చైనా రాయబార కార్యాలయం హెచ్చరిక
ఢాకా: మోసపూరిత క్రాస్ బోర్డర్ డేటింగ్ వీడియోలు, సమాచారం, అనధికారిక మ్యాట్రిమోనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం తమ పౌరులను హెచ్చరించింది. బంగ్లా యువతులతో అక్రమ వివాహాలు వద్దని, అక్కడ వివాహాలు చేసుకొనే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించింది. చైనాలో కొన్నేళ్లుగా వివాహాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పెళ్లి చేసుకోవడానికి ఆ దేశంలో యువతుల కొరత ఏర్పడటంతో దానిని అధిగమించడానికి అక్రమమార్గంలో వివాహాలు చేసుకుంటున్నట్లు గుర్తించిన నేపథ్యంలో కీలక చర్యలు చేపట్టినట్లు ఆ దేశ మీడియా కథనాలు వెల్లడిరచాయి. వివాహాల కోసం బంగ్లా యువతులను చైనాకు అక్రమరవాణా చేస్తున్నారని ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. చట్ట విరుద్ధంగా ఈ పెళ్లిళ్ల తంతు నడుస్తోందని, ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులకు దారితీయొచ్చని బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం తన అడ్వైజరీలో పేర్కొంది. సరిహద్దు ఆవల లైంగిక సంబంధాలు, వివాహాల బాధితులు వెంటనే పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీకి ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ తరహా పెళ్లిళ్లు చేసుకుంటే.. మానవ అక్రమరవాణా కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. బంగ్లా చట్టాల ప్రకారం.. మానవ అక్రమరవాణాకు పాల్పడి, దోషిగా తేలితే ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి యావజ్జీవ, మరణశిక్షలు కూడా ఉండొచ్చు.