ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎన్నికల కమిషన్ ప్రధానాధికారిగా జ్ఞానేశ్ కుమార్‌ను నియమిస్తూ సోమవారం అర్థ రాత్రి మోదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఎన్నికల కమిషన్ ప్రధానాధికారిని నియమించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం ఏర్పాటు చేయడంలోనే మోదీ ప్రభుత్వ అసలు ఉద్దేశం ఏమిటో తేలిపోయింది. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ ఎంత ప్రధానమైందో మోదీ ప్రభుత్వానికి తెలియక కాదు. అది కార్య నిర్వాహకవర్గంలో భాగం కాదనీ, మన ఎన్నికల వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి మూల కందం అని కూడా మోదీ ప్రభుత్వానికి తెలుసు. చిక్కంతా ఎక్కడంటే రాజ్యాంగ వ్యవస్థలను కూడా తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి అలవాటు పడిన మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ప్రధానాధికారిని, కమిషనర్లను నియమించడంలోనూ తమకు అనుకూలంగా ఉండేవారిని, తాము చెప్పినట్టల్లా వినేవారిని వెతికి వెతికి నియమించడం మోదీ నిరంకుశ శైలిలో భాగమే. అసత్య ప్రచారాలు, డబ్బు సంచులు గుమ్మరించడం, చిన్నా చితక ఎన్నికలలో కూడా ప్రధానమంత్రి ప్రచారం చేయడం మాత్రమే బీజేపీ గెలుపును ఖాయం చేయవనే విషయం కూడా మోదీకి తెలుసు. అందుకే ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి, మిగతా ఇద్దరు కమిషనర్లు కూడా తమ ప్రయోజనాలు పరిరక్షించే వారై ఉండాలి. రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషన్ ప్రధానాధికారిగా ఉన్నప్పుడు సరిగ్గా అదే పని చేసి స్వామి భక్తిని చాటుకున్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషనర్‌గా నియమితుడైన జ్ఞానేశ్ కుమార్ కూడా అచ్చు గుద్దినట్టు రాజీవ్ కుమార్ లాంటి వారే. ఆయన గత చరిత్ర గమనిస్తే మోదీ ఆయననే ఎందుకు ఎన్నికల కమిషన్ ప్రధానాధికారిని చేశారో అర్థం అవుతుంది. రాజీవ్ కుమార్ తరవాత ఆయనే సీనియర్ అన్న విషయం కేవలం మాటవరసకు చెప్పే మాటే. జ్ఞానేశ్ కుమార్ ఈ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడడానికి భేషుగ్గా ఉపయోగపడ్తారన్నది ఆయన గత చరిత్ర చూస్తే తెలుస్తుంది. 2018 నుంచి 2021 దాకా హోం మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రెటరీగా ఉన్నారు. 2019లో మోదీ ప్రభుత్వం అకస్మాత్తుగా జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన సమయంలో తెరవెనక కథ నడిపింది ఆయనే. అదీ మోదీ అభీష్టం మేరకే అనేది దాపరికంలేని వ్యవహారమే. జమ్మూ-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రూపొందించడంలో జ్ఞానేశ్ కుమార్ పాత్ర అత్యంత ప్రధానమైందే. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటులో కూడా జ్ఞానేశ్ కుమార్ మోదీ అనుకూల వైఖరి అనుసరించి తరించారు. అప్పుడు ఆయన ఉన్నతాధికార వర్గంలో భాగం కనక ప్రభుత్వం చెప్పిందల్లా చేశారు అని సర్దుకోవడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వానికి అడుగులొత్తవలసిన బాధ్యత ఏ ఐ.ఎ.ఎస్. అధికారికీ లేదు. ప్రభుత్వానికి సబబైన సలహా ఇవ్వడం ఐ.ఎ.ఎస్. అధికారుల విధి. వినడం వినకపోవడం ప్రభుత్వం తేల్చుకుంటుంది. సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారిగా ఆయన అందించిన ‘‘సేవల’’కు మెచ్చి ఆయనను ఎన్నికల కమిషనర్‌ను చేశారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రధానాధికారిని చేసేశారు. ఎన్నికల కమిషన్ ప్రధానాధికారిగా రాజీవ్ కుమార్ పదవీ విరమణ చేస్తారని ముందే తెలుసు. అలాంటప్పుడు ఒక్క రోజు ముందు నియామక కమిటీ సమావేశం ఏర్పాటులోనే తన మాట నెగ్గించుకోవాలన్న పట్టుదల మోదీకి ఉందని ఈ హడావుడి సమావేశం వల్ల తేలిపోయింది. జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న 11 నెలల కాలంలో రాజీవ్ కుమార్, సుక్బీర్ సింగ్ సంధూతో కలిసి లోక్‌సభ ఎన్నికలు, కేద్ర పాలిత ప్రాంతం అయిన తరవాత కశ్మీర్‌లో మొదటి శాసనసభ ఎన్నికలు, హర్యానా జార్ఖండ్, మహారాష్ట్ర, దిల్లీ శాసనసభ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వివాదాస్పదం కానిది ఒక్కటి కూడా లేదు.
జ్ఞానేశ్ కుమార్ 2029 జనవరి 26 దాకా ఎన్నికల కమిషన్ ప్రధానాధికారిగా ఉంటారు. అంటే ఆ సమయంలో 20 శాసనసభ ఎన్నికలే కాక, 2027లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు కూడా ఆయన అధీనంలోనే జరుగుతాయి. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు కూడా ఆయన అధీనంలోనే జరుగుతాయి. ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి, మిగతా ఇద్దరు కమిషనర్లను నియమించే కమిటీలో ఇంతకు ముందు ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. కానీ డి.వై.చంద్రచూడ్ ప్రధాన న్యామూర్తిగా ఉన్నప్పుడే ప్రధాన న్యాయమూర్తికి ఈ త్రిసభ్య కమిటీలో స్థానం లేకుండా చేయడానికి 2023 డిసెంబర్ లో ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్నే మోదీ సర్కారు మార్చేసింది. అంతకు ముందు 2023 మార్చిలోనే సుప్రీంకోర్టు ఈ త్రిసభ్య కమిటీలో ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండాలని చెప్పింది. ఈ ఆదేశాన్ని ఖాతరు చేయకుండా ఉండడానికే 20023 డిసెంబర్ లో ఏకంగా చట్టమే మార్చేశారు. ఆ తరవాత త్రిసభ్య కమిటీలో ప్రధాని, కేంద్ర మంత్రివర్గ సభ్యులు ఒకరు, ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ఈ గొడవంతా ఎందుకొచ్చిందంటే ఎన్నికల కమిషన్ అధికారులను నియమించేందుకు నిర్దిష్ట చట్టం ఏమీ లేదు. అప్పటిదాకా ప్రధాన న్యాయమూర్తికి కూడా స్థానం ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందుకే మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా కొత్త చట్టం తీసుకొచ్చారు. చట్టాలు చేసే హక్కు పార్లమెంటుకు ఉన్న మాట నిజమే. పార్లమెంటులో అధికార పక్షానికి మెజారిటీ ఉంటుంది కనక తమ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా శాసనాలు చేయడం మోదీ ప్రభుత్వ విధానం. ఎన్నికల కమిషన్ అధిపతులను నియమించడం స్వతంత్రమైన రీతిలో, ఎలాంటి ప్రభావానికి లోను కాకుండా అంటే ప్రభుత్వ ప్రభావం లేకుండా జరగాలన్నది సుప్రీంకోర్టు ఆదేశం సారాంశం. కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు జయ ఠాకూర్, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తదితరులు సుప్రీంకోర్టుకెక్కారు. ఈ పిటిషన్లపై గత 12వ తేదీన విచారణ జరగాల్సింది. కానీ ఆ రోజు విచారణకే రాలేదు. బుధవారానికి వాయిదా వేశారు. అందులో కూడా విచారించవలసిన కేసుల్లో ఈ పిటిషన్ 41వ స్థానంలో ఉంది. మామూలుగా అయితే బుధవారం కూడా జరిగేది కాదేమో. కానీ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ఈ పిటిషన్లను కోర్టు ప్రారంభం కాగానే విచారించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ మూర్తులు అత్యవసర అంశాల పరిశీలన ముగిసిన తరవాత విచారించ డానికి అంగీకరించారు. విచిత్రం ఏమిటంటే అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ పీఠం చెప్పిన తీర్పును లెక్క చేయకుండా మోదీ సర్కారు చట్టం తీసుకొచ్చింది. నియామక కమిటీలో ప్రధాని, మరో కేంద్ర మంత్రి ఉన్నప్పుడు మరో సభ్యుడైన ప్రతిపక్ష నాయకుడి మాటను ఎవరు పట్టించుకుంటారు గనక! మోదీ ప్రభుత్వ ఉద్దేశమే రాజ్యాంగాన్ని, సుప్రీకోర్టును పట్టించుకోకుండా సకల వ్యవస్థలు తమ గుప్పెట్లో పెట్టుకోవడమే. సుప్రీంకోర్టు మీద భారం వేసి ఎదురు చూడాల్సిందే.