Friday, December 27, 2024
Homeపోరాటాలే ఊపిరిగా…

పోరాటాలే ఊపిరిగా…

దిల్లీలో ఘనంగా సీపీఐ శతవార్షికోత్సవం

న్యూదిల్లీ: సీపీఐ వందేళ్ల చరిత్ర పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలతో కూడుకున్నది. స్వాతంత్య్రానికి ముందు నుంచి నేటి వరకు ప్రజల తరపున పోరాడుతూ నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ నూరు వసంతాల పండుగ చేసుకుంటోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయం అజయ్‌ భవన్‌లో ఘనంగా వేడుక జరిగింది. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యురాలు అనీరాజా అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అమర వీరులు, విప్లవయోధులకు నివాళులర్పించడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోరాటాలు, ఉద్యమాల ఘన చరిత్రగల సీపీఐ 100వ సంవత్సరంలోకి అడుగిడుతుండటంతో కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. విప్లవ గీతాలతో, నినాదాలతో, నాటకాలతో సందడి చేశారు. అనీ రాజా మాట్లాడుతూ బ్రిటిష్‌ వలసవాద దోపిడీ రాజ్యంపై పోరాటంలో, స్వాతంత్య్రానికి ముందు, తర్వాత జరిగిన ఉద్యమాల్లో సీపీఐ చరిత్రాత్మక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. రాజ్యాంగ వ్యవస్థకు, సమ్మిళిత`వైవిధ్య సామాజిక వ్యవస్థకు ముప్పు పొంచివున్న నేటి కాలంలో కార్మికులు, రైతులు, విద్యార్థులు, అణగారిన వర్గాల వారిని చైతన్యపర్చడంలో, వారిని ఏకతాటిపైకి తేవడంలో, ఉద్యమాలు నిర్మించడంలో సీపీఐ క్రియాశీలంగా వ్యవహరిస్తోందని అన్నారు. వందేళ్ల విప్లవ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనీరాజా పిలుపునిచ్చారు.
ప్రతి కామ్రేడ్‌కు రెడ్‌ సెల్యూట్‌: సురవరం
సీపీఐ శతాబ్ది ఉత్సవాన్ని పురస్కరించుకొని పార్టీలోని ప్రతి ఒక్క కామ్రేడ్‌కు తన తరపున రెడ్‌ సెల్యూట్‌ అంటూ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి గురువారం ఓ సందేశం పంపారు. సీపీఐ విప్లవ స్ఫూర్తికి జేజేలు పలికారు. ఘన చరిత్రగల పార్టీతో ముడిపడటం గర్వకారణమన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి ఊపిరి అందించిన విప్లవ స్ఫూర్తికి వందేళ్ల కిందటే చిహ్నంగా నిలిచిన పార్టీ సీపీఐ అని సురవరం కొనియాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ సీపీఐ అని గుర్తుచేశారు. పరిపాలన ప్రమాణాలను నిర్దేశించిందని, హోం, వ్యవసాయ మంత్రిత్వశాఖల్లో విప్లవాత్మక విధానాలను తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచిందని శ్లాఘించారు. అంతర్జాతీయ స్థాయి కమ్యూనిస్టు ఐక్య ఉద్యమాలకు బలమైన పునాదిని సీపీఐ వేయగలిగిందని తెలిపారు. శ్రామికుల పక్షాన బలమైన స్వరంగా మారిందని సురవరం అన్నారు.
‘నిస్వార్థ సేవలు అందించే ప్రతి ఒక్క సీపీఐ కార్యకర్తకు, సభ్యునికి రెడ్‌ సెల్యూట్‌. మెరుగైన ప్రపంచం సాధన కోసం అరుణ పతాక నీడలో శ్రామిక వర్గాన్ని నడిపించిన ప్రతి ఒక్కరికి రెడ్‌ సెల్యూట్‌. ఎర్ర జెండా ద్వారా ప్రజలను మేల్కొపేందుకు పోరాడుతూ ప్రాణాలు త్యజించిన ప్రతి అమరుడికి రెడ్‌ సెల్యూట్‌. నిర్బంధంలో గడిపిన… అజ్ఞాతంలోకి వెళ్లిన… వర్ణనాతీతమైన పరిస్థితులను, సమస్యలను ఎదుర్కొన్న ప్రతి కమ్యూనిస్టుకు రెడ్‌ సెల్యూట్‌’ అని సురవరం పేర్కొన్నారు. అరుణ పతాకాన్ని చేబూని విప్లవ వారసత్వాన్ని ముందుకు తీసుకెళదామని పిలుపునిచ్చారు. శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లెఫ్ట్‌ ఐక్యతకు మరోమారు సురవరం సుధాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు