పహల్గాంలో తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన తరవాత రెండు వారాలకు గానీ భారత ప్రభుత్వం నిర్ణాయక చర్య ఏదీ తీసుకోలేదు. కానీ మూడు రోజుల దాడిలోనే పాకిస్థాన్ లోని తొమ్మిది తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి తీవ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పదో తేదీన కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. అయినా పాకిస్థాన్ కవ్వింపు చర్యలు మానుకోలేదు. కాల్పుల విరమణ పదో తేదీన జరిగితే సోమవారం (12 వ తేదీన) ప్రధానమంత్రి మోదీ జాతి జనులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి ప్రసంగంలో మూడు నాలుగు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి: తీవ్రవాదులు దాడికి దిగితే మొహం పగిలేలా జవాబిస్తాం. రెండు: తమ దగ్గర అణ్వస్త్రాలున్నాయని బెదిరించి తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించం. మూడు: తీవ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని సమర్థించే ప్రభుత్వాలను విడివిడిగా చూడబోం. తీవ్రవాదం, సంప్రదింపులు ఏక కాలంలో జరగవని మోదీ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్థాన్ తో చర్చలంటే తీవ్రవాదంపైనే, ఆక్రమిత కశ్మీర్ పైనే అని మోదీ సందిగ్ధతకు తావు లేకుండా చెప్పారు. అణ్వాయుధాలను అడ్డం పెట్టుకుని ఆగడాలకు పాల్పడితే సహించేది లేదని కూడా చెప్పారు. అణ్వస్త్ర బూచిని చూపితే ఊరుకునేది లేదని తెలియజేశారు. మోదీ ప్రసంగం అంతా సంవేదనా పూరితంగానే సాగింది. పహల్గాం దాడి వ్యక్తిగతంగా తనకు బాధ కలిగించిందని చాలా ఆవేదనా భరిత స్వరంతో చెప్పారు. భారత తల్లుల, ఆడపడుచుల సిందూరం చెరిపేస్తే ఎలాంటి ఫలితం అనుభవించవలసి వస్తుందో పాకిస్థాన్‌కు అనుభవ పూర్వకంగా తెలిసి వచ్చిందని మోదీ అన్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి బదులు దాడులకు దిగిందని తీవ్ర స్వరంతో ఆక్షేపించారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో దాడి చేస్తే భారత్ ఆ దేశం గుండెల మీద దాడి చేస్తుందని హెచ్చరించారు. భవిష్యత్తులోనూ తీవ్రవాదంపై ఎలా స్పందిస్తుందో అన్న గీటు రాయి ఆధారంగానే ఆ దేశంతో వ్యవహారం ఉంటుందని తెలియజేశారు. ఆపరేషన్ సిందూరు ను నిలిపి వేశాం తప్ప ముగింపు పలక లేదని కూడా మోదీ అన్నారు. ఇప్పటివరకు చేసిన ప్రతి దాడిలో మట్టికరిచింది పాకిస్థానే అన్నారు. తీవ్రవాద దాడి జరిగిన దాదాపు మూడు వారాలకు, పాకిస్థాన్ మీద దాడి మొదలైన అయిదు రోజులకు, కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన మూడో రోజైనా ప్రధానమంత్రి దేశవాసులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారంటే అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయనుకోవడం సహజం. కానీ షరా మామూలుగా తమ ప్రభుత్వ ఘనతను, తన ఘనతను చాటుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించారు. భారత్ దాడిలో ఘోరంగా దెబ్బ తిన్న పాకిస్థాన్ అమెరికాకు కాల్పుల విరమణ జరిగేట్టు చూడాలని మొరపెట్టుకుందని నిందించారు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించినట్టుగానే భారత్ కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించవలసి వచ్చిందో మోదీ చెప్పనే లేదు. పాకిస్థాన్ లొంగి పోయిందని కూడా మోదీ ప్రకటించారు. కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏమిటో మోదీ చెప్పలేదు కానీ ట్రంప్ పాత్రను ఖండిరచనూ లేదు. ఇప్పటి దాకా కశ్మీర్ సమస్య ద్వైపాక్షికమైందని భారత్ చెప్తూ వస్తోంది. మూడో వ్యక్తి లేదా, దేశం జోక్యం సహించలేదని భారత్ అంటోంది. సిమ్లా ఒప్పందంలో కశ్మీర్ సమస్య ద్వైపాక్షికమైందని, మరెవరి జోక్యం అంగీకరించబోమని మొదటి నుంచి భారత్ స్పష్టం చేస్తూనే ఉంది. సింలా ఒప్పందం సారాంశం ఇదే. కానీ భారత్-పాకిస్థాన్ ఘర్షణ ద్వైపాక్షికమైందన్నది భారత్ అసందిగ్ధ వైఖరి అయితే అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకోవడంపై మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పహల్గాం లో భద్రత కల్పించకపోవడంలో లోపం జరిగిందని మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో అంగీకరించింది. ఈ లోపానికి మోదీ ఎక్కడా బాధ్యత తీసుకున్నట్టు ఈ ప్రసంగంలో కనిపించలేదు.
గత మంగళ బుధవారాల మధ్య అర్థరాత్రి పహల్గాం దాడులకు ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్ లోని తీవ్రవాద స్థావారాలపై దాడులు చేసిన తరవాత శనివారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత-పాకిస్థాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పడం విడ్డూరంగా ఉంది. భారత్- పాక్ దేశాల మధ్య వైరాన్ని పరిష్కరించడంలో మూడవ పక్షం జోక్యం ఉండకూడదని 1971లో సిమ్లా ఒప్పందంలో అంగీకారం కుదిరింది. అలాంటప్పుడు భారత,పాకిస్థాన్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో సంప్రదించే అధికారం ట్రంప్ కు ఎవరిచ్చినట్టు? కశ్మీర్ సమస్యకు పరిష్కారం కుదర్చగలను అని చెప్పే సాహసం ట్రంప్ ఎలా చేయగలిగారో అంతు పట్టదు. కానీ ఈ విషయమై భారత్ నుంచి ఎలాంటి వివరణా లేకపోవడం మరింత ఆశ్చర్యకరం. ఈ అంశంపై జాతి జనులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావనా లేకపోవడం అంటే మూడో పక్షం జోక్యాన్ని మోదీ ప్రభుత్వం అంగీకరిస్తోందనుకోవాలేమో.
ట్రంప్ ఆ విషయం ఎలా ప్రస్తావించగలిగారు. ఎవరి అనుమతీ లేకుండానే ట్రంప్ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని చెప్పారా లేదా రెండు దేశాలు లేదా ఈ రెండిరటిలో ఒక దేశం ట్రంప్ జోక్యం కోరాయా అన్నది ఇప్పటికీ తేలని విషయంగానే మిగిలిపోయింది. సోమవారం రాత్రి దాకా భారత ప్రభుత్వం ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ట్రంప్ ప్రకటన తరవాత పాకిస్థాన్ చాలా ఉల్లాసంగా ఉంది. దీని భావం ఏమై ఉంటుందో! కార్గిల్ యుద్ధానికి ముందు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయితో పాకిస్థాన్ ప్రధానమంత్రి అమెరికాలోనే ఉన్నారు, మీరు కూడా వస్తే సమస్యను పరిష్కరించవచ్చు అన్నారు. దీనికి వాజ్‌పేయి దీటైన సమాధానం ఇచ్చారు. భారత్‌కు చెందిన ఒక్క అంగుళం భూమైనా పాక్ అధీనంలో ఉన్నంత కాలం ఈ విషయంపై మాట్లాడే ప్రసక్తి లేదు అని వాజ్‌పేయి ఖండితంగా చెప్పారు. తీవ్రవాదం, సంప్రదింపులు ఏక కాలంలో కుదరవు అని మోదీ కూడా చెప్తూనే ఉన్నారు. పైగా తీవ్రవాదులను మట్టి కరిపిస్తామని, వారిని ప్రోత్సహించే వారినీ వదలబోమని, తీవ్రవాదాన్ని భూమండలం అంచుల దాకా తరిమేస్తాం అని కూడా మోదీ అంటూనే ఉన్నారు. అలాంటప్పుడు ట్రంప్ ఎందుకు, ఎలా జోక్యం చేసుకోగలిగారు అన్నది ఇప్పటిదాకా సమాధానం లేని ప్రశ్న. తీవ్రవాదం గురించి ట్రంప్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తీవ్రవాదం అంతమైందని మోదీ కూడా చెప్పలేదు. కాల్పుల విరమణ ప్రకటించిన తరవాత తలెత్తిన ఏ ప్రశ్నకూ సమాధానం రావడం మోదీ ప్రసంగంలో సమాధానం లేదు. అంటే ఏమైనా దాచి పెట్టే ప్రయత్నం జరుగుతోందా లేక ట్రంప్ తో రహస్య అంగీకారం ఏదైనా కుదిరిందనుకోవాలా? కశ్మీర్ విషయంలో ట్రంప్ కు పంచాయితీ చెప్పే అధికారం ఎవరిచ్చి ఉంటారో! ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడైన తరవాత కశ్మీరి వివాదం పరిష్కరించడానికి విపరీతమైన ఆత్రుత ప్రదర్శించారు. కానీ అప్పుడు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది. కశ్మీర్ వ్యవహారాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించినందుకు నెహ్రూని అనునిత్యం తప్పు పట్టే వారు ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు. లేదా మన విదేశాంగ నీతిని తిరగతోడారా? మూడు రోజుల దాడిలోనే పాకిస్థాన్ మెడలు వంచగలిగినప్పుడు అమెరికా మధ్యవర్తిత్వం అవసరం ఏమొచ్చిందని! మిగిలిన కారణమల్లా ట్రంప్ ఒత్తిడికి మోదీ ప్రభుత్వం లొంగి పోవడమే అనుకోవాలి.