ఎండీ నిర్లక్ష్యంపై చైర్మన్ జీవీ రెడ్డి మండిపాటు
ముగ్గురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్లు వెల్లడి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీ ఫైబర్ నెట్‌లో చైర్మన్ జీవీ రెడ్డి, ఎండీ దినేశ్ రెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఫైబర్ నెట్‌లో నెలకొన్న పరిస్థితులపై చైర్మన్ జీవీ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఫైబర్ నెట్‌లో నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. తన ఆదేశాలను అధికారులు పాటించడం లేదని చైర్మన్ విమర్శించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఎనిమిది నెలల్లో అన్ని శాఖల్లో పురోగతి ఉండగా… అసలు పురోగతి లేని సంస్థగా ఏపీ ఫైబర్ నెట్ ఉందని ఆయన అన్నారు. గతంతో పోల్చితే ఒక్క రూపాయి కూడా అదనపు ఆదాయం రాలేదన్నారు. ఈ ఎనిమిది నెలల్లో ఒక్క కనెక్షన్ కూడా కొత్తగా ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రంలో 78 వేల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ ఉండగా… ప్రతిరోజూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉందని, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందన్నారు. ఎండీ దినేశ్ కుమార్ సమీక్షలు చేసి నెట్‌వర్క్‌ను పెంచే ప్రయత్నం చేయలేదన్నారు. గత ఏడాది డిసెంబర్ 24న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 410 మంది ఉద్యోగులను తొలగించాలని చైర్మన్‌గా తాను ఆదేశించినా ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. ఫైబర్ నెట్ రికార్డులు పరిశీలించేందుకు అధికారులు సహకరించడం లేదన్నారు. ఎండీకి శ్రద్ధ లేకపోతే కనెక్షన్లు ఎలా పెరుగుతాయని చైర్మన్ ప్రశ్నించారు. గత మేనేజ్‌మెంట్‌తో కలిసి కుట్ర చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. విధుల్లో అలసత్వం వహించవద్దని, ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నారని, ఇక్కడ మాత్రం అసలు మొదలే పెట్టలేదని అన్నారు. ఎండీగా దినేశ్ కుమార్ ఉన్నప్పటికీ ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ బిజినెస్‌ను ఒక్క అడుగుకూడా ముందుకు వెళ్లకుండా ముగ్గురు వ్యక్తులు అడ్డుపడుతు న్నారని ఆరోపించారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సత్యరామ్ భరద్వాజ్, బిజినెస్ అడ్వైజర్ సురేశ్, ప్రొక్యూర్‌మెంట్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్‌లను వెంటనే తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ ముగ్గురు ఏం చేసినా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయని జీవీ రెడ్డి హెచ్చరించారు. తాను సిఫార్సు చేసిన ఉద్యోగులను తొల గించకపోవడంతో పనీపాట లేకుండా వారికి కోటిన్నర జీతాలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. వారిని తొలగించడానికి ఎండీ ఎందుకు భయపడుతున్నారని జీవీ రెడ్డి ప్రశ్నించారు. వ్యూహం సినిమా విషయంలో నోటీసు ఇస్తే నేటికీ సమా ధానం లేదన్నారు. ఏనుగులా ఉండే ఏపీ ఫైబర్ నెట్‌ను పీనుగులా చేశారని ఆయన మండిపడ్డారు. చివరకు అధికారులు శవాలపై పేలాలు ఏరుకోవాలని చూస్తున్నా రని విమర్శించారు. 2 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సామర్ధ్యం ఈ సంస్థకు ఉందన్నారు. కేబుల్ ఆపరేటర్‌లు కొత్త కనెక్షన్‌లకు అనుమతి ఇవ్వమని అడిగితే… వారిని కనీసం లోపలికి కూడా పిలవడం లేదన్నారు. ఈ సంస్థ దివాలా అంచున ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.