Friday, February 21, 2025
Homeతెలంగాణమళ్లీ అధికారంలోకి వస్తాం

మళ్లీ అధికారంలోకి వస్తాం

. కాంగ్రెస్‌ తిరోగమన పాలన
. ఏప్రిల్‌ 27న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ
. ఏడాది పాటు సిల్వర్‌ జూబ్లీ వేడుకలు
. విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : రాష్ట్రంలో మరోమారు బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం తథ్యమని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) నమ్మకంగా చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘వందశాతం అధికారంలోకి వస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నాం. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళుతోంది. కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోతుందని విమర్శించారు. సీఎం రేవంత్‌ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఇంత త్వరగా వస్తుందని తాను అనుకోలేదని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని, బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుందని వ్యాఖ్యానించారు. తమ హయాంలో ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నప్పటికీ వారితో పనిచేయించుకోవడం రేవంత్‌ ప్రభుత్వానికి చేత కావడం లేదని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఏటేటా రాష్ట్ర ఆదాయం పెరిగిందని గుర్తుచేశారు. పాతికేళ్ల స్ఫూర్తితో తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం బుధవారం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరిగింది. బీఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలతో పాటు సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరి అంశాలపై పార్టీ నాయకులతో కేసీఆర్‌ చర్చించారు. వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ సుదీర్ఘ ప్రస్థానాన్ని గుర్తు చేశారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు. ఏప్రిల్‌ 27న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. సిల్వర్‌జూబ్లీ వేడుకలను ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని సూచించారు. పార్టీ కమిటీలు వేయాలన్నారు. వాటికి ఇంచార్జిగా బాధ్యతలను సీనియర్‌ నాయకుడు హరీశ్‌రావుకు అప్పగించారు. త్వరలోనే మహిళా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుందని, ప్రతి జిల్లా కేంద్రంలో కొనసాగుతుందని తెలిపారు. పార్టీ ప్రతినిధుల సభ ఉంటుందని చెప్పారు. తెలంగాణ సమాజం సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్‌ఎస్‌ అని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వహించిన తెలంగాణ ప్రజల పార్టీ అని తెలిపారు. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్య పరుస్తూ, తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేస్తూ, గతం గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలస వాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసుకోవాలన్నారు. విద్యార్థి, మహిళా సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్ట పరచాలన్నారు. అందుకోసం సీనియర్‌ పార్టీ నేతలతో కూడిన సబ్‌ కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు