు. 2022 అక్టోబర్ లో మార్క్సిస్టు సాహిత్యం మీద ఇలాగే విరుచుకు పడ్డారు. ఆ సందర్భలో కొంతమంది కమ్యూనిస్టు నాయకులను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసింది కూడా. అసహనం ఒక్క సంఫ్‌ు పరివార్ కే పరిమితం కాదని బెంగాల్ సంఘటన రుజువు చేస్తోంది. ఇంకా ముందుకెళ్తే 2003 జనవరి అయిదున భండార్కర్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ పై దాదాపు వందమందితో కూడిన మూక దాడి చేసింది. ఆ మూక తమది సంభాజీ బ్రిగేడ్ అని చెప్పుకుంది. భండార్కర్ సంస్థ అంతర్జాతీయంగా ప్రసిద్ధమైంది. అది కమ్యూనిస్టు భావజాలం ఉన్నదేమీ కాదు. అయినా దాడికి గురి కాక తప్పలేదు. పుణేలో మరాఠీ నాటక రచయిత రాం గణేశ్ గడ్కరి విగ్రహాన్ని కూడా కూల్చేశారు. తాము మరాఠీ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి కంకణం కట్టుకున్నామని సంభాజీ బ్రిగేడ్ చెప్పుకుంది. సంభాజీ బ్రిగేడ్ కోపమంతా ఏమిటంటే అమెరికా రచయిత జేమ్స్ లయిన్ శివాజీ మీద పరిశోధన చేయడానికి భండార్కర్ సంస్థ సహకరించడమట. ఆ సందర్భంగా 68 మంది మీద కేసు నమోదైంది. పుణే సెషన్స్ కోర్టు 14 ఏళ్ల తరవాత 2017 అక్టోబర్ 28 తీర్పు చెప్పి మొత్తం 68 మందినీ నిర్దోషులుగా తేల్చింది. జరగాల్సిన నష్టమైతే జరిగింది. కేవలం పుస్తకాలు, పరిశోధనా సంస్థల మీద దాడులే కాదు. కల్బుర్గి, పన్సారే, ధబోల్కర్, గౌరీ లంకేశ్‌లను హతమారిస్తే ఎవరిని శిక్షించారు కనక. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం చూసీ చూడనట్టు ఉంటే మతం పేరుతోనో, మరో పేరుతోనో ఆగడాలకు, దాడులకు, హత్యలకు పాల్పడే వారికి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. ఇలాంటి ఫాసిస్టు ధోరణులున్న వారికి అధికారంలో ఉన్న వారే ఫాసిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే వారైతే ఇక అడ్డేమి ఉంటుంది! తిరుపతిలో జరిగిన దుర్మార్గాన్ని నిరసిస్తూ రచయితలు, మేధావులు, కళాకారులు వెంటనే స్పందించి నిరసన ప్రదర్శన చేయడం ఆహ్వానించదగిన పరిణామం. దుండగులతో ఏకమయ్యే పార్టీకి మద్దతు ఇచ్చే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు స్వీయ రక్షణ బాధ్యత స్వీకరించక తప్పదు.