Wednesday, April 9, 2025
Homeవిశ్లేషణఫన్‌చాంగం

ఫన్‌చాంగం

చింతపట్ల సుదర్శన్‌
గుళ్లో ఎవరో మైకులో ఏదో చెబుతున్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు మైకులు బద్దలు కొట్టడం విన్నది చాలాసార్లు కానీ ఇప్పుడు వినవస్తున్నదంతా మరో రకంగానూ, ఇంకో రకంగానూ వినిపిస్తుండటంతో గుడి ఎదురుగ్గా ఓ మూల నిలబడి చెవులు రిక్కించి వినసాగింది డాంకీ.
మనుషులు మెసిలే చోట డాంకీలు డాగీలు ఉండటానికి లేదు కదా. ఈ లోకం వాళ్ల తాతగారి సొత్తాయె మరి. ఉన్నట్టుండి ఎక్కడ్నించో ఓ పలుగు రాయి వచ్చి వీపు మీద విమానం మోత మోగించింది. విషయమేమిటో వినాలని ఆసక్తిగా ఉంది కానీ ఒక రాయి తర్వాత మరొక రాయి వచ్చి తగలకపోదు శీఘ్ర బుద్ధే పలాయనః అనుకుని అక్కడ్నించి కదిలింది డాంకీ. గాడిదలకీ, కుక్కలకీ కూడా పంచాంగ శ్రవణం కావల్సి వచ్చిందా అన్న అరుపు వినిపించింది. పంచాంగం మనుషులకే కాని గాడిదలకు అక్కర్లేదన్న మాట మరి గాడిదల్లాంటి మనుషులకూ అవసరమా అని విసుక్కుంటూ, చిరాకు పడుతూ తన ‘రెసిడెన్స్‌’ వైపు అడుగులు వడివడిగా వేసింది డాంకీ. అప్పటికే అరుగు మీద కూచుని ముందు కాళ్ల మీద మూతి ఆనించి ఉన్నది డాగీ. ఆ పక్కనే బండరాయి మీద కూచుని ఉన్నాడు అబ్బాయి.
అరుగు ఎక్కిన గాడిదని పలకరించింది డాగీ. ఏంటి బ్రో హడావిడిగా వస్తున్నావు. ఎవరైనా చేజ్‌ చేస్తున్నారా అంది. నా వెనక ఎవడైనా వస్తే ‘బ్యాక్‌ లెగ్‌ త్రో’ తో మక్కెలిరగ్గొట్టనూ. ఎవడూ లేడు. గుడి దగ్గర పంతులు గారు మైక్‌లో ఏదో చెప్తుంటే విందామనుకున్నా కానీ ఎదవ రాయి పుచ్చుకు కొట్టాడు. పైగా పంచాంగ శ్రవణానికి గాడిదలు పనికి రావట, పంచాంగాల మీద మనుషులకే ‘పేటెంట్‌ హక్కులు’ ఉన్నాయట అంటూ రుసరుసలాడిరది డాంకీ. అయ్యిందీ నీకూ అయ్యిందీ. నేనూ బుద్ధి గడ్డి తిని చెవులు ముఖం మీద నిలబెట్టి విందామనుకున్నా. గ్రహాలూ, ఇళ్లూ, ఆదాయమూ, వ్యయమూ ఇలాగ ఏవో వినపడ్డయి. కానీ ఓ లుచ్చా బచ్చా నా కొడుకొకడు రాయి విసిరేసి పారిపోయేడు. ఈ యవ్వారం మనకు సంబంధించింది కాదులే అనుకుని వచ్చేశాను అంది డాగీ.
అసలీ పంచాంగం ఏమిటి తంబీ. జనం అంతా మైకు ముందు గుంపులుగా కూచుని వింటున్న దేమిటి అనడిగింది డాంకీ. ఇవాళ ఉగాది కదా. ఉగాది అంటే కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుందన్న మాట. ఈ సందర్భంగా పై లోకాల్లో ఉండే గ్రహాలు కొన్ని ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకీ మారతాయన్నమాట అన్నాడబ్బాయి. అవునా ఆ గ్రహాలేంటో ఎక్కడుంటాయో నాకైతే తెలీదుగానీ ఒకవేళ అవి ఉంటే గింటే, వాటిష్ట ప్రకారం ఇళ్లు మారితే, మారనీ వీళ్లకేవిటంట అంది డాగీ. అసలు పాయింటుకి వస్తా. పైన ఎక్కడో ఉండే గ్రహాల కదలికల కారణంగా ఇక్కడ ఈ భూమ్మీద ఉండే మనుషుల తలరాతలు మారుతాయట. ఆ గ్రహాలు మనుషుల్లో కొందరి పట్ల ప్రేమ, మరికొందరి పట్ల కోపం చూపుతాయంట. గ్రహాలు అనుకూలంగా ఉంటే మనుషులు రాజకీయ నాయకులు, మంత్రులు, సినిమా హీరోలు, గొప్ప క్రీడాకారులూ కావచ్చు అన్నాడబ్బాయి.
ఓహో గ్రహాలు అనుగ్రహిస్తే అధికార పార్టీ వారు ‘సేఫ్‌’ అన్న మాట. అదే కోప్పడితే మాత్రం ప్రతిపక్షంలో కూర్చోవాలన్న మాట. మరి ప్రజల మాటేమిటి, ఓట్ల సంగతేమిటి? అన్నీ గ్రహాలే చూసుకుంటే ఇంక ఈ మనుషులెందుకు, వాళ్ల పెత్తనాలెందుకు అంది డాగీ. బాగా అన్నావోయి. మనుషులు చేసే ఏ పనికయినా గ్రహాలే కారణమయితే నేరాలు, జైళ్లూ, బెయిళ్లూ అవసరమా అని పళ్లికిలించింది డాంకీ.
అది సరేగానీ అబ్బాయి గుడి దగ్గర విందామంటే వీలు పడలేదు. ఈసారి ఏ పార్టీ తలరాత ఎలా ఉందో చెప్పే ఉంటారు కదా. కాస్త మాకూ వివరించరాదూ అంది డాగీ. ఏ పార్టీకి ఆ పార్టీ పంచాంగం ‘వేరేగా’ తయారు చేశార్లే. ఓ పార్టీ వాళ్ల పంచాంగం ఆ పార్టీ మరో ముప్ఫయి యేళ్లు రాజ్యం చేస్తుందన్నది. ఓ పార్టీ పంచాంగం అధికార పార్టీ కుప్ప కూలుతుందని ఏడాది తిరక్కుండా ఎన్నికలు వస్తాయని అన్నది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు గ్రహాలని అటూఇటూ తిప్పి అంతా తమకే మేలని చెప్పిస్తున్నారు అన్నాడు అబ్బాయి.
మనుషులంతా గ్రహాలకు భయపడతారేమో కాని అవి మా జోలికి రావు. వాటికి పరిహారాలు చేసి మంచి చేసుకునే అవసరమూ మాకు లేదు అంది డాంకీ. ఈసారి నీ గ్రహాలు ఏమంటున్నాయి బ్రో జాబ్‌ గ్యారంటీ అంటున్నాయా? అంది డాగీ. ఆదాయం రెండు వ్యయం పద్నాలుగన్నాడు నాకు పంతులు. ఇంకేం ఉద్యోగం? ఏలిన నాటి శని గుర్రుమంటున్నాడంట. అపాయింట్‌మెంటు ఆర్డరు కళ్ల చూసే యోగం ఇప్పట్లో లేనట్టే అన్నాడు అబ్బాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు