మయన్మార్‌లో 7.7, థాయ్‌లో7.4 రిక్టర్ స్కేల్ నమోదు
బ్యాంకాక్‌లో కండ్లముందే కుప్పకూలిన వేలాది భవనాలు
మృతుల సంఖ్య వేలల్లో ఉంటుందని ఆందోళన
క్షణాల వ్యవధిలో రెండుసార్లు కంపనాలు
శిథిలాల చిక్కుకుపోయిన వేలాది మంది
థాయ్‌లాండ్‌లో అత్యవసర పరిస్థితి విధింపు
సహాయక కార్యక్రమాల్లోకి దిగిన ఆర్మీ సిబ్బంది
భారత్‌లోనూ పలుచోట్ల భూ ప్రకంపనలు
మేఘాలయాలో రిక్టర్ స్కేల్‌పై 4.4 గా నమోదు
ఢిల్లీ, కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అసొం, పాట్నాలోనూ ఎఫెక్ట్మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో శుక్రవారం భారీ భూకంపాలు సంభవించించాయి. నిమిషాల వ్యవధిలో రెండు సార్లు వచ్చిన భూకంపానికి ఆ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. ముందుగా మయన్మార్‌లో తొలి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. ఆ తర్వాత రెండో భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. సెంట్రల్ మయన్మార్‌లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు ఊగిపోయాయి. పలుచోట్లు ఎత్తైన అంతస్తులు నేలకూలినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలతో మయన్మార్‌లోని మాండలేలోని ఐకానిక్ అవా వంతెన కుప్ప కూలింది. ఇరావడీ నదిలోకి వంతెన కూలిపోయిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కాగా, కూలిన భవనాలు, ఇళ్లలో వేలాది మంది చిక్కుకున్నారు.. మయన్మార్‌లో విమాన, రైలు సర్వీసులన్నీ నిలిపివేశారు. సహాయక కార్యక్రమాల కోసం సైన్యాన్ని రంగంలోకి దింపారు. భూకంప సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆ దేశ అధినేతలు కోరారు.
మయన్మార్ భూకంప తీవ్రత భారీగా ఉంది. వరుస భూకంపాల వల్ల ఆ దేశంలోని పలు చోట్ల భవనాలు కుప్పకూలాయి. ఓ భవనంలో 43 మంది గల్లంతు అయినట్లు సమాచారం. అలాగే భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. భూకంపం ధాటికి మండాలేలోని చారిత్రక అవా బ్రిడ్జ్ కూడా కుప్పకూలింది. మయన్మార్ వాయువ్య ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించారు.
థాయ్‌లాండ్‌లో
మరోవైపు ఈ భూకంపం కారణంగా థాయ్‌లాండ్‌లో కూడా భూమి కంపించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ లో 7.3 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం ధాటికి ఎత్తైన భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో అనేక మంది గల్లంతైనట్లు తెలిసింది. ఈ భూకంపంతో థాయ్‌లాండ్‌లో ఆదేశ ప్రధాని ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో బ్యాంకాక్‌లోని భవనాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. మెట్రో, రైల్వేతో పాటు విమాన సర్వీసులను వెంటనే నిలిపివేశారు. అలాగే ఇక్కడ ఉన్న అనేక సుప్రసిద్ధ బౌద్దరామాలు కూడా కుప్పకూలాయి.. ఆ దేశంలో భారీగా ప్రాణం నష్టం జరిగిందని అధికారుల అంటున్నారు.
భారత్‌లోనూ..
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కతాతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, ఘాజియాబాద్, నోయిడా, మేఘాలయా, కోల్‌కతా, మణిపూర్‌లోని ఇంఫాల్‌లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. మేఘాలయా ఈస్ట్ గారోహిల్స్‌లో 4.4 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతోందో అన్న టెన్షన్‌తో ఇళ్లు, కార్యాలయాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.
చైనాలో
మరోవైపు చైనాలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చైనాలోని నైరుతి యునాన్ ప్రావిన్స్‌లో భూమి కంపించినట్లు బీజింగ్ భూకంపం సంస్థ తెలిపింది. ఈ ప్రకంపనలు రిక్టరు స్కేలుపై 7 తీవ్రతతో నమోదైనట్లు వెల్లడించింది. అలాగే భూకంప తీవ్రత బంగ్లాదేశ్ ను తాకింది..