డాక్టర్ జీకేడీ ప్రసాదరావు
ప్రపంచీకరణ నేపథ్యంలో సంభవించిన అనేక పరిణామాల్లో ప్రాంతీయ భాషల మీద నిరాదరణ ఒకటి. ఈ సందర్భంలోనే తెలుగుభాష బోధనామాధ్యమంగా అణచివేతకు గురయింది. ఒక్క తెలుగుభాషతో మాత్రమే యువత ఉద్యోగాలు పొందలేరనే భయాన్ని నిండా నింపేసింది ఒక వర్గం. అయితే తెలుగు ప్రజలు ప్రపంచంతో అనుసంధానం కావడానికి అంతర్జాతీయ భాషల అవసరం వుంది. ప్రధానంగా ఇంగ్లీషు భాష అందరికీ అవసరమే. కాకపోతే ఇంగ్లీషు లేకపోతే జీవితమే లేదనేంత తీవ్రప్రచారం జరిగిపోయింది. ఆ తర్వాత ప్రాథమికస్థాయి నుంచి రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం విద్య తీసుకొస్తున్నా మని అప్పటి ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. ఈ ముసుగులో వందల సంఖ్యలో పాఠశాలలు మూసేసింది. చిన్నపిల్లలు బడికెళ్ళే దూరాన్ని పెంచేసింది. ఇలా ఎన్నో పరిణామాలు తెలుగుభాష ప్రాభవాన్ని తగ్గించేందుకు కారణమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుభాష, సాహిత్యం, పత్రికారచన వాటి అస్థిత్వ్తాన్ని నిలుపుకున్నాయి. భారతీయ భాషల్లో తెలుగుకు ప్రత్యేక స్థానం చెరిగిపోలేదు. రాజ దర్భారుల నుంచి పల్లెపదాల వరకు తెలుగుభాష సాంస్కృతిక సౌందర్యాన్ని కాపాడుకుంటోంది. ఇటువంటి తెలుగుభాషకు ప్రతికారచన మరింత పరిపుష్ఠం చేకూర్చింది. తెలుగు పత్రికారచన సంఘసంస్కరణలో, ప్రపంచ యుద్ధ కాలాల్లో, స్వాతంత్య్రోద్యమంలో, రాజ్యాంగ రచనా కాలంలో, ప్రజాస్వామ్య రాజకీయాల్లో జీవన వాహికగా పరవళ్లు తొక్కింది. ఇటువంటి తెలుగు పత్రికారచన ప్రత్యేక సబ్జెక్టుగా తెలుగు జర్నలిజం పేరిట కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రారంభించడం చాలా అవసరమని చెప్పొచ్చు.
నేటి గ్లోబల్, డిజిటల్, కుత్రిమమేధ పరంపరలో నడుస్తున్న ప్రసార మాధ్యమాల్లో తెలుగుభాష తన సుస్థిర స్థానాన్ని పదిలపర్చుకుంటుందనే చెప్పాలి. తెలుగు సామాజిక మాధ్యమాల నుంచి యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ప్లూయెన్సర్లు వాళ్ల ప్రాంతాల మాండలికాల్ని, యాసను, ప్రాసను, సామెతల్ని, జాతీయాల్ని కలగలిపి తమ సొంత వ్యాఖ్యానాలతో, జానపద సౌందర్యంతో భాషకు పరిమళాలు అద్దుతున్నారు. సామాజిక మాధ్యమాలు, వివిధ వేదికలుగా వినోద కార్యక్రమాలు తెలుగుభాషకు మరింత బలం చేకూర్చే కారకాలేనని చెప్పాలి. ప్రపంచంలో తెలుగు రాష్ట్రాల కంటే చిన్న దేశాలు చాలా వున్నాయి. వాటిని అంతర్జాతీయ సమాజం ప్రత్యేకంగా గుర్తించడంతో పాటు వాటి భాషల్ని గుర్తించింది. ప్రపంచ ప్రసిద్ధ సెర్చ్ ఇంజన్ గూగుల్ సంస్థ ఇన్‌పుట్ టూల్స్‌లో ఇప్పటికే సుమారు 140 భాషల్ని అనువాదంలోకి తీసుకొచ్చింది. కృత్రిమ మేధ నుంచి సైతం అనువాదాల్ని, విశ్లేషణలను పొందే అవకాశం దక్కింది. తొలి తెలుగు పత్రిక ‘సత్యదూత’ 1835 నుంచి నేటి డిజిటల్ మీడియాలో తెలుగు పత్రికల వరకు తెలుగు జర్నలిజం చరిత్ర అందు బాటులో వుంది. కందుకూరి వీరేశలింగం పంతులు ‘వివేకవర్థిని’ సామాజిక సంస్కరణకు, తెలుగుభాషకు అంకితమిచ్చారు. ఇలా మొదలైన తెలుగు పత్రికల చరిత్ర, స్వరాజ్య, కృష్ణా పత్రిక, జన్మభూమి, ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ ఇంకా ఎన్నో పత్రికలు స్వాతంత్రోద్యమంలోనూ కీలకపాత్ర పోషించాయి. ఇవిగాక తర్వాత వచ్చిన ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఉదయం, ఈనాడు, వార్త మొదలయిన పత్రికలు కొన్ని లక్ష్యాలతో సాగాయి. వీటికి సమాంతరంగా వామపక్ష పత్రికలు వార్తా ప్రచురణతో పాటు వివిధ రకాల సాహిత్యాన్ని, భావజాలాన్ని ప్రచురిస్తూనే వున్నాయి. వార, మాస, నిర్ణీతకాల పత్రికలతో పాటు, కుల, మత, లింగ ప్రాతిపదికన మరికొన్ని పత్రికలు ముద్రితమవుతున్నాయి. సామాజిక, రాజకీయ, సినిమా, ఆర్థిక సాంస్కృతిక, సాహిత్య పత్రికల ప్రచురణ కూడా కొనసాగుతుంది. వీటిలో కొన్ని ముద్రితం కాగా, మరికొన్ని ఆన్‌లైన్, డిజిటల్ ఎలక్ట్రానిక్ పత్రికలుగా వున్నాయి. ఇవన్నీ తెలుగుభాషా వికాసానికి మకుటంగా నిలుస్తున్నాయనే చెప్పాలి.
తెలుగు భాషను పరిరక్షించాలనే సంకల్పం కలిగిన ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో ‘తెలుగు జర్నలిజం’ కోర్సుని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం కోర్సులను పరిశీలించిన తర్వాత విద్యారంగానికో లేదా మీడియా రంగానికో చెందిన వారిలో ఈ ఆలోచన మరింత బలపడుతుంది. తమిళం, మలయాళం, కన్నడ, ఉర్దూ, ఒరియా, హిందీ, గుజరాతీ, మరాఠీ మొదలైన భాషల్లో ఆయా రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలు భాషాప్రాతిపదికన జర్నలిజం కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఇవి ఆయా రాష్ట్రాల ఉన్నత విద్యా రంగంలో ప్రత్యేకస్థానాన్ని ఆక్రమించాయి. ఉద్యోగ అవకాశాలకు దారి చూపుతున్నాయి. అక్కడి సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక పరిస్థితుల్ని ఆవిష్కరిస్తున్నాయి. అనువాద పుస్తకాలు వెలువడుతు న్నాయి. మేధో వర్గం తెలుగు జర్నలిజం చరిత్ర మీద అవగాహన కలిగి ప్రాంతీయ భాషల్లో జర్నలిజం విద్య అవసరాన్ని గుర్తించాల్సి వుంది. దేశంలో అనేక విశ్వ విద్యాలయాల్లో ప్రాంతీయ భాషల్లో జర్నలిజం కోర్సులు ఎప్పటి నుంచో సాంప్రదాయ కోర్సులుగా కొనసాగుతున్నాయి. ఈ కోర్సుల్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆనాడే గుర్తించింది. ఇదిలా వుండగా మన రాష్ట్రంలో విజయవం తంగా నడుస్తున్న ఈ కోర్సులను గత వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసిన సందర్భాలు వున్నాయి. ప్రత్యేకించి 2019-20 విద్యాసంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్, తెలుగు రెండు మాధ్యమాల్లో పీజీ డిప్లమా కోర్సు ప్రారంభి ఒక్క ఏడాదిలోనే ఎత్తేసింది. ఇటువంటి నిర్ణయాలపై ఉన్నత విద్యాశాఖకు, మండలికి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు మొరపెట్టుకున్నా, మీడియాకి ఎక్కినా కనీసం పట్టించుకోలేదు. పైగా బాధితుల్ని అణచివేశారు. జర్నలిజం విలువలు మంటగలిసిపోతున్నాయని గుండెలు బాదుకుంటున్న విమర్శకులు జర్నలిజం విద్య గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ, మొబైల్ : 9393 111740