Tuesday, March 4, 2025
Homeతెలంగాణబకాయి వెంటనే చెల్లించండి

బకాయి వెంటనే చెల్లించండి

. సీఎంఆర్‌ సరఫరా సమయం పెంచండి
. సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతులు పునరుద్ధరించండి
. ప్రహ్లాద్‌ జోషికి రేవంత్‌, ఉత్తమ్‌ వినతి

విశాలాంధ్ర-హైదరాబాద్‌ : భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 ఖరీఫ్‌లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. రేవంత్‌ వెంట మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నారు. నాడు అదనపు లెవీ సేకరణకు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని, బకాయిలు పెట్టి 10 ఏళ్లు అయిందని గుర్తుచేశారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద 2021, మే నుంచి 2022, మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్‌లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులు ధ్రువీకరించుకొని…బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల చేయాలని రేవంత్‌ కోరారు. 2021, జూన్‌ నుంచి 2022, ఏప్రిల్‌ వరకు నాన్‌ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ (నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ యాక్ట్‌) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయి మొత్తం రూ.79.09 కోట్లుగా తెలిపారు. సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) గడువును నెల రోజులు కాకుండా నాలుగు నెలలకు పొడిగించాలని… అప్పుడు సరఫరాలో ఇబ్బందులు రావని వివరిం చారు. అలాగే రాష్ట్రానికి పీఎం కుసుమ్‌ కింద గతంలో ఇచ్చిన నాలుగు వేల మెగా వాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తికి అనుమతులను పునరుద్ధరించాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తొలుతు నాలుగు వేల మెగావాట్లకు అనుమతులు ఇచ్చి ఆపై దానిని వెయ్యి మెగావాట్లకు కుదించిందన్నారు. మహిళా సంఘాల ద్వారా సోలార్‌ విద్యుదుత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వీరి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి మాణిక్‌రాజ్‌, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ చౌహాన్‌, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు