Thursday, May 15, 2025
Homeవిశ్లేషణమహత్తర పోరాట చరిత్ర ఏఐవైఎఫ్‌ది

మహత్తర పోరాట చరిత్ర ఏఐవైఎఫ్‌ది

జి. ఈశ్వరయ్య

అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) 1959 వ సంవత్సరంలో ఏర్పాటైంది…. దేశానికి భవిత, వెన్నెముక, జవసత్వాలిచ్చే యువత కోసం, దేశానికి ఉజ్వల భవిష్యత్‌ కోసం గత 66 ఏళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న సంస్థ ఏఐవైఎఫ్‌. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించాలంటూ ఉద్యమించిన తొలి సంస్థ ఏఐవైఎఫ్‌. యువజన సమాఖ్య నాయకుడు, ఎంపీ కీ.శే. సీకే చంద్రప్పన్‌ 1974 లో ఓటు హక్కుకు వయోపరిమితి తగ్గించాల్సిందిగా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. యువతకు ఉద్యోగ, ఉపాధికోసం సమరశీల పోరాటాలు చేసిన సంఘం ఏఐవైఎఫ్‌. 1980 లో ఉద్యోగాలన్నా ఇవ్వండి లేదా జైలుకన్నా పంపండంటూ ఉద్యమించింది ఏఐవైఎఫ్‌. జాబ్‌ ఆర్‌ జైల్‌ నినాదంతో 1984 ఏప్రిల్‌ 3-5 తేదీల్లో పార్లమెంట్‌ ముందు ఏఐవైఎఫ్‌ నిర్వహించిన భారీ పికెటింగ్‌ చరిత్ర సృష్టించింది. సేవ్‌ ఇండియా- ఛేంజ్‌ ఇండియా పేరుతో రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటూ కన్యాకుమారి నుంచి భగత్‌సింగ్‌ జన్మస్థలం పంజాబ్‌లోని హుస్సేనీ వాలా వరకు లాంగ్‌ మార్చ్‌ నిర్వహించింది. యువతను నిర్వీర్యం చేస్తున్న మద్యం, డ్రగ్స్‌, ఇతర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్‌ ఎన్నో పోరాటాలు చేసింది. చేస్తూనే ఉంది. మద్యం, డ్రగ్‌ మాఫియాలపై చేసిన పోరాటాలలో ఎంతో మంది కామ్రేడ్స్‌ అమరులయ్యారు. సామాజిక చైతన్యం, శాస్త్రీయ దృక్ఫథం ఈ రెండు ఆలోచనా విధానాలతో ఏఐవైఎఫ్‌ ముందుకు సాగుతోంది.
భారతదేశ 140 కోట్ల జనాభాలో 80 కోట్లకు పైగా యువత. అందునా 35 సంవత్సరాల లోపు ఉండే యువత అత్యధికం. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో శక్తిమంతమైన మానవ వనరులుగా, శ్రమజీవులుగా భారత యువత ఉన్నారు. వారికి సరైన ఉపాధి, అవకాశాలు కల్పిస్తే మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం నిరుద్యోగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రధాని మోదీ 2014 ఎన్నికల ప్రచారంలో దేశంలో యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి దశాబ్ధకాలం గడిచినా ఇంతవరకు ఈ హామీ అమలుకు నోచుకోలేదు. మోదీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండేళ్ల కాలంలో పెరిగినంత నిరుద్యోగం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ పెరగలేదు. ఆర్థిక గణాంకాల ప్రకారం ఈ దేశంలో 23 శాతం యువత నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ వివరాలు బయటపడతాయనే మోదీ సర్కారు నిరుద్యోగ గణాంకాలను బయటపెట్టడం ఆపేసింది.
మన దేశ యువతలో ఐదుకోట్ల మంది నిరుద్యోగులుగా ఉంటే మరో ఐదు కోట్ల మంది చాలీ చాలని వేతనాలతో బతుకీడుస్తున్నారు. ప్రైవేటు రంగంలో కూడా కోట్ల మంది యువత రోజుకు 12 గంటలకు పైగా పనిచేస్తే అతితక్కువ దినసరి వేతనం తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కార్పొరేట్‌ దిగ్గజాలు వారానికి 90 గంటలకు పనిచెయ్యాలని సలహా ఇస్తున్నారు. అంటే మన దేశాన్ని మళ్లీ వెట్టి చాకిరీ వ్యవస్థకు తీసుకువెళ్లే ప్రణాళిక రచించారు.
అందరికీ విద్య, ఉపాధి ప్రభుత్వ బాధ్యత. కానీ ప్రభుత్వ యంత్రాంగానికి నిరుద్యోగం నిర్మూలించాలన్న సంకల్పం లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 45 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క రైల్వేల్లోనే 4 లక్షల ఉద్యోగాలు పైగా ఖాళీలున్నాయి. బ్యాంకింగ్‌ సెక్టార్‌లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇక విద్య, వైద్యం, స్కూల్స్‌, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో, వైద్య సర్వీసుల్లో ఖాళీలు అసలు లెక్కేలేదు. దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పించేది ప్రధానంగా వ్యవసాయ రంగం. కానీ నేటి యువత ఎవరూ వ్యవసాయంపై ఆసక్తి చూపడం లేదు. కనీసం తల్లిదండ్రులు ఎవరూ తమ పిల్లలను వ్యవసాయంలోకి పంపడం లేదు. ఎందుకంటే వ్యవసాయం లాభదాయకం కాదు. వ్యవసాయం ఖర్చు పెరిగి, గిట్టుబాటు ధరలు లేక నష్టాల పాలైంది. అగ్రికల్చర్‌ మార్కెట్లన్నీ కార్పొరేట్‌, మార్కెట్‌ మాఫియా చేతిలో చిక్కుకున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి…నకిలీలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. రౖౖెతులు అప్పుల్లో పుడతున్నారు, అప్పుల్లో పెరుగుతున్నారు, అప్పుల్లోనే మరణిస్తున్నారు.
విద్యా వ్యవస్థ పూర్తిగా వ్యాపారంగా మారింది. నూతన విద్యావిధానంతో విద్య కార్పొరేట్‌ గుప్పట్లోకి వెళ్లడమే కాదు…విద్యలో మతం చొరబడిరది….అందరికీ సమాన అవకాశాలు ప్రశ్నార్ధకమయ్యాయి….ప్రైవేటు పాఠశాలలు ఒక్కో విద్యార్ధిపై ఎల్‌కేజీ నుంచి పదవ తరగతి వరకు కనీసం పదిలక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. నీట్‌ లాంటి ప్రవేశ పరీక్షల కోచింగ్‌ సెంటర్లు లక్షలు ఖర్చుచేయగల ఉన్నత వర్గాలు, పట్టణ ప్రాంత విద్యార్ధులకే పరిమితమయ్యాయి. విద్యార్ధుల నుంచి డబ్బులు పిండే మాఫియా ముఠాలుగా కోచింగ్‌ సెంటర్లు అవతరించాయి. బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు కనీసం మూడు శాతానికి మించడం లేదు. కొఠారీ కమిషన్‌ ప్రతిపాదనల ప్రకారం బడ్జెట్‌లో విద్యకు పదిశాతం పైగా కేటాయింపులు ఉండాలి. విద్యారంగానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వమే విద్యను ప్రైవేటు రంగానికి అప్పగిస్తోంది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న నూతన సరళీకృత ఆర్థిక విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా, పేదలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రాయితీల రూపంలో కట్టబెడుతున్నాయి. సంపన్నులు మరింత సంపన్నులుగా, పేదలు నిరుపేదలుగా మారిపోతున్నారు. మధ్య తరగతి క్రమంగా క్షీణిస్తోంది. 54 శాతం మనదేశ సంపద ఒక్క శాతం సంపన్నుల చేతిలోకి వెళ్లింది. మన దేశంలో వంద కుటుంబాల సంపద 30 కోట్ల జనాభా సంపదకన్నా ఎక్కువగా ఉంది. ధనిక, పేదల మధ్య అంతరం రోజురోజుకీ తీవ్రంగా పెరుగుతోంది.
మనదేశంలో మూడు కోట్లకు పైగా యువత మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్లుగా తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇళ్లలో ఆర్థిక సమస్యలు, వృత్తిపరమైన ఒత్తిడిలతోనే యువత మానసిక అనారోగ్యాలకు లోనవుతున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. విద్యార్ధుల ఆత్మహత్యలూ ప్రధాన సమస్యగా మారాయి. దేశంలో ప్రతి గంటకూ ఒక విద్యార్ధి ఆత్యహత్య చేసుకుంటున్నాడు. 2021 నివేదిక ప్రకారం ఒక్క సంవత్సరంలోనే 13,089 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. గత రెండు సంవత్సరాలలో ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణం విద్యాసంబంధమైన ఒత్తిడిలు, సోషల్‌ స్టేటస్‌ కోసం వారిపై తల్లిదండ్రులు పెడుతున్న ఒత్తిడి, మానసిక సమస్యలే కారణంగా తెలుస్తోంది. దేశంలో రెండు కోట్ల మందికి పైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారు. పోషకాహారం లేక ఈ చిన్నారులలో ఎదుగుదల క్షీణిస్తోంది. మహిళలు రక్తహీనత, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.
గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ప్రకారం దేశంలో సగానికి పైగా మహిళలు సరైన ఆహారం లేక, రక్తహీనతతో బాధపడుతున్నారు. వీరిలో ప్రధానంగా గర్భిణులే ఉన్నారు. ఈ గణాంకాలు చూస్తే భారతదేశ ఆహార భద్రత ఇప్పుడు ప్రశ్నార్ధకమవుతోంది. బడ్జెట్‌లో ఆరోగ్యానికి కేటాయింపులు కనీసం 2 శాతం దాటడంలేదు. కేంద్రంలో బీజేపీ సర్కారు అండదండలతో ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘపరివార్‌ సంస్థలు విజృంభిస్తున్నాయి. మతకలహాలు, కులాల కుమ్ములాటలు సృష్టిస్తున్నాయి. ప్రజలను సమస్యల నుంచి పక్కదోవ పట్టించడానికి హిందూ-ముస్లిం విభజనను తీసుకొస్తున్నాయి. నిరుద్యోగం, విద్య, వైద్యం లాంటి అసలైన సమస్యల వైపు యువత దృష్టి పెట్టకుండా ఉండడంకోసం మతం పేరుతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయి. ఈ సంఫ్‌ుపరివార్‌ శక్తులు మత విద్వేషాలు రగిల్చి, మారణహోమం సృష్టించడానికి నిరుద్యోగ యువతను వాడుకుంటున్నాయి. వీరికి కార్పొరేట్‌, పెట్టుబడిదారులు నిధులు అందిస్తున్నారు.
ఈ నేపథó్యంలోనే ఏఐవైఎఫ్‌్‌ 17వ జాతీయ మహాసభ మే 15నుంచి 18 వరకు నిర్వహించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక, ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఈ మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు దేశ వ్యాప్తంగా వెయ్యిమంది యువజన ప్రతినిధులు హాజరై కేంద్రంలో బీజేపీ సర్కారు ప్రజా వ్యతిరేక, యువజన వ్యతిరేక విధానాలను చర్చించనున్నారు. అంతేకాదు బీజేపీ సర్కారు అమలు చేస్తున్న విభజన రాజకీయాలు, నియంతృత్వ విధానాలు, క్రోనీ కాపిటలిస్టు విధానాలు, కార్పొరేట్లకు రెడ్‌కార్పెట్‌ పరిచే ప్రైవేటీకరణ విధానాలతో ఈ దేశ సంపదను అతికొద్దిమందికి దోచిపెట్టి దేశ యువతను నిరుద్యోగులను చేసే కుట్రలను ఎదుర్కొనే దిశగా ఈ మహాసభలు జరుగుతున్నాయి. నిరుద్యోగానికి వ్యతిరేకంగా, అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా, ఈ దేశ ప్రజలకు మెరుగైన జీవనం కోసం, దేశాన్ని మతోన్మాదుల నుంచి కాపాడడం కోసం ఏఐవైఎఫ్‌ జాతీయ మహాసభలు ఈ దేశ యువతకు దిశానిర్ధేశాన్ని ఇవ్వనున్నాయి. దేశంలో ప్రగతిశీల, అభ్యుదయ, ప్రజాస్వామిక లౌకిక భావాలున్న యువతకు ఏఐవైఎఫ్‌ జాతీయ మహాసభలు హార్థిక స్వాగతం చెబుతున్నాయి.
అఖిలభారత యువజన సమాఖ్య మాజీ జాతీయ కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు