రవీంద్రనాథ్ సిన్హా
దాదాపు రెండేళ్లుగా మణిపూర్‌లో అంతర్వ్యుద్ధంలాంటి పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది. 2025 ఫిబ్రవరి 13నుంచి రాష్ట్రపతి పాలన సాగుతోంది. అసెంబ్లీ సస్పెన్షన్‌లో ఉంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. రాష్ట్రంలో ఇదొక నాటకంగా తయారైందన్న విమర్శలు దండిగానే వస్తున్నాయి. దాదాపు 25రోజుల క్రితం సంఘర్షణకు ప్రధానకారణమైన మెయితీలలో ఒక వర్గం ఈ సంక్షోభానికి కారణం కేంద్ర హోం మంత్రి అమిత్ షానేనని విమర్శించింది. రాష్ట్రముఖ్యమంత్రిగా ఉన్న ఎన్ బిరేన్‌సింగ్ సంఘర్షణలకు ప్రధాన కారకుడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నంతకాలం బిరేన్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల బిరేన్‌సింగ్‌ను పదవినుంచి తొలగించి రాష్ట్రపతిపాలన విధించారు. తాజాగా ఎన్‌డీఏ పాలనలో ముఖ్యులైన 21మంది ఎమ్మెల్యేలు తిరిగి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసి అసెంబ్లీని పునరుద్ధరించాలని కోరుతూ అమిత్‌షాకు ఒక మెమొరాండాన్ని పంపించారు. బిరేన్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం శాంతి భద్రతలు, ప్రభుత్వపాలన లేకుండా పోయాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బిరేన్‌నే ముఖ్యమంత్రిగా కొనసాగించడం ఎవరికీ అర్థంకాని నాటకమే. దాదాపు రెండేళ్లుగా సంక్షోభం నెలకొన్న కాలంలో బిరేన్‌ను తొలగించి ఇతర కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకుండా కొంత పరిస్థితి సద్దుమణిగిన తర్వాత బిరేన్‌ను తొలగించడం ఆశ్చర్యమే.
వాస్తవంగా మెమోరాండంపైన ఏప్రిల్ 10వ తేదీన ఎమ్మెల్యేలంతా సంతకాలు చేశారు. ఎందుకనో ఏప్రిల్ 29నగాని ఆ మెమొరాండాన్ని కేంద్ర హోంశాఖకు అందినట్లుగా ఆ శాఖ ధృవీకరించింది. ఇటీవల తిరిగి అప్పుడ ప్పుడూ అనేక సార్లు హింసాత్మకమైన ఘర్షణలు జరిగాయి. రాష్ట్రపతిపాలన విధించడాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తూ అనేక పౌరసమాజ సంఘాలు విమర్శిం చాయి. అంతేకాకుండా ఈ సంఘాలన్నీ సమావేశాలను నిర్వహించి ప్రజలను సమీకరించాయి. పాలకపార్టీనే ఈ ఘర్షణలన్నింటికీ మూలమని దుయ్యబట్టాయి. పాలకపార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రభుత్వం కొనసాగకుండా రాష్ట్రపతిపాలనకు అనుకూలించాయని ఈ సంఘాలు విమర్శిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర పాలకులు అసెంబ్లీని పునరుద్ధరించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. పాలకపార్టీ ఎమ్మెల్యేల పని విధానం ఒక రాజకీయ నాటకం అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు ఐదుగురు ఉన్నారు. 2022కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అప్పుడు కాంగ్రెస్ బిరేన్‌ను ఓడిరచింది. దాంతో బిరేన్ బీజేపీలో చేరారు. ౖ మణిపూర్‌ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. మేఘచంద్ర సింగ్ ఈ పరిస్థితులను గవర్నర్ అజయ్ భల్లా దృష్టికి పాలకపార్టీ ఎంఎల్‌ఏలు తీసుకెళ్లకుండా ఉండటం తీవ్ర తప్పిదమని విమర్శించారు. గవర్నర్‌ను పట్టించుకోకుండా అమిత్‌షాను సంప్రదించడం తమ కార్యాచరణ సక్రమంగా లేదని చెప్పేందుకు అవకాశం కలిగింద న్నారు. మెమోరాండంపైన బిరేన్ సంతకం చేయలేదు. ఆయనే కాదు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోల్‌బండ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బిరేన్ అల్లుడు రాజ్‌కుమార్ ఇంపోసింగ్ కూడా సంతకం చేయలేదు. ఇంపోసింగ్‌కు కూడా రాజకీయ పలుకుబడి ఉంది. ప్రస్తుతం బిరేన్‌కు, అమిత్‌షాకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని వెల్లడైంది. సంబంధాలు సక్రమంగా ఉండి ఉంటే బీజేపీ కేంద్ర నాయకత్వం బిరేన్‌ను రాజ్యసభకు ఎంపిక చేసి ఉండేదని చెపుతున్నారు. మణిపూర్‌లో బీజేపీ ఇన్‌చార్జిగా ఉన్న సంబిత్ పాత్ర మంత్రివర్గంలో బిరేన్‌ను సభ్యుడిగా తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినప్పటికీ, ఆ ప్రయత్నం విఫలమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే లోకేశ్వర్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఇదంతా ఒక నాటకమేనని విమర్శించారు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడిని ఎన్నుకునే విషయంలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన విభజన ఉన్నదని అందువల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి అంకితభావంతో అమిత్‌కు పంపిన మెమోరాండంపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలు పనిచేయడంలేదని కాంగ్రెస్ నాయకుడు మేఘచంద్ర విమర్శించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్థానిక ఎమ్మెల్యేలు గవర్నర్‌ను పట్టించుకోకపోవడం సరైందికాదని, వాస్తవంగా వీరు చిత్తశుద్ధితో పనిచేయడంలేదని విమర్శించారు. ఇప్పటికీ 60వేలమందికిపైగా సహాయశిబిరాల్లో అత్యంత దారుణ పరిస్థితుల్లో నివసిస్తున్నారంటే బీజేపీ నాయకత్వం చిత్తశుద్ధితో పనిచేయడంలేదని నిరూపితమవుతోందని మేధచంద్ర విమర్శించారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా జనం ఇంకా తిరగడంలేదని అన్నారు. మెమొరాండంపై సంతకాలు చేసినవారిలో నేషనల్ పీపుల్స్ పార్టీ కెన్‌రాడ్ సంగ్మా నాయకత్వంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు 2024 నవంబరు 17వ తేదీన ఆనాటి బిరేన్ మంత్రివర్గంనుంచి వైదొలిగారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘర్షణలు ఇతర వ్యవహారాలు సక్రమంగా లేవని వారు ముగ్గురు మంత్రివర్గంనుంచి వైదొలిగారు.
ఇప్పటికిప్పుడే మంత్రివర్గం ఏర్పాటు జరిగే పరిస్థితిలేదని అందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు మణిపూర్‌కు చెందిన లెషింబ సంజోబ అంచనా వేస్తున్నారు. బహుశా రానున్న రెండునెలలకాలంలో మంత్రివర్గం ఏర్పాటు జరగవచ్చునని సంజోబ మే 11వ తేదీ ఆదివారం బహిరంగ ప్రకటన చేశారు. మణిపూర్‌కు చెందిన సంజోబ మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని అన్నారు. తాజా పరిణామం ఒకటి జరిగింది. మణిపూర్‌కు చెందిన మిందర్ పాత్ర మే 5వ తేదీన ఆ రాష్ట్రంలో పర్యటించి పాలక పార్టీకి చెందిన ఘర్షణపడే రెండు వర్గాలను కలుసుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది.