Homeభారీగా ఓట్లు తొలగిస్తే ఊరుకోం

భారీగా ఓట్లు తొలగిస్తే ఊరుకోం

- Advertisement -

వెంటనే జోక్యం చేసుకుంటాం: సుప్రీం
ఎస్‌ఐఆర్‌పై ఆగస్టు 12, 13 తేదీల్లో విచారణ

న్యూదిల్లీ: బీహార్‌లో ఈసీ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా భారీగా ఓటర్లను తొలగిస్తే తాము వెంటనే జోక్యం చేసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఓటరు జాబితాల్లో ఏదైనా తప్పులను గుర్తిస్తే ఆధారాలతో సహా తమ దృష్టికి తేవాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులకు సూచించింది. బతికుండగానే చనిపోయినట్లు ప్రకటించిన 15 మందిని తమ ఎదుటకు తీసుకు రావాలని ఆదేశించింది. ఎస్‌ఐఆర్‌ వ్యవహారంలో తదుపరి విచారణను ఆగస్టు 12, 13 తేదీల్లో చేపడతామని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆగస్టు 8వ తేదీలోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని పిటిషనర్లకు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇందుకుగాను పిటిషనర్లకు, ఎన్నికల సంఘానికి నోడెల్‌ అధికారులను నియమించింది. అంతకుముందు పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, ప్రశాంత్‌ భూషణ్‌ వాదనలు వినిపించారు. ఆగస్టు 1న ప్రచురించే ఓటర్ల జాబితాలో అనేక మంది పేర్లు లేవని, త్వరలో జరగబోయే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వీరంతా ఓటు వేయలేరని అన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా 65 లక్షల మంది తమ ఎమ్యూనరేషన్‌ ఫారాలు సమర్పించలేదని ఎన్నికల సంఘం ప్రకటించిందని తెలిపారు. వీరంతా చనిపోయారు లేక శాశ్వతంగా తరలిపోయారని ఈసీ పేర్కొన్నట్లు వెల్లడిరచారు. ఓటర్ల జాబితాలో పేరు చేర్చాలంటే వీరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జస్టిస్‌ కాంత్‌ స్పందిస్తూ ‘ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ వ్యవస్థ. చట్టానికి కట్టుబడి పని చేస్తుంది. తప్పు జరిగినట్లు గుర్తిస్తే కోర్టు దృష్టికి తీసుకు రండి. మేము పరిశీలిస్తాం’ అని అన్నారు. జస్టిస్‌ బాగ్చీ మాట్లాడుతూ ‘ముసాయిదా జాబితాలో 65 లక్షల మంది ఓటర్ల పేర్లు ఉండవనే కదా మీ భయం. ఓటర్ల జాబితాను ఈసీ సరిద్దుతోంది. ఈ ప్రక్రియను మేము పర్యవేక్షిస్తున్నాం. భారీగా ఓటర్లను తొలగిస్తే తక్షణమే జోక్యం చేసుకుంటాం. బతికుండగానే ఈసీ చనిపోయినట్లు ప్రకటించిన 15 మంది మీరు తీసుకురండి’ అని అన్నారు. పిటిషనర్‌, ఆర్‌జేడీ ఎంపీ మనోజ్‌ రaా తరపున సిబల్‌ వాదనలు వినిపించారు. ఈ 65 లక్షల మంది ఎవరో ఎన్నికల సంఘానికి తెలుసు, వారి పేర్ల ముసాయిదా జాబితాలో ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు. దీనిపై జస్టిస్‌ కాంత్‌ స్పందిస్తూ ‘మీకు తప్పుగా అనిపించన అంశాలను మా దృష్టికి తీసుకురండి’ అని సూచించారు. ఎన్నికల సంఘం తరపున సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపిస్తూ ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత కూడా ఎమ్యునరేషన్‌ ఫారాలు సమర్పించవచ్చన్నారు. ఇదిలావుంటే సోమవారం జరిగిన విచారణలో ఓటర్లను తొలగించడం కాదు చేర్చించే విధంగా ఎస్‌ఐఆర్‌ ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆధార్‌, ఓటరు ఐడీలను ధ్రువీకరణ పత్రాలు పరిగణించాలని ఈసీకి తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు