Monday, February 24, 2025
Homeబర్డ్‌ ఫ్లూ కలకలం

బర్డ్‌ ఫ్లూ కలకలం

. గోదావరి జిల్లాల్లో విస్తరించిన వైరస్‌
. చికెన్‌ తినొద్దని అధికారుల హెచ్చరిక
. 34 గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
. ఆందోళనలో ప్రజలు
. సంక్షోభంలో పౌల్ట్రీరంగం

విశాలాంధ్ర – రాజమండ్రిసిటీ : ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ రంగం అల్లాడిపోతుంది. బర్డ్‌ ఫ్లూ వ్యాధితో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోపక్క వైరస్‌ ప్రబలిన ప్రాంతాల్లోని ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు. గోదావరి జిల్లాల్లో సుమారు 20రోజుల వ్యవధిలో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. బాదంపూడి, రేలంగి, మొగల్లు, పెద్ద తాడేపల్లి, దువ్వ వేల్పూర్‌, తణుకు, గుమ్మనిపాడు ప్రాంతాలలో కోళ్లు ఎక్కువుగా చనిపోతున్నాయి. ఒక్కొక్క పౌల్ట్రీ ఫామ్‌ దగ్గర రోజుకు దాదాపు పదివేల కోళ్లు చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు బర్డ్‌ ఫ్లూ వైరస్‌ కారణమని అధికారికంగా తేల్చారు. దీంతో పశుసంవర్ధకశాఖ అధికారులు ఆ రెండు కోళ్ల ఫారాల్లో కోళ్లను పూడ్చిపెట్టడంతోపాటు.. కిలోమీటరు వరకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల సంఖ్యలో కోళ్ల చావులకు బర్డ్‌ఫ్లూ వైరస్‌ కారణమని భోపాల్‌ హై సెక్యూరిటీ ల్యాబరేటరీ నిర్ధారించింది. కొన్ని వారాలుగా గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలస వచ్చిన పక్షులతో వైరస్‌ విస్తరించినట్టు ఏపీ పశు సంవర్ధక శాఖ స్పష్టత ఇచ్చింది. కోళ్ల ఫారంలకు కిలోమీటరు దూరం వరకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. పరిసర ప్రాంతా ల్లో వైరస్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెడ్‌ జోన్‌లో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేవారు. కోళ్ల ఫారాల్లో పనిచే స్తున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. కోళ్లకు సంక్రమిస్తున్న వ్యాధులపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వ హిస్తున్నారు.
చికెన్‌ తినొద్దని హెచ్చరికలు
బర్డ్‌ ఫ్లూ నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రజలు కొన్ని రోజుల పాటు చికెన్‌ తినడం తగ్గించాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి.. ఒక్కో పౌల్ట్రీ ఫాంలో రోజుకు 10 వేలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు సమాచారం. పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో ఒక కిలోమీటర్‌ రెడ్‌ జోన్‌ గాను, పది కిలోమీటర్లు సర్వేలెన్స్‌ జోన్‌ గా విధించారు అధికారులు. ఈ ప్రాంతాల పరిధిలో 144, 133 సెక్షన్‌ అమలు చేయాలని పోలీస్‌ అధికారులకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. తక్షణం చేపట్ట వలసిన చర్యలపై సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్‌ ఫ్లూ వ్యాధిన పడి లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత వారం , పది రోజుల వరకు కోళ్లతో కిటకిటలాడిన కోళ్ల ఫారాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కోళ్లకు సోకుతున్న వైరస్‌తో పౌల్ట్రీ యజమానులు తలలు పట్టు కుంటున్నారు. గతంలో ఎన్నడూ చూడని రీతిలో నష్టాలు చవిచూసే పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్ని మందులు వాడినప్పటికీ వైరస్‌ నుండి తప్పించలేక పోతున్నామని యజమానులు చెబుతున్నారు. వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు విలువచేసే పందెం పుంజుల సైతం వైరస్‌ బారిన పడి మృత్యువాత పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కోళ్ల ఫారాలలో ఎనిమిది కోట్ల బ్రాయిలర్‌ కోళ్లు, ఇళ్లలో రెండు కోట్ల నాటు కోళ్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. దేశీయ కోళ్ల కంటే కోళ్ల ఫారం కోళ్లలోనే మరణాలు ఎక్కువగా ఉన్నాయి. పెరవలి మండలం కానూరులోని ఫౌల్ట్రీలో చనిపోయిన కోళ్లలో పూణే ల్యాబ్‌ నిర్ధారించింది. దీంతో కానూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోనతో ఉన్నారు. కోళ్ల నుండి వచ్చే వైరెస్‌ తమకు సోకుతుందని భయపడుతున్నారు. ఆగ్రామానికి పది కిలో మీటర్ల దూరంలోని ఇంటింటికి అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.ప్రజలు కోడి మాంసం, గుడ్లు తిన వద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆయా పరిసర ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. ఎవరికైనా బడ్‌ ప్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పశు సంవర్ధక శాఖ అధికారులు ప్రకటించారు. మరో వైపు కానూరు పౌల్ట్రీ నుంచి గత వారం రోజులుగా అనేక చోట్లకు వ్యానుల ద్వారా కోళ్లు సరఫరా అయ్యాయి. దీనిపై కూడా అధికారులు తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయా ప్రాంతాల్లో వైరెస్‌ వ్యాప్తి చెందకుండా కట్టడి చెయ్యాల్సి ఉంది. బర్డ్‌ప్లూ వ్యాధి ఇరవై రోజుల క్రితమే వచ్చిందని, కోళ్ల ఫారాల యజమానులు గోప్యంగా ఉంచారని, అందువలనే అధికారులు ప్రాధమిక స్ధాయిలో స్పందించలేక పోయారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో 34 గ్రామాల్లో ఈ వ్యాప్తి చెందిందని అధికారులు నిర్ధారించారు. ఈ గ్రామాల్లో 64 ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్‌ అధికారులను సమన్వయం చేస్తూ జిల్లా కలెక్టర్‌ చర్యలు చేపడుతున్నారు. కానూరు, నిడదవోలు, ఉండ్రాజ వరం, సీతానగరం ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో కోళ్ల ఫారాలు అధికంగా ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
కోడి మాంసం అమ్మకాలపై పర్యవేక్షణ కరువు
తూర్పు గోదావరి జిల్లాలో బడ్‌ ప్లూ వ్యాధి విజృంభిస్తున్నప్పటికీ మాంసం అమ్మకాలపై పర్యవేక్షణ కరువైంది. ఒక పక్క అధికార యంత్రాంగం కోడి మాంసం తిన వద్దని చెప్తున్నప్పటికీ విక్రయాలు మాత్రం యథేచ్ఛగా జరుగుతునే ఉన్నాయి. మాంసం దుకాణాదారులు ఎప్పటిలాగానే తమ అమ్మకాలు సాగిస్తున్నారు. రాజమండ్రి మున్సిపల్‌ కార్పోరేషన్‌లో అన్ని సెంటర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. బర్డ్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందుతుండటంతో జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ఆదేశాల మేరకు అంగన్‌ వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా నిలిపివేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు