Friday, April 4, 2025
Homeవిశ్లేషణప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం

ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం

ఈ పాలన నాకు నచ్చలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ముఖ్యం. కాని ప్రస్తుతం మన దేశంలో ప్రజా వ్యతిరేక పాలన జరుగుతోంది. ఈ విషయంలో పూర్తి నిరసన తెలియజేస్తున్నా. ఏంటి బావ నిరసన బాట పడుతున్నావు. కమ్యూనిస్టులు ఈ మధ్య ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై నిరసన తెలియజేస్తూ ప్రదర్శన చేస్తున్నారు. నువు కూడా కలుస్తావా కలిస్తే తప్పేంటి. నిజమేనయ్యా తప్పుకాదు. తప్పక ప్రజల హితం కోరే వారందరు నిరసన బాట పట్టాల్సిందే. ప్రపంచంలో మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని గొప్పలు చెప్పుకుంటాం. కాని ఏలిన వారు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు కాక కుబేరులకు మేలు చేసేవిగా ఉంటున్నాయి. ప్రపంచ సంపద, ముఖ్యంగా మన దేశ సంపద కన్నా పదిమంది పారిశ్రామికవేత్తల సంపద ఎక్కువని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అసలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ అవసరాలు తీర్చడానికి కొంతమందిని ఎన్నుకుంటారు. వారినే ప్రజా ప్రతినిధులు అంటారు. వారు నిరంతరం ప్రజల హక్కులకు, ప్రజల స్వేచ్ఛకు భంగం కలుగకుండా పాలన సాగించాలి. కాని వాస్తవానికి అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పాలించే వారు ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరించడమే అందుకు కారణం. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక తనవాడు తమ పార్టీ వారే ప్రజలని వారికి మాత్రమే ఉపయోగపడటం జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో జరగరానిది.
నిజమేనయ్యా అసలు అవసరమైతే రాజ్యాంగంలో సవరణలు చేయాలి. ఎన్నికలలో ముగ్గురు పోటీ చేసినప్పుడు విజయం సాధించిన వ్యక్తి కంటే మిగతా ఇద్దరికి కలిపి ఎక్కువ ఓట్లు రావచ్చు. అంటే గెలిచిన వ్యక్తికి సంబంధించిన పార్టీ అధికారంలోకి వచ్చి వారి పార్టీ వారికే పని చేయడం తప్పుకదా. పది నెలల నాడు జరిగిన ఎన్నికలలో బీజేపీ కేవలం రెండు శాతం కన్నా తక్కువ ఓట్ల తేడాతో అధికారం చేజిక్కించుకుంది. అంటే మిగతా 48 శాతం ప్రజలకు అన్యాయం చేయడం చట్టబద్దంగా కాకపోయినా న్యాయబద్దంగా తప్పే. అసలు ఓట్ల ద్వారా ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కువ ఓట్లు వేసిన వారికి అన్యాయం జరగరాదు. ముగ్గురు, నలుగురు పోటీ చేసినప్పుడు మూడో వంతు ఓట్లతో నెగ్గితే వారు ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు మిగతా రెండు వంతుల ప్రజలకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేకపోవడం నైతికంగా అన్యాయమే. ప్రజాస్వామిక పాలనలో ఓట్ల శాతం ముఖ్యం. అంటే ఓట్ల శాతం బట్టి ఎక్కువ శాతం ప్రజలు కోరుకున్న వారే పరిపాలించాలి. మన రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కలిపి 60 శాతం ఓట్లు రాగా వైసీపీకి 39.37 శాతం ఓట్లు పోలైనాయి. కాని 39.37 శాతం ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్ష హోదా దక్కడం లేదు. మొత్తం శాసన సభ్యుల్లో 10 శాతం సభ్యులు ఉన్నా మాట్లాడే అర్హత ఉంటుంది కదా. శాసన సభ్యుల సంఖ్యలో 10 శాతం కంటే ఓట్లలో దాదాపు 40 శాతం పొందినా ప్రతిపక్ష హోదా దక్కని రాజ్యాంగంలో ప్రజలకు అన్యాయం జరిగినట్లే. ఏ శాసనం చేసినా ఎన్ని జీవోలు తెచ్చినా ప్రజల కోసమే అయినప్పుడు 40 శాతం ప్రజలను విస్మరించడం అన్యాయం. అవసరమయితే ప్రజల కోసం రాజ్యాంగంలో సవరణలు కూడా అవసరమనే సంగతి పాలకులు గుర్తించాలి. ఈ విషయంలో అవసరమయితే రాజ్యాంగ నిపుణులతో, మేధావులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రజల కోసం ప్రజలు పరిపాలించుకునే ప్రజాప్రభుత్వంలో కొన్ని సవరణలు ప్రజల కోసం చేయడం అవసరం. ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వం ప్రజల కోసమనే సంగతి మరువరాదు.
అంతేకాకుండా మూడో వంతు ఓట్లతో విజయం సాధించిన శాసన సభ్యులు అందులో తన వెంట తిరగని సామాన్య ప్రజలకు పనులు చేయకుండా తమతో అంటకాగిన వారికే పనులు చేయడంతో నాల్గవ వంతు ప్రజలకే అభివృద్ధి దక్కుతున్న విషయం తెలియంది కాదు. ప్రజాహితం కోరే పార్టీలన్నీ కూటమిగా ఏర్పడటం తప్పుకాదు. ఏర్పడి ప్రభుత్వాని ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఏం చేస్తున్నారనేది ముఖ్యం. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నెరవేర్చడం లేదో సమాధానం చెప్పాలి. ఖాళీ ఖజానా సంగతి ఎన్నికల ముందు తెలియక వాగ్దానాలు చేశారా అని ప్రజలడుగుతున్న వారికి సమాధానం చెప్పవలసిన నైతిక బాధ్యత కూటమిదే. అందలం ఎక్కగానే సరిపోదు దాన్ని నిలుపుకోవడం ముఖ్యం. గద్దె ఎక్కిన తరువాత పన్నులు పెంచడం మంచిది కాదు. 40 ఏళ్ల అనుభవంతో సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చెప్పి గద్దెనెక్కి సంపద సృష్టి సంగతి పక్కనపెట్టి పన్నులు పెంచడం ప్రజలను మోసం చేయడం కాదా అని సామాన్య ప్రజలు అడుగుతున్నారు. నిబంధనల ప్రకారం 17 మంది శాసన సభ్యులుంటే ప్రతిపక్ష హోదా ఇస్తారు. కాని 17 మంది శాసన సభ్యులు సాధించిన ఓట్ల కంటే అధికంగా 40 శాతం ఓట్లు సాధించినా హోదా దక్కక పోవడం నైతికంగా తప్పు కావచ్చు. 40 శాతం ఓట్లు వేసిన వారిని పరిగణనలోకి చట్టం అనుమతించకపోయినా ప్రజలకు మంచి చేసే మంచి ప్రభుత్వం తమదని చెప్పుకునే కూటమి ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వవచ్చు. ప్రజలందరికి మంచి చేస్తున్నప్పుడు ప్రతిపక్ష నేతకు విమర్శించడానికి విషయం ఉండదు కదా అని ప్రభుత్వంలో ఉన్నవారు ఆలోచించాలి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి ప్రభుత్వానికి ఎదురు దెబ్బతగలడం ప్రజల తీర్పుగా భావించాలి. మంచి ప్రభుత్వమని ప్రజలు చెప్పాలి కాని అధికారంలో ఉన్నవారు కాదు. ఏదిఏమైనా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ముఖ్యం కనుక ఎక్కువ శాతం ప్రజల కొరకు రూపొందిన రాజ్యాంగాన్ని ప్రజల కోసం కొన్ని సవరణలు చేయడం అవసరంగా రాజ్యాంగ నిపుణులు భావించాలి.
సెల్‌: 9885569394

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు