డా॥అరుణ్‌మిత్ర
బీహార్‌లో పారుతున్న గంగ అలవిగాని కాలుష్యంతో నిండి ఉందని ఆ రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడిరచింది. గంగ నీటిలో స్నానం చేయడానికి కూడ వీలుకాదని సర్వే తెలిపింది. ఎందుకంటే అత్యధికంగా చెడు బ్యాక్టీరియా ఆ నీటిలో ఉంది. బీహార్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధ్యయనం చేసి నివేదిక విడుదల చేసింది. క్రమం తప్పకుండా గంగలో కాలుష్య నియంత్రణ బోర్డు అధ్యయనం చేస్తూ ఉంటుంది. ప్రయాగ్‌రాజ్ వద్ద లక్షలాది మంది పవిత్ర స్నానాలు చేసినప్పుడు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధ్యయనం చేసి స్నానానికి కూడా అక్కడి నీరు ఉపయోగపడదని చెప్పింది. లక్షలాది మంది భక్తులు కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నప్పుడు తీవ్రంగా తొక్కిసలాట జరిగి అనేక పదుల మంది మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. పరిమితి కంటే మించి బీహార్‌లో గంగ నీరు కలుషితమైందని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడిరచింది. నీరంతా దుర్గంధ పూరితమైందని అధ్యయనంలో తేలింది. 2025 ఫిబ్రవరి 16 వ తేదీన జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటి) ఆ రాష్ట్రంలో పారే గంగ నీరు ఎక్కువగా కలుషితం అయి ఉన్నప్పటికీ అక్కడ కోట్లాది మంది పవిత్ర స్నానం చేసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతించడాన్ని తీవ్రంగా మందలించింది. కలుషిత నీటిలో స్నానాలు చేయడం వల్ల వివిధ రకాల చర్మ రోగాలు భక్తులకు వచ్చినట్టుగా వార్తలు అందాయి. అక్కడి నీటిని భక్తులు తాగేందుకు కూడా అనుమతించారని తెలుస్తోంది. అయితే యూపీ ముఖ్యమంత్రి యోగీఆదిత్యనాధ్ ప్రయాగ్‌రాజ్ వద్ద గంగ నీరు తాగేందుకు ఉపయోగపడేదేనని వాదించారు. ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌జీటీ ఇచ్చిన నివేదికను కూడా యోగీఆదిత్యనాధ్ పట్టించుకోలేదు. రాష్ట్రంలోని గంగలో అనేక ప్రాంతాలలో నీటి నాణ్యత ఏమాత్రం ప్రమాణానికి దగ్గరగా లేదని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు చేసిన అధ్యయనం తెలిపింది. 2025 జనవరి 12, 23 తేదీలలో గంగ నీటిని పరీక్షించారు. నీటిలో బయో కెమికల్ ఆక్సిజన్ స్థాయిలు ఉండవలసిన దానికంటే అధికంగా ఉన్నాయని వెల్లడయ్యింది. బయో కెమికల్ ఆక్సిజన్ మూడు మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది కలుషితమయినట్లుగా పరిగణిస్తారు. డ్రైన్లలో ఏమాత్రం శుభ్రపరచని నీటిని నేరుగా గంగలోకి వదులుతున్నందున ఆ నీరు అపారంగా కలుషితమవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో గంగ నీటిని పైపుల ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ నీరు సైతం కలుషితమైందే. ఈ నీటిని పట్టణాలు, నగరాలు ఎక్కువగా పరిశుభ్రం చేసినట్లయితే ప్రజలు వాడుకొనేందుకు ఉపయోగపడుతుంది. నది నీటిని వాడుకోరాదని శాస్త్రీయపరమైన హెచ్చరిక చేస్తున్నప్పటికీ ప్రజలు స్నానం చేయడానికి, తాగేందుకు కూడా ఉపయోగిస్తుంటారు. కుంభ్ సమయంలో ప్రజలు విశ్వాసంతో గంగ నీటిలో స్నానాలు చేశారు. దేవుడి ఆశీర్వచనాలతో తమకు ఏమీ కాదని ప్రజలు విశ్వసిస్తున్నారు. నదీ నీళ్లలో శవాలు సైతం ఉంటాయన్నది వాస్తవం. వ్యక్తిగత విశ్వాసమే ఎక్కువగా పని చేసింది. పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న జాగ్రత్త చర్యలు సక్రమంగా లేవని తీవ్ర విమర్శలు వచ్చాయి. కలుషిత నీటిని వినియోగించరాదని చట్టాలు ఉన్నప్పటికీ ఈ విషయాలను ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు.
2017 ఏప్రిల్ 12 న ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన వార్తా సమాచారం ఇలా ఉంది. యమునా నదిని ‘‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ (ఎఓఎల్)’’ ఫౌండేషన్ స్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ యమునా నదిని కలుషితం చేసినందున వంద నుంచి నూటఇరవై కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని నలుగురు సభ్యుల కమిటీ సిఫారసు చేసింది. యమున ఒడ్డున వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని ఆయన నిర్వహించారు. 2016లో దిల్లీలోని యమున ఒడ్డున ఎఓఎల్ ఆధ్వర్యంలో భారీగా ఉత్సవం జరిగింది. అప్పుడు యమునా నది అలవిగానంత కలుషితమైంది. దాన్ని బాగు చేయటం కోసమే ఈ జరిమానా చెల్లించాలని ప్రభుత్వ అధ్యయన కమిటీ సిఫారసు చేసింది. అయితే ప్రభుత్వ ఆదరణ అత్యధికంగా ఉన్నందున జరిమానా చెల్లించలేదని తెలుస్తోంది. ప్రజలను వాస్తవాల నుంచి దూరంగా కల్పితాలలో పాలకులు ఉంచుతున్నారు. ఏమాత్రం శాస్త్రీయం కాని అంశాల వైపు ప్రజలను తీసుకువెళుతున్నారు. ఉదాహరణకు కేన్సర్‌తో సహా వివిధ తీవ్రమైన వ్యాధులు గోవు మూత్రం తాగితే నయమవుతుందని ప్రచారం సాగిస్తున్నారు. గోమూత్రం తాగితే రొమ్ము కేన్సర్ కూడా నయమైందని బీజేపీ పార్లమెంటు సభ్యురాలు ప్రగ్యా ఠాకూర్ ప్రచారం చేశారు. అనేక వ్యాధులకు గోవు పేడ కూడా ఉపయోగపడుతుందని ప్రచారం సాగుతోంది. ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి త్రివేంద్రసింగ్ రావత్ 2019 జులైలో గోవు మాత్రమే ఉచ్ఛ్వాస, నిశ్వాసలు చేస్తుందని చెప్పారు. గోవు శ్వాసను ప్రజలు పీల్చినట్లయితే వారికి ఉన్న శ్వాసకోశ సమస్యలు నయమవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. గోవు ప్రాణవాయువును అందిస్తుందని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ జలంధర్‌లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సభలో మాట్లాడుతూ నూరుగురు కౌరవులు కుండల్లో జన్మించారని చెప్పారు. ఇలాంటి అశాస్త్రీయమైన అంశాలపై ప్రచారం సాగించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అంతేకాదు శాస్త్ర పరిజ్ఞానం వైపు విద్యార్థులు వెళ్లకుండా నిరోధిస్తున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014 అక్టోబరులో ముంబైలో ఒక ఆసుపత్రిని ప్రారంభించారు. అప్పుడు మాట్లాడుతూ హిందూ దేవుడు గణేశుడికి ఏనుగు తలను అమర్చారనీ, ప్రాచీన భారతంలో ప్లాస్టిక్ సర్జరీ కూడా ఉన్నదని చెప్పారు. తప్పుడు కథలను వ్యాప్తి చేయడానికి మోదీ పూనుకున్నారు. ఇప్పటికైనా శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధపడుతుందని ఆశిద్దాం.