. ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పులు మిగిల్చారు
. గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లు
. 18న ‘ఇందిరా సౌరగిరి జల వికాసం’ ప్రారంభం
విశాలాంధ్ర – హైదరాబాద్: ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా రూ. వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అయితే ప్రజల కోసం మంచి చేస్తున్న ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉండకూడదని బీఆర్‌ఎస్ కుట్రలు పన్నుతుందని, దీన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. మహబూబా బాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గం లక్ష్మీ నరసింహపురంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని వారి చేతికి అప్పగిస్తే ఏడు లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు అన్నారు. ప్రజల సొమ్మును దోపిడీ చేయడం మూలంగానే నేడు అనేక పథకాలు ప్రజలకు ఇంకా అందకుండా పోయాయన్నారు. అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన గిరిజన రైతులు సాగు చేసుకునేందుకు వెళితే… మహిళలని చూడకుండా ప్రభుత్వం చెట్టుకు కట్టేసి కొట్టిందని అన్నారు. గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గిరిజన రైతులకు భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ఈనెల 18న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట చెంచు కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామన్నారు. రూ.12,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ప్రతి గిరిజన రైతుకు సోలార్ విద్యుత్ పంపుసెట్టు, స్ప్రింక్లర్లు, అవకాడో, పామ్ ఆయిల్ వంటి మొక్కలు ఉచితంగా అందజేస్తాం అన్నారు. పదేళ్ల కాలంలో ఒక డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు, ఏ ఒక్క దళితునికి భూమి పంపిణీ చేయలేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, ప్రతి మండలంలో కేజీ టు పీజీ పాఠశాలలో నెలకొల్పుతామని దాన్ని పక్కన పడేశారు. పెద్ద పరిశ్రమ గాని, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ వంటి ఒక భారీ నీటి ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర దివాలా తీయించి బ్యాంకులకు కుదవబెట్ట్టి తగుదునమ్మ అంటూ కేసీఆర్ కుటుంబం మాట్లా డుతుందని విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల్లు మంజూరు చేశాం, రూ.22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇంటికో ఉద్యోగం అని పదేళ్లలో ఒక్కసారి కూడా గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేకపోయారన్నారు. తాము అధికారంలోకి రాగానే ఏడాదిన్నర కాలంలో 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. మరో 30 వేలు భర్తీ చేయబోతున్నట్టు చెప్పారు. యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు రూ.తొమ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం అనే స్వయం ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. దీంతో ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉపాధి పొందుతారన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఆపలేదు… రైతు భరోసా పథకానికి మరో రెండు వేలు అదనంగా జోడిరచి అందజేస్తున్నాం అన్నారు. రూ. రెండు లక్షల రుణమాఫీ మొదటి ఏడాదిలోనే చేశామన్నారు. రైతు రుణమాఫీ కోసం రూ.21,500 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రూ. 13వేల కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు ప్రతినెల ఒక్కొక్కరికి కిలోలు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం అని డిప్యూటీ సీఎం అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించినట్టు పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం అన్నారు. 200 యూనిట్ల లోపు వాడుకునేవారికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నాం… అందుకు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లిస్తుందని ఈ పథకం ద్వారా ప్రతి గ్రామంలో 80 నుంచి 90 శాతం మంది కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది వివరించారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు అందిస్తూ వారి తరపున రూ.12,500 కోట్లు విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నట్టు తెలిపారు.