ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఉపాధ్యాయ, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈనెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఉపాధ్యాయ, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో దాదాపు 16 జిల్లాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 3,14,984 మంది ఓటర్లుండగా… వీరిలో మహిళలు 1,31,618 మంది, పురుషులు 1,83,347 మంది ఉన్నారు. వీరి కోసం మొత్తం 456 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి… 2,714 మంది సిబ్బందిని కేటాయించారు. ఈ నియోజకవర్గానికి మొత్తం 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,47,116 మంది ఓటర్లుండగా, వారిలో పురుషులు 2,06,486 మంది, మహిళలు 1,40,615 మంది ఉన్నారు. 483 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 2,834 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. ఈ నియోజకవర్గానికి 25 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో మొత్తం 22,493 మంది ఓటర్లుండగా, వీరిలో పురుషులు 13,508 మంది, మహిళలు 8,986 మంది ఉన్నారు. వీరి కోసం మొత్తం 123 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా… 10 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 738 మంది సిబ్బందిని నియమించారు. మూడు నియోజకవర్గాల్లోనూ కూటమి, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. ఈనెల 27వ తేదీ పోలింగ్ నిర్వహించే ఈ జిల్లాల పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకోసం దాదాపు 8,515 మంది పోలీస్ బలగాలను వినియోగిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం నుంచి 27వ తేదీ సాయంత్రం వరకు మొత్తం 16 జిల్లాల్లో 48 గంటలపాటు మద్యం షాపులు మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.