కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025`26 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఏమాత్రం లేదు. ఇది కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్టు కనిపిస్తోంది. ఈ దేశ సంపద సృష్టికర్తలైన కార్మికులు, కర్షకులను ఈ బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించారు. అణగారిన వర్గాల అత్యంత దయనీయ స్థితి ఆందోళన కలిగిస్తోంది. వారి కడగండ్లు గురించి మాట్లాడేందుకు కేవలం కొద్ది నిముషాలు సరిపోదు. దానిపై మాట్లాడాలంటే పార్లమెంట్ సంవత్సర కాలంలో అనేక సార్లు సమావేశం కావాల్సివుంటుంది. ఒకప్పుడు సంవత్సరానికి 135సార్లు సమావేశమయ్యే పార్లమెంట్ ఇప్పుడు ఏడాదికి 55 రోజులు మాత్రమే సమావేశమవుతోంది. ఇలా చేయడం మన ప్రజాస్వామ్యానికి శిలువ వేయడం వంటిదేననడంలో ఎటువంటి అనుమానంలేదు. ఇలా చేయడాన్ని అధికారపక్షం మానివేయడంతోపాటు ప్రతిపక్ష పార్టీలకు మరింత అవకాశం కల్పించాలి. అప్పుడే పార్లమెంట్‌లో ప్రజల కడగండ్లు స్పష్టంగా వివరించగలుగుతామని నేను స్పష్టం చేయదలుచుకున్నాను.
‘‘ఈ బడ్జెట్‌లో బీహార్‌కు అనేక రాయితీలు ఇచ్చినందుకు తమిళనాడుకు ఎటువంటి అభ్యంతరంలేదు. తమిళనాడును ఎందుకు పట్టించుకోలేదన్నదే ప్రశ్న. తమిళనాడును ఎందుకు విస్మరిస్తున్నారో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేయాలి. ప్రత్యేకించి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. మోదీ ప్రభుత్వం ఈ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని నాశనం చేస్తోంది. దిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయం శాశ్వతం కాదు, ఈ విజయం తాత్కాలిక స్వభావం కలిగినదే. ప్రతిపక్షాలలో అనైక్యత బీజేపీకి విజయాన్ని అందించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అనేక అక్రమాలకు కూడా పాల్పడిరది. ఈ విజయం చిరకాలం నిలిచిపోదని బీజేపీ గుర్తించాలి. ఈ బడ్జెట్‌లో తిరుక్కురల్ ప్రస్తావన చేశారు. కానీ ఎటువంటి న్యాయం, చట్టంలేదు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని పెంచేందుకు ఏం చేస్తారో బడ్జెట్ ప్రతిపాదనలలో ప్రస్తావించలేదు. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చకుండా మీరు పటిష్టపరిచివుండాల్సింది. ఈ పథకం క్రింద కూలీలకు ఇచ్చే వేతనాలు పెంచాలి. కానీ, ఈ పథకానికి కేటాయింపులు రూ.89,000 కోట్ల నుంచి రూ.86,000 కోట్లకు తగ్గించి వేశారు. గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి రెగ్యులర్ ఉపాధి ఎలా కల్పించాలనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ పథకాన్ని ఎలాగైనా రద్దు చేయాలని తహతహలాడుతోంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ దశాబ్దా కాలంలో కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనాలు, పన్ను రాయితీలు ఎంత భారీగా ఇచ్చారో లెక్కేలేదు. ఆ కార్పొరేట్ కంపెనీల రుణాలను ఎలా మాఫీ చేశారు? కార్పొరేట్ పన్ను ఎంత తగ్గించారు? దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు వచ్చిన నష్టం ఎంత? ఈ వాస్తవాలన్నింటి కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఈ ప్రభుత్వం ఎవరి కోసం అధికారంలో ఉందో తెలుస్తుంది.
మోదీ పాలనలో ప్రభుత్వరంగ నిర్వహణ అత్యంత పేలవంగా ఉంది. వాటిని పటిష్టపరిచే బదులు నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానంవుంది. మోదీ నిరంతరాయంగా పండిత్ జవహర్‌లాల్ నెహ్రుని తప్పుపడుతుంటారు. ప్రజల సంపదగా ప్రభుత్వరంగ సంస్థలను నెహ్రు మనకు వదిలివేశారు. ఇవి సామాన్య ప్రజల సంపద. ఈ ప్రభుత్వరంగ సంస్థలన్నింటి నుంచి పెట్టుబడులు ఉపసంహరించే అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారు? ఇందుకు ప్రజల నుంచి అనుమతి తీసుకున్నారా?
మోదీ ప్రభుత్వానికి ప్రభుత్వరంగం దేనిపైనా శ్రద్దలేదు. బీమా రంగాన్ని చూడండి. ఇప్పుడు నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతిస్తున్నారు. బీమా రంగం నుంచి తన బాధ్యతలన్నింటినీ ప్రభుత్వం వదులుకుంది. ఇది ప్రజలకు, దేశానికి అన్యాయం చేయడమే. ఈ పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పేద, అణగారిన, అట్టడుగు, కార్మిక, కర్షక, రైతు, వ్యవసాయ కూలీల సంక్షేమానికి చేసిందేమీ లేదంటే అతిశయోక్తికాదు. అమెరికా డాలరు లేదా రష్యా రూబుల్, లేదా ఇతర దేశ కరెన్సీతో పోల్చుకుంటే నేడు మన రూపాయి విలువేమిటి? భారత రూపాయి పతనానికి ఎవరు బాధ్యతవహిస్తారు?ఆ పతనానికి మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. ఒక వైపు ధరల పెరుగుదల, మరో వైపు ద్రవ్యోల్బణం పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వారి కష్టార్జితాన్ని మోదీ ప్రభుత్వం లాక్కుంటోంది. ఈ దేశాన్ని పాలించే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. ఈ బడ్జెట్ ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్. ఎఫ్‌డీఐ స్నేహపూర్వక బడ్జెట్. కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ తరపున ఈ బడ్జెట్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.
(కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా
ఈ నెల 11వ తేదీన పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం సంక్షిప్తీకరణ)