Homeబార్‌ లైసెన్సులకు స్పందన కరువు

బార్‌ లైసెన్సులకు స్పందన కరువు

- Advertisement -

. 840లో 43 బార్లకు 4చొప్పున దరఖాస్తులు
. టెండర్ల గడువు 29 వరకు పొడిగింపు
. పాలసీలో మార్పునకు బార్‌ యజమానుల పట్టు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రంలో బార్‌ లైసెన్సుల అప్లికేషన్లకు స్పందన కొరవడటంతో టెండర్ల గడువును ప్రభుత్వం పొడిగించింది. టెండర్ల గడువును ఈ నెల 29 సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని 840 బార్లకు కొత్త పాలసీ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలపై మద్యం వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో టెండర్ల గడువు సమీపిస్తున్నా వారి నుంచి దరఖాస్తులు రాలేదు. వాస్తవానికి మంగళవారం సాయంత్రంతో దరఖాస్తు గడువు ముగిసింది. ఇప్పటి వరకు 43 బార్లకు మాత్రమే 4 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన మొత్తం 437 దరఖాస్తుల్లో 43 షాపులకు 4 చొప్పున 132 దరఖాస్తులు వచ్చాయి. మిగతా వాటి కోసం కేవలం ఒకటి, రెండు చొప్పున దరఖాస్తులు మాత్రమే రావడంతో ఎక్సైజ్‌ అధికారులు ఖంగుతిన్నారు. దీంతో తుది గడువును ప్రభుత్వం ఆగస్టు 29 వరకు పెంచింది. అయినా సరే దరఖాస్తులు పెట్టబోమని మద్యం వ్యాపారులు అంటున్నారు. పాలసీలో మార్పులు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆచరణ సాధ్యం కాని పాలసీని తీసుకొచ్చారని వ్యాపారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించడం, మందు బాబులకు అవసరమైన బ్రాండ్‌లు మద్యం షాపుల్లో లభించకపోవడం, పర్మిట్‌ రూమ్‌ సదుపాయం లేకపోవడం తదితర కారణాలతో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ల వ్యాపారం బాగానే సాగింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మద్యం షాపుల్లో ఎంఆర్‌పీ ధరలకే విక్రయిస్తుండటంతో పాటు ప్రభుత్వం పర్మిట్‌ రూమ్‌లకు అవకాశం ఇవ్వడంతో బార్‌లలో పెద్దగా వ్యాపారం జరిగే పరిస్థితి ఉండదని వ్యాపారులు భావిస్తున్నారు. అందుకే బార్‌ లైసెన్సులకు వ్యాపారుల నుంచి స్పందన కొరవడిరది. ప్రధానంగా బార్లపై మోపిన అడిషనల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ను రద్దు చేయాలని బార్ల యజమానులు కోరుతున్నారు. దీని వల్ల వైన్‌ షాప్స్‌ కంటే ఎంఆర్‌పీపై 15 శాతం అధికంగా డబ్బులు పెట్టి మద్యం కొనుగోలు చేయాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ప్రతి బార్‌ ఏర్పాటుకు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలనే నిబంధన ఎత్తివేయాలని బార్స్‌ లైసెన్స్‌ కోసం పోటీపడేవారు కోరుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం 10 శాతం లైసెన్స్‌ ఫీజు పెంపును కూడా రద్దు చేయాలని వారు కోరుతున్నారు. బార్ల యజమానుల సాధకబాధకాలను ప్రభుత్వం తెలుసుకుని నూతన బార్‌ పాలసీలో మార్పులు చేస్తేనే ప్రభుత్వం ఆశించిన విధంగా బార్‌ లైసెన్సులు పొందేందుకు వ్యాపారులు ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు