వామపక్షాల నిరసనలో కూనంనేని డిమాండ్
విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం : కేంద్ర బడ్జెట్ సామాన్యులకు ఏ మాత్రం మేలు చేసేదిగా లేదని, వామపక్షాలు చేసిన ప్రతిపాదనల ప్రకారం ప్రత్యామ్నాయ ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తే ఊరుకునేది లేదన్నారు. కేంద్ర బడ్జెట్ ఉపసంహరణకు డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు అనుకూలంగా, పేదలకు, రైతులకు, కార్మికులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా వామపక్షాల అధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కూనంనేని పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) అధ్వర్యంలో బస్టాండు సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన జరిగింది. కూనంనేని మాట్లాడుతూ రైతులకు, కార్మికులకు వ్యతిరేకమైన బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టిందని అన్నారు. విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసేలా బడ్జెట్ ఉందని, వెనుకబడిన వర్గాలను, పేదలను విస్మరించిందన్నారు. పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడి దారులకు రాయితీలు కల్పిస్తూ సామాన్యులపై పన్నులభారం మోపుతున్నారని కేంద్రం తీరును ఆక్షేపించారు. దేశంలోని 200 మంది కుబేరులపై నాలుగు శాతం సంపాద పన్ను పెంచాలని కూనంనేని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలని, బీమా రంగంలో ఎఫ్‌డీఐని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రవేటీకరణకు స్వస్తి పలకాలన్నారు. ఉపాధి హామీ పథకానికి 50శాతం నిధులు పెంచాలని, అలాగే రాష్ట్రాలకు నిధులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు రద్దు చేయాలని, కార్మికులు, పేదలు, వ్యవసాయం, విద్య, వైద్యం వంటి రంగాలకు కేటాయింపులు పెంచాలన్నారు. సత్వరమే స్పందించి తగు చర్యలను కేంద్రం తీసుకోని పక్షంలో తమ ఉద్యమాలను ఉధృతం చేస్తామని కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు సాబీర్ పాషా, వెంకటేశ్వరరావు, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు గౌని నాగేశ్వర్రావు, న్యూ డిమోక్రసీ (చంద్రన్న) నాయకుడు కందగట్ల సురేందర్, సీపీఐ ఎంఎల్ నాయకుడు పి సతీశ్ ప్రసంగించారు. కార్యక్రమంలో నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, రత్నకుమారి, ఫహీమ్, లిక్కి బాలరాజు, బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్, భూక్యా రమేశ్, వీరన్న, కందుకూరి, నందిపాటి రమేశ్, అభిమన్యు, నాగకృష్ణ, లక్ష్మి, జె సీతారామయ్య, ఉమ, అలీముద్దీన్, రాజశేఖర్, నక్కా లావణ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు.