. ఆందోళన పడొద్దు… కేంద్రమంత్రితో చర్చించాం
. గుంటూరు యార్డుకెళ్లి జగన్ కోడ్ ఉల్లంఘించారు
. కృష్ణా జలాల్లో మా వాటా వాడుకుంటున్నాం
. గోదావరిలో మిగులు జలాలే ఉపయోగించుకుంటున్నాం
. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం మీడియాతో సీఎం చంద్రబాబు
. సమన్వయంతో పనిచేస్తున్నాం: పవన్ కల్యాణ్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మిర్చి రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. దిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లిన చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌పాటిల్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి… మిర్చి ధరల పతనం, రైతులను ఆదుకునే విషయాలపై మాట్లాడారు. తదుపరి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో మిర్చికి డిమాండ్ తగ్గడం వల్ల గతంలో లేనంతగా ధరలు పడిపోయాయని చంద్రబాబు తెలిపారు. దీనివల్ల మిర్చి రైతులు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో ఆలోచించాల్సిన అవసరముందని చెప్పారు. రైతులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలపై కేంద్రమంత్రితో చర్చించినట్లు తెలిపారు. ‘మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారు. అది కూడా ఐసీఏఆర్ మార్గదర్శకాల ప్రకారం ఏపీలోని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా.. ధర నిర్ణయించే పరిస్థితికొచ్చారు. సాగు ఖర్చులను క్షేత్రస్థాయిలో లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలి. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరామ’న్నారు. దీనిపై శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని కేంద్రమంత్రి చెప్పారని సీఎం తెలిపారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి పాటిల్‌తో మాట్లాడినట్లు చెప్పారు. 2027లోపు పోలవరం ప్రాజెక్ట్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దానికనుగుణంగా సహకరించాలని కోరామన్నారు. పోలవరం నీటిని బనకచర్లకు తీసుకెళ్లేందుకు కేంద్ర సహాయం కోరినట్లు చంద్రబాబు చెప్పారు. కృష్ణా జలాల్లో ఏపీ అధికంగా వాడుతుందనే ఆరోపణలు అవాస్తవమని, కేటాయించిన మేరకే వాడుతున్నామని స్పష్టం చేశారు. గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని, సముద్రంలో కలిసే నీటిని మాత్రమే అదనంగా వాడుకుంటున్నామని తెలిపారు. జల్‌జీవన్ మిషన్ అమలు గురించి కూడా చర్చించినట్లు వెల్లడిరచారు. ‘వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని సద్వినియోగించుకోలేదు. ఇంటింటికీ నల్లా ద్వారా నీరు ఇచ్చే పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. కొత్తగా డీపీఆర్ రూపొందించి జల్‌జీవన్ మిషన్ నిధులు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటాం. మొత్తం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను పూర్తిగా వినియోగించుకుంటాం’ అని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం చేతకానితనం వల్ల కేంద్ర పథకాల నిధులు వాడుకోలేదన్నారు. మిర్చి రైతుల సమస్యను జగన్ రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ గుంటూరు మిర్చియార్డుకు జగన్ వెళ్లారని, రావొద్దని పోలీసులు చెప్పినా వినలేదని చంద్రబాబు తెలిపారు. ఈసీ నిబంధనలు పాటించకపోగా… భద్రత కోరడం హాస్యాస్పదమని విమర్శించారు. సీఎం వెంట కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, లోక్‌సభా పక్షనేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.
మూడు పార్టీల సమన్వయం: పవన్
ఏపీలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళుతున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. సమన్వయం విషయంలో సందేహం లేదన్నారు. వెన్నునొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకు హాజరు కాలేదని…ఇప్పటికీ నొప్పి తీవ్రంగా ఉందన్నారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు ఇష్టమైన శాఖలని, తనకిచ్చిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్నానని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తుందన్నారు. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలు చేస్తున్నామని పవన్ కల్యాణ్ వెల్లడిరచారు.
హిమాలయాలకు వెళతారా…
పవన్‌తో మోదీ
దిల్లీ సీఎం ప్రమాణ స్వీకారంలో పవన్ కళ్యాణ్ వస్త్రాధారణ చూసిన ప్రధాని… ‘హిమాలయాలకు వెళ్దామనుకుంటున్నారా పవన్‌జీ..’ అంటూ చమత్కరించారు. అలా ఏమి లేదంటూ పవన్ సమాధానమిచ్చారు. వెంటనే ‘మీ ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి.. వాటిని చూసుకోండి…’ అంటూ పవన్ చేతిలో చేయి వేసి మోదీ పలకరించారు.