ఉప ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ బాహాబాహీ
. టీడీపీ ఖాతాలోకి హిందూపురం, నూజివీడు
. ఏలూరు డిప్యూటీ మేయర్లు ఏకగ్రీవం
. తిరుపతిలో కార్పొరేట్లకు రక్షణ కల్పించాలి: ఏపీ హైకోర్టు ఆదేశం
. తిరుపతి, నందిగామ, పిడుగురాళ్ల ఎన్నికలు నేటికి వాయిదా
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఉప ఎన్నికలు వివాదాస్ప దంగా మారాయి. ఎన్డీఏ కూటమి (టీడీపీ
జనసేన`బీజేపీ) కి వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొన్ని మున్సిపాల్టీల చైర్మన్లను టీడీపీ చేజిక్కించుకోగా, మరికొన్ని కోరమ్ లేకపోవడంతో మంగళవారానికి వాయిదా పడ్డాయి. డిప్యూటీ చైర్మన్ల ఎంపికలోనూ వివాదం నెలకొంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మొదటి నుంచి ఈ చైర్మన్ పదవి ఉత్కంఠ రేపింది. మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి రమేశ్ ఎన్నిక య్యారు. రమేశ్‌కు అనుకూలంగా 23 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి లక్ష్మీకి అనుకూలంగా 14 ఓట్లు వచ్చాయి. హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్ కుర్చీలో రమేష్‌ను కూర్చోబెట్టారు. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పార్టీ మారిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నినదించగా, దానికి పోటీగా జై బాలయ్య అంటూ టీడీపీ కౌన్సిలర్ల నినాదాలు చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో వైసీపీ 30 గెలుచుకోగా… టీడీపీ ఆరు స్థానాలకే పరిమితం అయింది. బీజేపీ, ఎంఐఎం చెరొక వార్డు గెలుచుకున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక 14 మంది వైసీపీ కౌన్సిలర్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరుగుతుండడంతో కౌన్సిలర్లు చేజారకుండా టీడీపీ క్యాంపు రాజకీయాలు చేపట్టింది. టీడీపీ ఖాతాలోకి నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ వెళ్లింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మొత్తం 18 మందితో టీడీపీ ఘన విజయం సాధించింది. అటు వైసీపీ అభ్యర్థికి కేవలం 14 మందే మద్దతిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు చేరడంతో ఈ విజయం టీడీపీకి వరించింది.
ఏలూరు కార్పొరేషన్‌లో ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి అధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు తొలి డిప్యూటీ మేయర్‌గాను, 47వ డివిజన్ కార్పొరేట్ వందనాల దుర్గాభవానీ రెండో డిప్యూటీ మేయర్‌గాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ కార్పొరేటర్లు ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. మొత్తంగా 50 మంది కార్పొరేటర్లకుగాను, 30 మంది టీడీపీ కార్పొరేటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్య పరిణామాలతో వాయిదా పడిరది. సోమవారం ఉదయం 11 గంటలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికల జరగాల్సి ఉన్నప్పటికీ, 50 మంది సభ్యుల్లో కేవలం 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నికలు నిర్వహించడానికి కనీసం కోరం (50 శాతం) లేకపోవడంతో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఎన్నికలను మంగళవారానికి వాయిదా వేశారు. తిరుపతి రాజకీయాలు కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. తమ పార్టీ కార్పొరేటర్‌లను బలవంతంగా కిడ్నాప్ చేసి హోటళ్లకు తరలించారని వైసీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్‌రెడ్డి ఆరోపించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కూటమి నుంచి మునికృష్ణను ప్రకటించగా, వైసీపీ చివరి నిముషంలో లడ్డు భాస్కర్‌ను రంగంలోకి దించింది. వైసీపీ అభ్యర్థికి మద్దతు తగ్గడంతో వారి కార్పొరేటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికను ఎస్వీయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో గట్టి బందోబస్తు నడుమ నిర్వహించారు. తొలుత కూటమి కార్పొరేటర్లు ముందుగానే అక్కడకు హాజరు కాగా, వైసీపీ కార్పొరేటర్లు ప్రత్యేక బస్సుల్లో ఎన్నిక కేంద్రానికి వచ్చారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడి, కూటమి పార్టీల అనుచరులు కొందరు బస్సుపై దాడి చేసి కార్పొరేటర్లను కారులో తీసుకెళ్లారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ సంఘటన తర్వాత ఎన్నికను వైసీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. దీంతో ఈ ఎన్నికనూ వాయిదా వేయడంతో మరింత ఉత్కంఠకు దారితీసింది. అటు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు. దానిపై విచారించిన హైకోర్టు… కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని, ఆ దిశగా ఎస్పీకి వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. కార్పొరేటర్లు బయలుదేరి వెళ్లే దగ్గర నుంచి సెనేట్ హాలుకు చేరుకునే వరకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికనూ కోరమ్ లేకపోవడం, టీడీపీ అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో గందరగోళం నడుమ వాయిదా పడిరది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాల్టీ వైస్ చైర్మన్ ఎన్నికనూ వాయిదా వేశారు. నెల్లూరు జిల్లా డిప్యూటీ మేయర్ ఎన్నిక పైనా కూటమి పార్టీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పార్వతీపురం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికలో కూటమి పార్టీలకు, వైసీపీకి మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకోవడంతో వాయిదా పడిరది.