. ఇజ్రాయిల్‌పై ఇరాన్ గెలుపు అమెరికాకు చెంపదెబ్బ
. అణు కేంద్రాలపై దాడులతో ట్రంప్ సాధించినదేమీ లేదు: ఖామేనీ
తెహ్రాన్ : భవిష్యత్‌లో తమ దేశం జోలికి వస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ అధినేత ఆయాతుల్లా అలీ ఖామేనీ హెచ్చరించారు. కాల్పుల విరమణతో ఇజ్రాయిల్‌పై ఇరాన్ గెలిచిందని అన్నారు. అణు కేంద్రాలపై దాడులు చేయడం ద్వారా అమెరికా సాధించింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్`ఇరాన్ మధ్య కాల్పుల విరమణ తర్వాత ఆయన తొలిసారి స్పందించారు. ‘ఇస్లామిక్ రిపబ్లిక్ గెలుపు అమెరికాకు చెంపదెబ్బ. ఈ ప్రాంతంలో అమెరికాకు కీలకమైన స్థావరాలపై దాడి చేసింది’ అని ఖామేనీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునకు ఇరాన్ తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇరాన్ లొంగిపోయే ప్రసక్తే లేదని, అందుకు ఆశించే అమెరికాకు భంగపాటు తప్పదని ఖామేనీ ఎద్దేవా చేశారు. అమెరికా కీలక స్థావరాలపై ఇరాన్ దాడులు చేసిందని, భవిష్యత్‌లో అవసరమైతే మళ్లీ దాడులు చేస్తుందని అన్నారు. ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థను తెహ్రాన్ క్షిపణులు ఛేదిస్తుండటంతో ఆ దేశాన్ని కాపాడటం కోసం అమెరికా యుద్ధంలోకి వచ్చిందన్నారు. అణు కేంద్రాలపై దాడితో ఆ దేశం సాధించినదేమీ లేదన్నారు. రంగంలోకి దిగపోతే ఇజ్రాయిల్ పూర్తి వినాశనం అవుతుందనే అమెరికా దాడులు చేసిందని ఖామేనీ వ్యాఖ్యానించారు.
అమెరికా బేరసారాలు…. వెనక్కు తగ్గని ఇరాన్
అణు చర్చలకు ప్రసక్తే లేదని ఇరాన్ చెబుతుండటంతో అమెరికా బేరసారాలకు దిగింది. ఇరాన్‌ను ఎలాగైనా చర్చలకు వచ్చేలా చేయాలని యత్నిస్తున్నది. యురేనియం శుద్ధి చేపట్టకూడదన్న షరతుకు ఒప్పుకుంటే పౌర అణు కార్యక్రమానికి 30 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతాం, ఆంక్షల తొలగిస్తాం, స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాల వినియోగానికి అవకాశం ఇస్తామంటూ అనేక ప్రతిపాదనలు చేసింది. ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపింది. కానీ ఇరాన్ మాత్రం ససేమిరా అంటోంది. అణు చర్చల ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇప్పటికే స్పష్టంచేశారు. ఒకవేళ చర్చలు జరిపితే ఇరాన్‌కు ప్రయోజనం ఏమిటని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి కొత్త వాస్తవికతల ఆధారంగా భవిష్యత్ దౌత్యపరమైన కార్యాచరణ ఉంటుందని అరాగ్చీ అన్నారు.
400 కిలోల యురేనియం తొలగించలేరు: ట్రంప్
ఇరాన్ అణు కేంద్రంలో 60 శాతం శుద్ధి చేసిన 400 కేజీల యురేనియం ఉందని అమెరికా వాదిస్తోంది. అమెరికా దాడులు సమయంలో శుద్ధి చేసిన యురేనియం మొత్తాన్ని రహస్య ప్రదేశానికి తరలించామని ఇరాన్ చెబుతోంది. అయితే ఫోర్డో అణు కేంద్రం నుంచి యురేనియం తరలించలేదని ట్రంప్ అంటున్నారు. అమెరికా దాడుల్లో ఇరాన్‌కు కొంత నష్టం జరిగినట్లు రక్షణ ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొనడంతో డెమోక్రాట్లు ఆయనను నిలదీశారు. దీంతో ట్రూత్ మాధ్యమంగా ట్రంప్ స్పందించారు. వారిపై విచారణకు ఆదేశాలిచ్చారు. అణు కేంద్రాలను భారీగా దెబ్బకొట్టామన్నారు. కాగా, ట్రంప్ వాదనకు భిన్నంగా ఇంటెలిజెన్స్ నివేదిక ఉండటం చర్చనీయాంశమైంది.
ఖామేనీ తప్పించుకున్నారు: ఇజ్రాయిల్
బంకర్‌లోకి వెళ్లడం ద్వారా ఖామేనీ తప్పించుకున్నారని, ఆయనను హతమార్చేందుకు విఫలయత్నం చేశామని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ అన్నారు. సరైన అవకాశం లభించలేదన్నారు. ఖామేనీ తమ చేతికి చిక్కితే ప్రాణాలతో వదిలే వాళ్లం కాదన్నారు.