Homeసంపాదకీయంమళ్లీ యుద్ధమేఘాలు!

మళ్లీ యుద్ధమేఘాలు!

- Advertisement -

ప్రపంచం మరోసారి తీవ్ర విపత్తు అంచున నిలబడింది. తూర్పు ఐరోపా నుంచి పశ్చిమాసియా మీదుగా విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు సమస్త మానవాళిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. స్థానిక సరిహద్దు వివాదాలుగా మొదలైన ఘర్షణలు క్రమంగా బహుళ దేశాల ప్రచ్ఛన్న సమరంగా మారి, మూడో ప్రపంచ యుద్ధ సంకేతాలను వెలువరిస్తున్నాయి. రష్యా గుండెకాయ అయిన మాస్కోపై ఉక్రెయిన్ అనూహ్య డ్రోన్ దాడులు, పశ్చిమాసియాలో హూతీ తిరుగుబాటుదారుల దూకుడు, ఇరాన్ అత్యున్నత స్థాయి సైనిక సన్నద్ధత ‘కోడ్ 100’ ప్రకటన, అమెరికాలో మొదలైన అనూహ్య రాజకీయసైనిక కదలికలు.. ఇవన్నీ ప్రపంచం నివురుగప్పిన నిపðలా మారిన వైనాన్ని స్పష్టం చేస్తున్నాయి. శాంతి స్థాపన కోసం ఏర్ప డిన అంతర్జాతీయ వేదికలు కేవలం ప్రేక్షకుల్లా మిగిలిపోవడం ఈ సంక్షోభ తీవ్రతను మరింత పెంచుతోంది. రష్యా గుండెల్లో ఉక్రెయిన్ డ్రోన్ల గుబులు ఇంకా వదల్లేదు. సుదీర్ఘకాలంగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ రాత్రికి రాత్రే వందల సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడటం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా 1100కిపైగా డ్రోన్లతో దాడి చేసింది. ఇందులో సగం డ్రోన్లను రష్యా కూల్చివేసింది. మిగతా సగం మాస్కోలో విధ్వంసం సృష్టించాయి. పెద్దసంఖ్యలో పౌరులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు మరణించారు. కేవలం సరిహద్దులకు పరిమితమైన పోరు ఇప్పుడు శత్రుదేశ రాజధాని నివాస ప్రాంతాలు, కీలక భవనాల దాకా చేరింది. ఈ భీకర దాడుల్లో ప్రాణనష్టం, తీవ్ర ఆస్తి నష్టం జరగడం రష్యా భద్రతా వ్యవస్థకు సవాలుగా మారింది. సైనికపరంగా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి రష్యా ఇకపై ఎలాంటి ప్రతిస్పందనను ఎంచుకుంటుందన్నది ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్న. కీవ్పై సంప్రదాయ ఆయుధాలతో దాడి చేయడమా, లేక గతంలో హెచ్చరించినట్లు వ్యూహాత్మక అణ్వాయుధాల ప్రయోగానికి మొగ్గు చూపడమా అనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. మాస్కోపై దాడి యుద్ధ తీవ్రతను అమాంతం పెంచే ప్రమాదకర అడుగు అనడంలో సందేహం లేదు. నిజానికి ఇది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజేసిన మంటలేనని సర్వవిధితం. అమెరికా ప్రోత్సాహంతోనే ఉక్రెయిన్ కు మళ్లీ ఎక్కడలేనంత ధైర్యం వచ్చింది, డ్రోన్లతో తెగబడింది.ఇంకోవైపు, పశ్చిమాసియాలో రగులుతున్న కార్చిచ్చు ఆరకపోగా, మరింత చెలరేగింది. పశ్చిమాసియా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిం దని అంతర్జాతీయ నిపుణులే చెపుతున్నారు. ఇరాన్ అండదండలు పుష్క లంగా ఉన్న యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా లక్ష్యంగా, అలాగే ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేశారు. సౌదీ అరేబియా, హూతీల మధ్య మళ్లీ రాజుకున్న ఈ ఘర్షణ చమురు సరఫరా మార్గాలను దిగ్బంధించే స్థాయికి చేరింది. హూతీల ఈ తీవ్ర దూకుడు వెనుక బలమైన వ్యూహం దాగి ఉంది. ప్రాంతీయ శక్తులను బలహీనపరచడం, అమెరికా`పాశ్చాత్య మిత్రదేశాలపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఇరాన్ ‘కోడ్ 100’ హై అలెర్ట్ జారీ చేయడం యుద్ధ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. అంతర్జాతీయ సైనిక పరిభాషలో ‘కోడ్ 100’ అంటే తక్షణ దాడి లేదా సంపూర్ణ యుద్ధానికి దారితీసే అత్యున్నత స్థాయి సైనిక సన్నద్ధత. బాహ్య దాడులు ఎదురైతే క్షణాల్లో విరుచుకుపడేందుకు క్షిపణి వ్యవస్థలు, వైమానిక విభాగం, సైన్యాన్ని సర్వసన్నద్ధం చేయడం దీని ఉద్దేశం. ఒక స్వతంత్ర దేశం ఈ స్థాయి హెచ్చరికను అమల్లోకి తెచ్చిందంటే, అక్కడ దౌత్య మార్గాలు దాదాపు మూసుకుపోయినట్లే భావించాలి. ఒక విధంగా చెప్పాలంటే, సామ్రాజ్యవాదంతో ఊగిపోతున్న అమెరికాకు ఘాటైన సమాధానం ఇచ్చే క్రమంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఇరాన్ సిద్ధమైనట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో భారతగడ్డపై జపాన్ తొలిసారిగా చేస్తున్న సైనిక విన్యాసాలపై అనుమానాలూ తలెత్తకమానవు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా రాజకీయ రంగ స్థలంలో చోటు చేసుకున్న మార్పులు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యక్తిగత పర్యటనలు, సెలవులను అర్ధాంతరంగా రద్దు చేసుకుని వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌కు చేరుకోవడం సాధారణ రాజకీయ చర్యగా కనిపించడం లేదు. ఇరాన్ చర్యలను అణచివేయడానికి అమెరికా సైనిక దాడి చేయవచ్చనే ఊహాగానాలు ప్రపంచవ్యాప్తంగా జోరందు కున్నాయి. ట్రంప్ అనుసరించే దూకుడు విధానాలు, ప్రత్యక్ష సైనిక చర్యలకు ఆయన ఇచ్చే ప్రాధాన్యం తెలిసినదే. ఇరాన్‌పై ప్రత్యక్ష దాడి జరిగితే, అది కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోదు. లెబనాన్‌లోని హెజ్బొల్లా, సిరియా, ఇరాక్‌లోని సాయుధ గ్రూపులు రంగంలోకి దిగుతాయి. రష్యా, చైనా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా జోక్యం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా మొత్తం ఆసియా ఖండం అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉంది.యుద్ధాల ప్రభావం కేవలం సరిహద్దులకే పరిమితం కాదు… అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుతాయి. పశ్చిమాసియాలో సంక్షోభం ముదిరితే ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. ఎర్ర సముద్రం, హోర్మూజ్ జలసంధి వంటి కీలక వాణిజ్య జలమార్గాలు మూతపడితే సరఫరా వ్యవస్థలు స్తంభించి పోతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి, నిత్యావసర వస్తువుల కొరతకు దారితీస్తుంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఇది తీరని భారం మోపు తుంది. ఆర్థిక మాంద్యం ఇప్పటికే భారత్‌తో సహా వివిధ దేశాలను పట్టి పీడిస్తున్న వేళ, ఈ కొత్త ఘర్షణలు ప్రపంచాన్ని మరింత పేదరికంలోకి, అస్థిరతలోకి నెట్టివేస్తాయి. శాంతి మార్గమే శరణ్యం వంటి వచనాలు ట్రంప్‌కు చెవికెకక్కడం లేదు. అతని మూర‰పు విన్యాసాలు, విపరీత ధోరణులు ప్రపంచాన్ని అశాంతిలోకి నెట్టేస్తున్నాయి. అణ్వా యుధాలు, అత్యాధునిక డ్రోన్లు, హైపర్సోనిక్ క్షిపణులు రాజ్యమేలుతున్న ప్రస్తుత యుగంలో యుద్ధంలో ఎవరూ విజేతలుగా మిగలరు. కేవలం విధ్వంసమే మిగులుతుంది. మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి అయినా, హూతీల ప్రతీకార దాడులైనా, ఇరాన్ ‘కోడ్ 100’ సైనిక సన్నద్ధతైనా, అమెరికా యుద్ధోన్మాద హెచ్చరికలైనా.. అన్నీ మానవాళి వినాశనానికే దారి తీస్తాయి. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు నిర్లిప్తతను వీడి తక్షణమే అత్యవసర శాంతి చర్చలకు చొరవ చూపాలి. బలప్రదర్శనలు, ప్రతీకారేచ్ఛ పక్కనపెట్టి దౌత్యపరమైన సంప్రదింపులతో విభేదాలను పరిష్కరించుకోవాలి. లేనిపక్షంలో, ప్రపంచం కోరుకోని ‘మరో ప్రపంచ యుద్ధం’ ఒక చేదు వాస్తవంగా మారి, చరిత్ర పుటల్లో ఆధునిక నాగరికత ముగింపునకు నాంది పలికే ప్రమాదం ఉంది. నాయకులు విజ్ఞతతో వ్యవహరించాల్సిన సమయం ఇదే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు