. పలస్తీనా కమ్యూనిస్టు పార్టీ
. ‘ప్రిజనర్స్ డే’న 9 వేల మంది ఖైదీలకు సంఫీుభావం
జెరూసలేం: ‘మీ (పలస్తీనా ఖైదీలు) విముక్తి…. మన (పలస్తీనా ప్రజలు) స్వాతంత్య్రమే ధ్యేయంగా ముందుకెళుతున్నామంటూ ప్రిజనర్స్ డేను పురస్కరించుకొని పలస్తీనా కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రకటన చేసింది. ఇజ్రాయిల్ దురాక్రమణ క్రమంలో యూద దేశం నిర్బంధించిన తొమ్మిది వేల మందికిపైగా పలస్తీనా ఖైదీలకు సంఫీుభావం ప్రకటించింది. అమానవీయ పరిస్థితుల్లో వేధింపులు, నిర్లక్ష్యాన్ని గురై ప్రాణాలు కోల్పోతున్న ఖైదీల దుస్థితిపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా అంతర్జాతీయ సమానం మౌనం వీడకపోవడాన్ని ఆక్షేపించింది. మానవతా సంఘాలు ఇప్పటికైనా స్పందించి పలస్తీనా పౌరుల హక్కులు, స్వాతంత్య్రం, స్వయంప్రతిపత్తి, ఔన్నత్యాన్ని కాపాడటానికి ముందుకు రావాలని పలస్తీనా కమ్యూనిస్టు పార్టీ పిలపునిచ్చింది. మన మాతృభూమి ఔన్నత్యాన్ని, మన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం, కిరాకత్వాన్ని, అవమానాలను, అణచివేతను ఎదిరించడం కోసం దురాక్రమణదారుల నిర్బంధానికి గురైన పురుషులు, మహిళలు సహా తొమ్మిది వేల మందికిపైగా పలస్తీనా ఖైదీల నిబద్ధతకు సంఫీుభావం తెలుపుతున్నామని ‘పలస్తీనియన్ ప్రిజనర్స్ డే’ ప్రకటనలో కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. ‘గాజా, వెస్ట్‌బ్యాంక్, జెరూసలేంలో ఇజ్రాయిల్ దురాక్రమణ, వైమానిక, భూతల దాడులు, వేధింపుల నడుమ ప్రిజనర్స్ డే జరుపుకుంటున్నాం. పలస్తీనా ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఆకలి చావులకు దారితీస్తూ వినాశసం సృష్టిస్తున్నారు. సామూహిక నిర్బంధ కాండ కొనసాగిస్తున్నారు. ఖైదీలుగా ఉన్న మన వాళ్ల హక్కులు హరిస్తూ… శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పౌష్టికాహారం లేక వారు నీరసించిపోతుంటే చూసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. విచారణకు తావు లేకుండా దశాబ్దాల పాటు జైళ్లకు పరిమితం చేస్తున్నారు. వందల సంవత్సరాల శిక్షలు విధిస్తూ వేధిస్తున్నారు. అమానవీయ పరిస్థితుల్లో గత ఏడాదిలో 70 మంది చనిపోయారు. ముఖ్యంగా గాజాపై ఇజ్రాయిల్ మారణహోమం మొదలైనప్పటి నుంచి పరిస్థితి మరీ దారుణంగా మారింది’ అని పలస్తీనా కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది. ఖైదీల విడుదలకు డిమాండ్ చేసింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, మానవతా సంస్థలు ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ తక్షణమే జోక్యం చేసుకొని సామూహిక అరెస్టులు, నిర్బంధ కాండ, వేధింపుల నుంచి ఖైదీలకు విముక్తి కల్పించాలని పిలుపునిచ్చింది.‘ఖైదీలకు విముక్తి, అమరులకు గౌరవం, ప్రజా ఉద్యమాల్లో విజయమే లక్ష్యమంటూ సంకల్పించింది. పలస్తీనా ప్రజల పోరాటం వర్థిల్లాలి, పలస్తీనా కమ్యూనిస్టు పార్టీ, శ్రామిక వర్గ గళం`తిరుగుబాటు వర్థిల్లాలని పలస్తీనా కమ్యూనిస్టు పార్టీ నినదాలిచ్చింది.