Saturday, February 22, 2025
Homeమన్యంలోరంగురాళ్ల దోపిడీ

మన్యంలోరంగురాళ్ల దోపిడీ

క్వారీలలో తవ్వకాలకు సూత్రధారులెవరు?
అక్రమార్కులకు అండ… కూలీలపై కేసులు

విశాలాంధ్ర`చింతపల్లి (అల్లూరి జిల్లా) : మన్యంలో రంగురాళ్ల దోపిడీ యదేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కులు ముఠాలను ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాల్లో ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే… అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలోని చింతపల్లి, గూడెం కొత్త వీధి మండలాల పరిధిలో సిగినాపల్లి, గుర్రాలగొంది తదితర గ్రామాల సమీప కొండలపై సహజ సిద్ధంగా నిక్షిప్తమై ఉన్న రంగు రాళ్ల క్వారీలు ఉన్నాయి. కొంతమంది ఉన్నతాధికారుల సహకారంతో దిగ్గజ వ్యాపారి మైదాన ప్రాంతం నుంచి కూలీలను తీసుకువచ్చి సుమారు నెల రోజులుగా కోట్లాది రూపాయల విలువ చేసే ఈ రంగురాళ్ల క్వారీలలో అక్రమ తవ్వకాలు చేపడుతున్నట్లు సమాచారం. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న కాకినాడ జిల్లాకు చెందిన 10 మంది ముఠాను ఈనెల 16న అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ముఠాపై ఇప్పటికీ అటవీ శాఖ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ 10 మంది ముఠాగా ఏర్పడి రంగు రాళ్ల క్వారీ అటవీ ప్రాంతంలో పాక ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటూ యదేచ్ఛగా తవ్వకాలు నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. దీనిని నియంత్రించవలసిన సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. నెల రోజులకు పైగా రంగురాళ్ల తవ్వకాలు నిర్వహిస్తున్నా అధికారుల దృష్టికి రాలేదా అని స్థానిక గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. మన్య ప్రాంతానికి సంబంధం లేని వారిని కూలీలుగా ధైర్యంగా ఇక్కడికి తీసుకువచ్చి క్వారీ తవ్వకాలు నిర్వహిస్తున్న వ్యాపారి ఎవరు, వారికి సహకరిస్తున్న అధికారులు ఎవరు, వారికి ఆశ్రయం కల్పించిన వారు ఎవరనేది సంబంధిత ఉన్నతాధికారులు తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే అక్రమార్కులను వదిలివేసి… కూలి కోసం వచ్చిన వారిపై కేసులు పెడుతున్న అధికారుల వైఖరిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ శాఖ అధికారుల ప్రమేయం లేకుండా ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెల రోజులుగా గుర్రాలగొంది రంగురాళ్ల క్వారీ పరిసరాలలో బస ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రి పూట తవ్వకాలకు పాల్పడుతున్నారని సమాచారం. చింతపల్లికి చెందిన ఒక వ్యాపారస్తుడు, మరి కొంతమంది సిండికేట్‌లుగా ఏర్పడి ఈ వ్యవహారం నడిపిస్తున్నారని, వారికి స్థానిక అటవీశాఖ ఉన్నతాధికారి కొమ్ముకాస్తున్నట్లు క్వారీ పరిసర ప్రాంత గిరిజనుల నుంచి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 16వ తేదీ ఆదివారం ఉదయం సిగినాపల్లి రంగు రాళ్ల క్వారీలో పట్టుబడిన నిందితులను 17వ తేదీ సోమవారం సాయంత్రం వరకు పెదవలస అటవీ పరిధి అధికారిగానీ, ఆ శాఖ అధికారులుగానీ మీడియాకు తెలియపరచకపోవడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. దీనికితోడు నిందితులపై కేసులు కట్టిన తర్వాత వారికి సెల్ఫ్‌ బెయిల్‌ ఇవ్వడానికి సాల్వెన్సులు రాయించేందుకు వీఆర్వోల చుట్టూ అటవీ శాఖ అధికారులు తిరుగుతున్నట్టు సమాచారం. నెల రోజులుగా కోట్లలో రంగు రాళ్ల వ్యాపారం జరిగినట్లు, భారీ మొత్తంలో సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. గిరిజన ప్రాంతంలోని ఖనిజ సంపదను కాపాడాల్సిన అటవీ అధికారులే అక్రమార్కులకు కొమ్ము కాయడం దురదృష్టకరమని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం, అటవీ శాఖ ఉన్నతాధికారులు రంగు రాళ్ల తవ్వకాలను నిరోధించి, నిందితులపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి కఠినంగా శిక్షించాలని మన్యం ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు