ఆర్వీ రామారావ్
అఖిలభారత కిసాన్ సభ ఏర్పడినప్పుడు ఆచార్య నరేంద్ర దేవ్ అందులో కీలక పాత్రధారి. అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బాల గంగాధర్ తిలక్, అరవిందో ఘోష్ స్ఫూర్తితో నరేంద్ర దేవ్ జాతీయోద్యమంలో భాగస్వామి అయ్యారు. ఆయనకు బౌద్ధం మీద ఎంత విశ్వాసం ఉండేదో మార్క్సిజం మీద కూడా అంతే అనురక్తి ఉండేది. హిందీ భాషోద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 1934లో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ ఏర్పడినప్పుడూ ఆచార్య నరేంద్ర దేవ్ కీలక పాత్ర పోషించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో ఆయన చాలా సార్లు జైలు శిక్ష అనుభవించారు. అనేక సార్లు ఉత్తరప్రదేశ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. 1948 తరవాత లక్నో విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఉన్నారు. తనకు అభిమానం ఉన్న మార్క్సిస్టు దృక్పథం రీత్యా నైతిక, మానవతావాద దృష్టితో కూడా పేదరికం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజాస్వామ్యం లేని సామాజిక ప్రజాస్వామ్యం బూటకం అని ఆయన నమ్మేవారు.
నరేంద్ర దేవ్ నిరీశ్వర వాది. దేవుడిని గొప్పగా భావించడం అంటే మానవాళిని కించపరచడమే అనేవారు. మన దేశంలో పరిశోధనావకాశాలు అంతగా లేని సమయంలోనే పాళీ భాషలో ఉన్న బౌద్ధ సాహిత్యాన్ని ఆపోసన పట్టారు. త్రిపిటకాలు, అనుపిటక మీద ఆయన సాధికారికంగా మాట్లాడేవారు. బౌద్ధంలోని నైతిక అంశాల మీద ఆయనకు ఎనలేని మక్కువ. ప్రపంచం అంతా బాధల్లో మునిగి ఉన్నప్పుడు నాకు మోక్షం వస్తే ఫలితం ఏమిటి అనేవారు. బౌద్ధంలో పేర్కొన్న విధంగా సాంస్కృతికంగా మన దేశం స్వేచ్ఛగా ఉంటుందని, గుడ్డి సాంప్రదాయికతకు దూరంగా ఉండొచ్చునని నరేంద్ర దేవ్ భావించేవారు. ఈ సిద్ధాంతం ఆధారంగానే ఆయన నైతికత అన్న భావనను ప్రచారం చేసేవారు. ఇదే దృష్టితో ఆయన ప్రాచ్య, పాశ్చాత్య సిద్ధాంతాలను అధ్యయనం చేసేవారు. అందువల్లే ఆయనకు భారత సంస్కృతి మీద అపారమైన పట్టు ఉండేది.
బౌద్ధంలో అందుబాటులో ఉన్న సాహిత్యం అంతా హిందీలో వెలువడాలన్నది ఆయన కోరిక. బౌద్ధ గ్రంథాలను హిందీలోకి అనువదించే వారి కోసం అన్వేషించారు. ఆయన రాసిన బౌద్ధ ధర్మ దర్శనం చాలా ప్రామాణికమైన గ్రంథం. ఈ గ్రంథంలో ఆయన బౌద్ధ మతం, సిద్ధాంతాన్ని విడమర్చారు. మహాత్మా గాంధీలాగే ఫాసిజం వల్ల ఎంత కీడు ఉందో సామ్రాజ్యవాదం కూడా అంతే చేటు తెస్తుందన్నది ఆయన భావన. ఈ అవగాహన ఆయనకు భారతీయ స్రోతస్సు నుంచే అబ్బింది.
ఆయన అసలు పేరు అవినాశీ లాల్. కానీ నరేంద్ర దేవ్‌గా మార్చుకున్నారు. ఆయన పుట్టింది ప్రస్తుత పాకిస్థాన్ లోని సియాల్ కోట్‌లో అయినా ఆయన తండ్రి బల్దేవ్ ప్రసాద్ 19వ శతాబ్దంలో ఫైజాబాద్ తరలి వచ్చారు. స్వాతంత్య్రానంతరం ఆయన లక్నో విశ్వ విద్యాలయం, బెనారస్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఉన్నారు. సోషలిజం అంటే కేవలం ఆకలి తీర్చేది కాదని, సాంస్కృతికంగా కూడా స్వేచ్ఛ ఉండాలని భావించారు. నరేంద్ర దేవ్ పండిత్ జవహర్ లాల్ నెహ్రూకు అత్యంత సన్నిహితుడు. నరేంద్ర దేవ్ మరణించినప్పుడు పండిత్ నెహ్రూ చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ ఈ సభలో ఉన్న వారిలో ఆచార్య నరేంద్ర దేవ్‌కు నాకన్నా సన్నిహితులు ఎవరూ లేరు. మాది 40 ఏళ్ల స్నేహం. స్వాతంత్య్రోద్యమంలోనూ, వ్యక్తి గత జీవితంలోనూ మేమిద్దరం చాలా సన్నిహితంగా పనిచేశాం. అలాంటివారు మళ్లీ కనిపించడం కష్టం’’ అన్నారు.