Tuesday, March 4, 2025
Homeతెలంగాణమేడారం, గోదావరి పుష్కరాలుప్రతిష్ఠాత్మకంగా జరుపుకుందాం

మేడారం, గోదావరి పుష్కరాలుప్రతిష్ఠాత్మకంగా జరుపుకుందాం

విశాలాంధ్ర-హైదరాబాద్‌ : సమ్మక్క, సారలమ్మ (మేడారం) జాతర, గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ తెలిపారు. రెండు ఉత్సవాలు సజావుగా సాగేలా చర్యలు ఉండాలని దేవాదాయ శాఖకు సూచనలు చేశారు. అదే సమయంలో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని, పురాతన ఆలయాలను పునరుద్ధరించడంపై మార్గదర్శకాలు అందించారు. అర్బన్‌ పార్కుల అభివృద్ధితో ఆదాయం పెంచేలా మార్గాలు అన్వేషించాలన్నారు. భట్టి విక్రమార్క, కొండా సురేఖ మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ప్రీ బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించారు. దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల అధికారులతో చర్చించారు. శాశ్వత ప్రాతిపదికన పనులు జరగాలని సూచించారు. టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతాలు, అర్బన్‌ పార్కుల అభివృద్ధితో ఆదాయం పెంచుకోవాలని అన్నారు. పురాతన ఆలయాలు పునరుద్ధరించేలా పురావస్తు శాఖకు సూచనలు చేశారు. రాష్ట్రంలోని ఆరు ప్రధాన ఆలయాలాభివృద్ధికి కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో అర్బన్‌ పార్క్‌ల అభివృద్ధితో ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో సేద తీరేందుకు అవకాశం ఉంటుందన్నారు. అటవీ హక్కు చట్టం ద్వారా పోడు భూములకు పట్టాలు ఇచ్చామని, అటవీ శాఖతో సమన్వయం లేక కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడిరచగా త్వరలోనే అటవీ, గిరిజన, ఉద్యాన, వ్యవసాయ, ఇంధన శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తామని భట్టి తెలిపారు. గిరిజన రైతుల సమస్యల పరిష్కారం, వివిధ పంటల సాగుతో అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోవడం, పంపుసెట్ల వినియోగం కోసం సోలార్‌ విద్యుత్‌ కల్పన వంటి అన్ని అంశాలను ఆ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకొని చెక్‌ డ్యాములు, ఇతర పనులు చేపట్టాలని భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్‌తో పాటు పరిసరాల్లో 59 అర్బన్‌ పార్కులను అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు. వన మహోత్సవంలో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. రెండున్నర అడుగుల ఎత్తుకు తగ్గకుండా ఉన్న మొక్కలను నాటడం ద్వారా అవి బతికేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీం, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రమా అయ్యర్‌, అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ డోబ్రియాల్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు