Tuesday, February 4, 2025
Homeవిశ్లేషణమేడి పండు అమెరికా!

మేడి పండు అమెరికా!

బొల్లిముంత సాంబశివరావు

ఆకాశాన్నంటే భవనాలు, బహుళజాతి సంస్థలు, మంచి ఉద్యోగాలు, భారీ వేతనాలు, అద్భుతమైన జీవితంగా అమెరికా గురించి మధ్య తరగతి జీవుల ఊహలు. అక్కడి పరిస్థితులు ఈ ఊహలకు భిన్నంగా ఉన్నాయి. అక్కడి పేదరికం, సంపద కేంద్రీకరణ, అప్పులు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉద్యోగుల తొలగింపు ఆ దేశ వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది దాని మేడి పండు స్వభావం. భూతల స్వర్గంగా ప్రచారం చేస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాలపై ఆధారపడి కొనసాగుతున్నది. ప్రపంచంలో ఏ దేశంలో లేని సంపద అసమానతలు అమెరికాలో ఉన్నాయి. ఇది 1920 నుంచి ఎన్నడూ లేనంత స్థాయిలో ఉంది. గత 30 సంవత్సరాల్లో అగ్రశ్రేణి 1 శాతం ప్రజల సంపదలో 21 ట్రిలియన్ల (1 ట్రిలియన్‌ లక్ష కోట్లు) డాలర్లు పెరిగితే, దిగువ సగం మంది ప్రజలు 9 వందల బిలియన్ల డాలర్ల సంపదను కోల్పోయారు. ఐరోపా కన్నా అమెరికాలో ధనిక, పేదల మధ్య అంతరం వేగంగా పెరిగిందని ఇంపీరియల్‌ కాలేజీ బిజినెస్‌ స్కూల్లో ఫైనాన్స్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అధ్యయన ప్రధాన రచయితలలో ఒకరైన డాక్టర్‌ క్లారా మార్పినెజ్‌-టోలెనాడో తెలియజేశారు. 1980 నుంచి సంపద అంతరం కొనసాగుతుంది. అమెరికాలోని అగ్రశ్రేణి 1శాతం వారి సంపద ఐరోపా కంటే ఎక్కువ పెరిగింది.
2019 లెక్కల ప్రకారం, అమెరికాలో 10.5 శాతం మంది పేదలు ఉన్నారు. ది జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోషియేషన్‌ ప్రచురించిన 2023 అధ్యయనం ప్రకారం అమెరికాలో పేదరికంతో సంవత్సరానికి దాదాపు 3 లక్షల మంది మరణిస్తున్నారు. పేదరికంలో ఉన్న పిల్లలు యుక్త వయస్సులో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అమెరికా ఆహార ధాన్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నా, ఆ దేశంలో ప్రజలు తీవ్ర ఆహార సమస్యను ఎదుర్కొంటున్నారు. 2023లో దాదాపు 13.5శాతం కుటుంబాలు ఆహార అభద్రతలో ఉన్నాయి. 2019లో జరిగిన అధ్యయనంలో గ్రాడ్యుయేట్‌ లోపు విద్యార్థులలో 40శాతం మంది ఆహార అభద్రతలో ఉన్నారు. కోవిడ్‌-19 సమయంలో అమెరికా కుటుంబాలకు ఆహార అభద్రత రెట్టింపు అయ్యింది. ఇది చిన్న పిల్లలు ఉన్న కుటుంబాల్లో అధికంగా ఉంది. 2020 నవంబరులో సేకరించిన హౌస్‌ హాల్డ్‌ సర్వే డేటా ప్రకారం 2.6 కోట్ల మంది వయోజనులు (అంటే వయోజన జనాభాలో 12శాతం) వారం రోజులు ఆహార కొరతను ఎదుర్కొన్నారు.
అమెరికాలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. 2023లో నిరుద్యోగ రేటు 3.9శాతం ఉంటే, 2024లో 4.1 శాతానికి పెరిగింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. 2001 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం 2 కోట్లకు పైగా ఉద్యోగులను తొలగించారు. 2020 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కోవిడ్‌ కారణంగా రికార్డు స్థాయిలో తొలగింపులు జరిగాయి. ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగ భృతి ప్రయోజనం పొందుతున్నవారు 18లక్షల, 70 వేలమంది. 2024 డిసెంబరులో కొత్తగా నిరుద్యోగ భృతి కోరుతూ 2లక్షల, 20 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అమెరికా వ్యవసాయ నివేదిక ప్రకారం, 2022తో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు 11శాతం పైగా పెరిగాయి. గుడ్డు ధర 4.8శాతం, బీఫ్‌ 3శాతం కంటే ఎక్కువ పెరిగింది. వాటర్‌ గైడ్స్‌ చేపట్టిన సర్వేలో నిత్యావసరాలకోసం అవుతున్న ఖర్చులు తమ జీవితాలను తారుమారు చేస్తున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల తొలగింపు, కొత్త ఉద్యోగాలు రాకపోవటంతో చేతిలో చిల్లిగవ్వ ఉండటంలేదని, ఆర్థిక వత్తిడితో మానసిక వత్తిడికి గురౌతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువకుల్లో ఈ వత్తిడి తీవ్ర స్థాయిలో ఉంది.
దేశ అప్పులు: అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎంత డొల్లతనమో దాని అప్పులే తెలియ చేస్తున్నాయి. తాజా లెక్కల (27-9-24 వరకు) ప్రకారం అమెరికా చేసిన అప్పులు 36 ట్రిలియన్‌ ( 36 లక్షల కోట్ల డాలర్లు ) డాలర్లు. భారత కరెన్సీలో 3,035 లక్షల కోట్ల రూపాయలు. 2024లోనే 2లక్షల డాలర్ల అప్పు చేసింది. ఈ అప్పుల ఫలితంగా అమెరికాలోని ప్రతి పౌరుని పైనా 91 లక్షల రూపాయల అప్పు ఉంది. కొన్ని దశాబ్దాలుగా అమెరికా అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. 2000 సంవత్సరం నాటికి 5.7 ట్రిలియన్‌ డాలర్ల అప్పు ఉండగా 2024 36 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది. ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల మొత్తం విలువ కన్నా అమెరికా అప్పులే ఎక్కువ.
సెల్‌: 9885983526

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు