Monday, May 12, 2025
Homeతెలంగాణపెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానం

పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానం

. జీసీసీ హబ్‌గా హైదరాబాద్‌
. పరిశ్రమలకు అనుమతిస్తూ ఆర్థికబలోపేతం
. ట్రాఫిక్‌ ఫోర్స్‌లో ట్రాన్స్‌జెండర్‌ల నియామకం
. ‘సొనాటా’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌

విశాలాంధ్ర – హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో హైదరాబాద్‌ జీసీసీ (గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌) హబ్‌గా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే ఏఐ రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణదే అగ్రస్థానం అని, ప్రజా సంక్షేమంతో పాటు పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్టు చెప్పారు. నానక్‌రాం గూడలో సోనాటా సాఫ్ట్‌వేర్‌ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్‌ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సోమవారం సీఎం ప్రారంభించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సొనాటా సాఫ్ట్‌వేర్‌ అత్యాధునిక ఏఐని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమన్నారు. మైక్రోసాఫ్ట్‌, కాగ్నిజెంట్‌, హెచ్‌సీఎల్‌, టెక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయని చెప్పారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తూనే పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా రూ.మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. 2025లో దావోస్‌ నుంచి రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో రాష్ట్రం ఉందన్నారు. 66 లక్షల మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్‌ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు అందజేస్తున్నట్టు వెల్లడిరచారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్‌లను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్‌ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్‌ సిటీలో ఏఐ నగరం, యంగ్‌ ఇండియా స్కిల్స్‌, స్పోర్ట్స్‌ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరుపొందిన మిస్‌ వరల్డ్‌ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయని, మరిన్ని ప్రపంచ ఈవెంట్‌లకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి హైదరాబాద్‌ను అత్యద్భుత నగరంగా మార్చడానికి అందరి సహకారం కోరుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు బ్రాండ్‌ అంబాసడర్లుగా మారండి, విజయాలను ప్రపంచానికి చూపండని పిలుపునిచ్చారు.
గవర్నర్‌తో సీఎం భేటీ
రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబులు సోమవారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. దేశ పరిస్థితులపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు