చింతపట్ల సుదర్శన్
ఎండలో ఎంత సేపు తిరుగుతాం. ‘లివ్ టు ఈట్’ కాదు ‘ఈట్ టు లివ్’ అన్నారు. దొరికింది తిన్నా ఇంక చాలు అరుగు మీదికి పోయి రెస్టు తీసుకుందాం అనుకుంది డాంకీ. దీన్నే ‘కో ఇన్సిడెంట్’ అని కూడా అంటారేమో కాని అటునుంచి డాంకీ, ఇటునించి డాగీ అరుగు ఎక్కేయి.
అరుగు ఎక్కిన డాంకీ గోడకానుకుని కళ్లు మూసుకునే ప్రయత్నంలో ఉంటే డాగీ కూడా అదే ప్రయత్నంలో ఉన్నది కో ఇన్సిడెంట్ ప్రభావమే కదా. డాగీకి ముక్కూ చెవులు చాలా ‘షార్పు’ కనుక ఇంటి లోపల ఏదో సవ్వడి వినిపించింది. కళ్లు మూసుకునే కార్యక్రమం ‘పోస్ట్‌పోన్’ చేసి దిగ్గున లేచి సగం విరిగిన తలుపులో నుంచి లోపలికి చూసి హఠాత్తుగా తోక పైకిలేపి అటెంషన్‌లో నించుంది. ఇది గమనించిన డాంకీ లోపల డాగీకి సహించరానిదేదో కనిపించిందని అర్థమైంది. ఏంటి డాగీ లోపల ఎవరున్నారు? అని అడిగింది.
ఇంకెవరు ‘ఆర్చ్ రైవల్స్’ ‘ఎనిమీస్’ అని హుంకరించింది డాగీ. డాగీకి శత్రువులెవరో వేరే చెప్పాల్సిన పనిలేదు. లోపల ‘సీఎటి క్యాట్’ అనగా పిల్లి కనిపించి ఉంటుంది అనుకున్న డాంకీ పిల్లేనా? అనడిగింది తన ‘స్మార్ట్‌నెస్’ ని కన్‌ఫమ్ చేసుకుందుకు. పిల్లికాదు పిల్లులు సింగ్యులర్ కాదు ప్లూరల్. రెండున్నవి ఒకటి నల్లది. మరొకటి బూడిద రంగుది. ఎక్కడా ప్లేస్ దొరకనట్టు మన కొంపలో దూరి గీరుకుంటున్నవి. మ్యావు మంటున్నవి. వీటి పని పట్టాల్సిందే అంది డాగీ.
కుక్కకి పిల్లి శత్రువనే ‘బ్యాడ్‌నోషన్’ ఎవడు ప్రచారం చేసేడో కానీ అది నిన్ను తినదు. నువ్వు దాన్ని మింగలేవు. మీ శతృత్వం ఇలా అనవసరంగా అసందర్భంగా కొనసాగుతూ ఉండాల్సిందేనా? చంపదగిన యట్టి శత్రువు తన చేత చిక్కిన పొసగ మేలు చేయమన్నాడో కవి, మనది ఆ వేదాంత ధోరణి. లోపల కీచులాడుకుంటున్న ఆ మార్జాలాల సమస్య ఏమిటో కనుక్కుందాం అంది డాంకీ. నన్ను చూస్తే అవి పారిపోతాయి. నువ్వు ముందుండు, నీ వెనకాల నేను నక్కుతా అని డాంకీ వెనక నిలబడిరది డాగీ.
డాగీ ముందు గదిలోకి అడుగేసి అడిగేసింది ఏమిటి బ్రదర్స్ ప్రాబ్లం అని. నల్లపిల్లి ఇటు తిరిగింది. డాంకీతో మనకేం శత్రుత్వం లేదుకదా అనుకుని చెప్పేసింది. మా ఇద్దరికీ ఒక ‘బన్ను’ రొట్టె దొరికింది.
ఎవరికి ఎంత వాటా రావాలో తెలీక కొట్టుకుంటున్నాం అంది. మధ్యవర్తి లేక మాలో మేము తన్నుకుంటున్నాం. నువ్వు వచ్చేవు కదా న్యాయమూర్తిలా జడ్జిమెంటివ్వు. ఈ ‘బ్రెడ్’ ని సమంగా పంచి ఇవ్వు అంది బూడిద రంగు పిల్లి. అదెలా కుదిరేను. దాన్ని ఎంతో కష్టపడి అందుకు వచ్చింది నేను అంకుల్ అంది ‘నల్లక్యాట్’. నేను చూసి ఉండకపోతే తెచ్చేదానివేనా నువ్వే చెప్పు పెద్దన్నా నేనేం ఎక్కువ అడగడం లేదు. సమంగా రావాలన్నాను అంతే అంది ‘గ్రే క్యాట్.’
మీ పంచాయితీ ఈనాటిది కాదు ఏనాటిదో కాని ఇలా కొనసాగుతూనే ఉంటుందేమో. మీ మధ్య మధ్యవర్తిగా నాటి నుంచీ ఉంటూ వస్తున్నది చెట్టు మీద ఎటునుంచి ఎటు దూకుతుందో తెలీని కోతే కద. అదే మీకు అంకుల్ అయినా పెద్దన్నయినా. దాని పెద్దరికం, మధ్యవర్తిత్వం, తలదూర్చేతత్వం ఇంకెవ్వరికీ రాదు. ఈ కొంప వెనుక చెట్టు మీద ఉందో వానరం. దానికి ఏది న్యాయమనిపిస్తే అదే న్యాయం. అది ఎప్పుడు ఎవరిని రక్కుతుందో ఎవరూ చెప్పలేరు. మీకు అంకుల్ అయినా పెద్దన్నయినా అదే. చెట్టు కిందికి వెళ్లి కొట్టుకోండి. మీరు పిలవాల్సిన పనేలేదు. అదే చెట్టు దిగివచ్చి మధ్యవర్తిగా తన్ను తానే ప్రకటించుకుని మీ పంచాయితీని తలకెక్కించుకుని న్యాయం చేస్తానంటుంది. మీ మధ్య ‘సీజ్‌ఫైర్’ అయ్యే ఏర్పాటు చేస్తుంది అంది డాంకీ.
మధ్యవర్తిగా ఉంటానని వచ్చిన పెద్దన్న అదే కోతి మా బ్రెడ్డును మాకు పంచకుండా తానే మెక్కేసింది అనే కథ, మా మార్జాల పురాణంలో ఉందని పెద్దవాళ్లు చెపితే విన్నాం. ఇప్పుడు మళ్లీ అదే ‘రిపీటు’ అవుతుంది. బ్రెడ్డు దాని పాలవుతుంది. మళ్లీమళ్లీ మేం బ్రెడ్డు కోసం కొట్టుకుంటుంటే ‘నేనే మీ పెద్దన్నను’ అంటూ వస్తూనే ఉంటుంది అంది నల్లపిల్లి.
మేం కొట్టుకుంటుంటే తమాషా చూసి ఎంజాయ్ చేసి ఆ తర్వాత తగుదునయ్యా అంటూ తగాదా తీర్చ వస్తుంది మా పాట్లేవో మేం పడతాం అంది బూడిద పిల్లి. రెండు పిల్లులూ గోడ ఎక్కి పారిపోయేయి.
నేను అరవకుండానే పెద్దన్న పేరు విని పారిపోయేయి అవి. మనుషుల్లో కూడా తగవు తీర్చే పెద్దన్నలు ఉంటారు కదా అంది డాగీ.