కె. రామాంజనేయులు
అమరవీరుడు కామ్రేడ్ నక్కి రామన్న మరణించి గురువారానికి 35 సంవత్సరాలు. నక్కి రామన్న భౌతికంగా మరణించి 35 సంవత్సరాల గడిచినప్పటికీ ప్రజల గుండెల్లో నేటికీ చిరస్మరణీయులుగా ఉన్నారు. దీనికి కారణం ప్రజల కోసం ప్రజల స్వేచ్ఛ కోసం తన ప్రాణాలు పణంగా పెట్టడమే. దేశానికి స్వాతంత్య్రం 1947లో ఆగస్టు 15న వచ్చినప్పటికి కర్నూలు జిల్లా డోన్ తాలూకా పడమటి గ్రామాల్లో ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది మాత్రం 1975వ సంవత్సరం తర్వాతనే. అలాంటి గ్రామాలు బి. రామదుర్గం, ఎద్దుపెంట, కటారుకొండ వంటి గ్రామాలే. అందులో చెప్పుకోదగ్గ గ్రామమే కటారుకొండ. తరతరాలుగా కరుడుగట్టిన ఫ్యూడల్, భూస్వామ్య ,పెత్తందారితనంతో మగ్గిపోతూ ప్రజలకు ఏమాత్రం స్వేచ్ఛ లేక సాటి మనిషిగా గౌరవం లేక పెత్తందార్ల కబంధహస్తాలలో నలిగిపోతున్న కటారు కొండ గ్రామంలో 1976 వ సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజల తిరుగుబాటుకు ఆ గ్రామ యువకులకు నక్కి రామన్న నాయకత్వం వహించారు.
1976లో ఆనాటి సీపీిఐ జిల్లా కార్యదర్శి వై.స్వామి రెడ్డి, పత్తికొండ తాలూకాకు చెందిన చదువుల రామయ్య, డోన్ తాలూకా కార్యదర్శి మిలిటరీ నాగప్పకు ఆ గ్రామంలో నెలకొన్న దుర్భర పరిస్థితులను తెలియజేసి ప్రజలను విముక్తి చేయాలని కోరి వారి నాయకత్వంలో సీపీఐ సభ్యత్వాన్ని పొంది ఎర్రజెండాను గ్రామంలో ఎగరవేశాడు నక్కి రామన్న. కటారుకొండ గ్రామంలో పెత్తందారుల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాటాన్ని ప్రారంభించారు. కటారు కొండలో తిరగబడిన ఎర్రసేనపై దాడులు చేశారు. ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు అనేక అక్రమ కేసులు బనాయించారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పార్టీని ముందుకు తీసుకొని పోతున్న తరుణంలో 1979లో మల్యాల రైల్వే స్టేషన్లో కోర్టు వాయిదాకు వెళ్లేందుకు పార్టీ కార్యకర్తల తో కలిసి రైలు కోసం వేచి ఉన్న నక్కి రామన్న పై బాంబులతో దాడి చేయగా ఆ దాడిలో ఆర్. బి.చిన్న గోవిందు మరణించారు. తీవ్ర గాయాలతో నక్కి రామన్న బ్రతికి బయటపడ్డారు. ఆ తర్వాత డోన్ తాలూకా సీపీిఐ కార్యదర్శిగా ఎన్నికై తాలూకాలో కమ్యూనిస్టు పార్టీని విస్తరించేందుకు కృషిచేశారు. నాయకునిగా ఎదుగుతున్న నక్కి రామన్నపై ప్రత్యర్థులు అనేకసార్లు హత్యా ప్రయత్న లు చేసినా ప్రజల సహకారంతో తప్పించుకొని తిరుగుతూ తన ప్రాణాన్ని లెక్కచేయకుండా సీపీఐ కార్యాలయాన్ని డోన్ లో ఏర్పాటు చేసుకొని ఎర్రజెండా జైత్ర యాత్ర కొనసాగించారు.
1981లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కటారుకొండ గ్రామ సర్పంచ్‌గా ఘనవిజయం సాధించారు. అప్పటివరకు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఆ గ్రామ రూపురేఖలను మార్చడానికి నక్కి రామన్న కృషిఎనలేనిది. అప్పటివరకు దిగుడు బావి నీళ్లు తాగి నారి కురుపులతో బాధపడుతూ అంగవైకల్యంతో జీవించే ప్రజలను ఆ వ్యాధి నుంచి కాపాడడానికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లగా స్వయంగా కలెక్టర్ గ్రామానికి వచ్చి రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. దళిత కుటుంబాలకు ఇంటి స్థలాలను మంజూరు చేయించి పక్కా గృహాలను నిర్మించారు.
గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేసిన దాదాపు 8 సంవత్సరాల కాలంలో గ్రామం అభివృద్ధి చెందడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. కేవలం ఆ గ్రామానికి పరిమితం కాకుండా తాలుకాలోని గ్రామాలన్ని తిరిగి గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యం లేని అనేక గ్రామాలకు రోడ్ల నిర్మించడం, త్రాగు నీటి సమస్య పరిష్కారం కోసం, రేషన్ కార్డులను, ఇళ్ల స్థలాలు,పక్కా ఇళ్లు, పెన్షన్లు మంజూరు చేయించడంలో కృషి చేయడమే కాకుండా అణగారిన వర్గాలపై గ్రామాల్లో పెత్తందార్లు చేసే దౌర్జన్యాల నుంచి కాపాడి సీపీఐ అండగా ఉంటుందన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించారు. ఒకవైపు ప్రత్యర్థుల హత్యా ప్రయత్నాలు ఎదుర్కొంటూ తన ప్రాణాలను లెక్కచేయకుండా గ్రామ గ్రామాన సీపీఐ తరఫున పోరాటాలు నిర్వహించారు. తిరునాంపల్లి గ్రామంలో భూపోరాటం చేసి హరిజన,గిరిజన కుటుంబాలకు 130 ఎకరాల భూములను, సీసంగుంతల గ్రామంలో 50 ఎకరాల భూములను పేద దళితకుటుంబాలకు దక్కేలా కృషిచేశారు. ఈ సందర్బంగా హత్య, అక్రమ కేసులను కూడా ఎదుర్కొన్నారు.ఎస్. గుండాల గ్రామంలో చెన్న కేశవ స్వామి దేవాలయానికి చెందిన సోత్రియం భూములను ఆ గ్రామంలో వెనుకబడిన రైతుల కుటుంబాలకు సొంతం చేయించడంలో నక్కి రామన్న కీలక పాత్ర పోషించారు. కామ్రేడ్ నక్కి రామన్న కు చదువు రాదు. నిరక్ష్యరాస్యుడు, పార్టీలో పనిచేయాలంటే కనీసం తెలుగులో వార్తలు చదవలేకుండా పార్టీ సాహిత్యం చదవకుండా పార్టీకి నాయకత్వం వహించలేవన్న పార్టీ రాష్ట్ర నాయకులు వి కె ఆదినారాయణ రెడ్డి మాటలను ఆసరాగా చేసుకుని అక్రమ కేసుల్లో రిమాండ్ లో ఉన్నప్పుడు జైలులోనే చదవడం రాయడం పట్టుదలతో నేర్చుకున్నారు. పేపర్, పార్టీ సాహిత్యం చదవడం, డైరీని రాసుకోవడం నేర్చుకున్నారు. నక్కి రామన్నను నేరుగా ఎదుర్కోలేక ప్రత్యర్థులు రాజకీయ కుట్రతో అనంతపురం జిల్లా నుంచి కిరాయి హంతకులను రప్పించి 1990 మే 15న డోన్ పట్టణంలో పార్టీ కార్యాలయం సమీపంలో హత్యచేశారు. నక్కి రామన్న హత్యతో పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని కలలుగన్న
పత్యర్థుల ఆశలు, వారికి మద్దతు ఇచ్చిన అధికార ముఠా రాజకీయ నాయకుల ఆశలు అడియాశలు అయ్యాయి. నక్కి రామన్న హత్యతో ఏమాత్రం కుంగిపోకుండా మరింత పట్టుదలతో పార్టీ నాయకత్వం కార్యకర్తలు మరింత పట్టుదలతో పనిచేసి ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొన్నారు. దీంతో తగ్గి వచ్చిన నక్కి రామన్న ప్రత్యర్థులు హత్య రాజకీయాలు మానివేస్తామని చేసిన ప్రతిపాదనతో పార్టీ రాష్ట్ర నాయకులు వికె ఆదినారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి చదువుల రామయ్య సమక్షంలో తాము రాజకీయ కార్యకలాపాలకే పరిమితం అవుతామన్న ప్రత్యర్థుల హామీతో కుదిర్చిన రాజీ ఇరువైపులా చిత్తశుద్ధితో అమలు కావడం వల్ల ప్రశాంత వాతావరణం గ్రామంలో నెలకొన్నది. ఈ చర్య చుట్టుపక్కల గ్రామాలకు మార్గదర్శకమై ఆదర్శంగా నిలిచింది. రెండు ప్రధాన ముఠా రాజకీయాల మధ్య డోన్ తాలూకాలో సిపిఐ మరింత పట్టుదలతో ప్రజా సమస్యలపై పనిచేసి పార్టీ విస్తరించింది. డోన్ తాలుకాలోని 25 గ్రామాలకు పార్టీ విస్తరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులుగా, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్ లుగా పార్టీ నాయకులు అ గామంతో పాటు అనేక గ్రామాల్లో విజయం సాధించారు. క్లిష్ట సమయంలో తాలూకాలో పార్టీ నిర్మాణం చేయడంలో నక్కి రామన్న తన సతీమణి నక్కి బాలమ్మను కూడా పార్టీ నిర్మాణంలో భాగస్వాములను చేసి మహిళా సమాఖ్య కార్యక్రమాల్లో పనిచేసేందుకు ప్రోత్సహించారు.